పత్తికి ప్రాణం

పత్తికి ప్రాణం - Sakshi


 నల్లగొండ అగ్రికల్చర్ : నెల రోజులుగా వరుణుడు కరుణించకపోవడంతో జిల్లాలో వేసిన మెట్టపంటలు పూర్తిగా వాడిపోయి ఎండిపోయే దశకు చేరుకున్నాయి. పంటలు ఎండిపోతాయేమోనన్న ఆందోళనలో ఉన్న రైతులకు అల్పపీడనం వల్ల కురిసిన వర్షం కొండంత ధైర్యాన్ని నింపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు రోజులుగా జిల్లాలో ముసురుతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. ఆదివారం జిల్లాలోని బొమ్మలరామారం, యాదగిరిగుట్ట, పోచంపల్లి,  చౌటుప్పల్, మర్రిగూడ, దేవరకొండ మండలాలు మినహా మిగతా మండలాల్లో జల్లులతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా మేళ్లచెరువులో 50.2 మిల్లీమీటర్లు, హుజూర్‌నగర్‌లో 45 మిల్లీమీటర్లు, మునగాలలో 44.2 మిల్లీమీటర్లు, మఠంపల్లిలో 42.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

 

 అత్యల్పంగా నారాయణపురం, బీబీనగర్ మండలాల్లో 1 మిల్లీమీటరు వర్షం పడింది. సగటున జిల్లాలో 13.1 మిల్లీమీటర్లు కురిసింది. వర్షం పత్తి, కంది, పెసర, జొన్న, సజ్జ. మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, ఆముదం పంటలకు ప్రాణం పోసింది. ఖరీఫ్‌లో సాధారణ సాగు 4లక్షల 83 వేల452 హెక్టార్లకు గాను గత ఖరీఫ్‌లో 6లక్షల2 వేల 799 హెక్టార్లు సాగు చేశారు. అందులో అగ్రభాగంగా పత్తిని 3లక్షల 35వేల 976 హెక్టార్లు కాగా వరి లక్షా 92 వేల 185 హెక్టార్లలో సాగైంది. అదే రీతిలో ఈ ఖరీఫ్‌లో కూడా సాగు అవుతుందని భావించినా వరుణుడు ముఖం చాటేయడంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఇప్పటి వరకు కేవలం లక్షా 98 వేల 144 హెక్టార్లలో మాత్రమే సాగుకు నోచుకుంది. అందులో పత్తి  లక్షా 59వేల 632 హెక్టార్లు, వరి 22వేల 568 హెక్టార్లు  మిగతా కంది, పెసర తదితర మెట్ట పంటలను సాగు చేశారు.

 

 జీవం పోసిన వర్షం

 అల్పపీడనం కారణంగా కురిసిన వర్షం జిల్లాలో పత్తిపంటకు ప్రాణం పోసింది. జిల్లాలో మూడు దశల్లో పత్తి మొక్కలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో ముందుగా విత్తనం వేసిన చోట పూత దశలో ఉండగా కొన్ని ప్రాంతాలలో నాలుగైదు ఆకులు వేసిన దశలో ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాలలో మాత్రమే అప్పుడే మొలక దశలో ఉన్నాయి. అయితే వర్షాభావ పరిస్థితులలో వాడుపట్టి ఆకులు వాలుతున్న దశలో ఉన్న తరుణంలో జల్లులతో కూడిన వర్షం పత్తికి జీవం పోసింది. పూర్తిగా పదునై భూమిలో తేమశాతం నిండిపోయింది.

 

 ఎరువుల కోసం పరుగులు

 మంచి పదునైన వర్షం కురవడంతో పత్తిచేలకు ఎరువులు పెట్టుకోవడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు గుంటకలు తోలి ఉన్నప్పటికి వర్షంలేకపోవడంతో ఎరువులు పెట్టక సరైన పోషకాలు అందని కారణంగా ఆకులు వాలిపోయి ఉన్నాయి. ప్రస్తుతం కురిసిన వర్షం అదును ఇచ్చిన వెంటనే ఎరువులు పెట్టుకోవడానికి ఎరువుల కొనుగోలు కోసం పట్టణాలకు పరుగులు తీస్తున్నారు.

 

 ఆరుతడి పంటలే వేసుకోవాలి : బి.నర్సింహారావు, జేడీఏ

 వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షం మెట్టపంటలకు జీవంపోసింది. వర్షం కురుస్తున్నప్పటికీ రైతులు ఇంకా పత్తి, వరి పంటల జోలికి వెళ్లకుండా ఆరుతడి పంటల సాగు చేసుకోవాలి.  జొన్న, ఆముదం, కంది, మొక్కజొన్న పంటలు సాగుచేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. వర్షం వస్తుందని ఆశించి ఇంకా పత్తి, వరి సాగు చేసుకుని నష్టపోవద్దు. పత్తిపై సస్యరక్షణ చర్యలు, ఎరువుల వాడకం కోసం ఆయా మండలాల వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలి.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top