రైతులు ఏకమవ్వాలి

రైతులు ఏకమవ్వాలి - Sakshi


పంటకు ధర నిర్ణయించుకునే స్థాయికి ఎదగాలి: కేసీఆర్‌

వచ్చే ఏడాది నుంచే సాగుకు పెట్టుబడి సాయం

రైతుల లెక్కల్లో తేడాలతో ఇబ్బందులు వస్తున్నాయి

అందుకే పక్కాగా వివరాల నమోదు చేపట్టాం

నిజమైన రైతులకు మాత్రమే ప్రభుత్వ సాయం

గ్రామాల అభివృద్ధితోనే తెలంగాణ అభివృద్ధి

అంతా ఏకమై సమస్యలను పరిష్కరించుకోవాలి

ఇంటింటికీ ఆరు చొప్పున మొక్కలు నాటండి

వాటికి కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకుని పెంచండి

కేశవరం, లక్ష్మాపూర్‌ గ్రామసభల్లో పాల్గొన్న కేసీఆర్‌


మేడ్చల్‌

రాష్ట్రంలో రైతులు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని... తాము పండించిన పంటలకు తామే ధర నిర్ణయించుకునే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రైతుల సాగుకు తోడ్పడేందుకు ఏటా ఎకరానికి రూ.8 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. భూమి ఉండి, సాగు చేసుకుంటున్న రైతుల లెక్క తేల్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇక గ్రామాల అభివృద్ధితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యపడుతుందని, గ్రామస్తులంతా ఏకమై శ్రమదానం చేసి.. తమ గ్రామ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలంలోని కేశవరం, లక్ష్మాపూర్‌ గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభల్లో కేసీఆర్‌ పాల్గొన్నారు. మధ్యాహ్నం 2.50 గంటలకు కేశవరం చేరుకున్న సీఎం కేసీఆర్‌.. గ్రామ శివార్లలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్నారు.



గ్రామ సమస్యలపై అధికారులు, సర్పంచ్‌ ఇచ్చిన నివేదికను పరిశీలించి... ఆయా సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. తర్వాత దాదాపు గంట పాటు ప్రసంగించారు. అనంతరం లక్ష్మాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. గురువారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళుతున్న సమయంలో కేశవరం, లక్ష్మాపూర్‌ గ్రామాల వద్ద కాన్వాయ్‌ ఆపి స్థానికులతో మాట్లాడానని.. వారు పలు సమస్యలు చెప్పుకోవడంతో, ఆ సమస్యల పరిష్కారం కోసం స్వయంగా గ్రామసభలకు హాజరయ్యానని కేసీఆర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాలపై వరాల జల్లు కురిపించారు.



లెక్కల్లో తేడా ఉంటే ‘సాయం’ఎలా?

రాష్ట్రంలో భూములు కలిగిన రైతుల సంఖ్య ఇటీవలి వ్యవసాయ శాఖ సర్వేలో ఒకలా తేలితే.. రెవెన్యూ లెక్కల ప్రకారం మరోలా ఉందని కేసీఆర్‌ పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి సాగు కోసం ఎకరాకు రూ.8 వేల చొప్పున సాయం అందించాలని భావించానని.. ఇలాంటి లెక్కల వల్ల ఎలా రైతులకు పెట్టుబడి డబ్బులు జమ చేయాలని పేర్కొన్నారు. త్వరలో రెవెన్యూ అధికారులు రైతుల వద్దకు వస్తారని.. పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టి రైతుల వివరాలు పక్కాగా నమోదు చేస్తారని తెలిపారు. ఇందుకోసం గ్రామాల్లోని రైతులు సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. నిజమైన రైతుల వివరాలు రికార్డుల్లో నమోదు చేసేలా చూసి.. ప్రభుత్వ సాయం వారి ఖాతాల్లో జమయ్యేలా చూడాలని కోరారు. రైతులకు సాగు పెట్టుబడి కోసం ఏటా రూ.500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఇలా రైతులకు సాగు పెట్టుబడి కోసం ప్రభుత్వమే డబ్బులిచ్చే విధానం దేశంలో ఎక్కడా లేదని.. రైతులు గర్వంగా బతకాలన్నదే తన సంకల్పమని చెప్పారు.



మొక్కలు పెంచండి.. పాడి పశువులను పొందండి గత ప్రభుత్వాలు, పాలకుల నిర్లక్ష్యం వల్లే హరితవనంగా ఉండాల్సిన తెలంగాణ గ్రామాలు దుర్భిక్షమయంగా మారిపోయాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని నివారించి, భవిష్యత్‌ తరాలకు పచ్చని వాతావరణం అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. గ్రామాల్లో ఇంటింటికీ ఆరు చొప్పున మొక్కలు నాటాలని.. వాటికి ఇంట్లో వారి పేర్లు, కుటుంబంలో మరణించిన వారి పేర్లు పెట్టుకుని పెంచాలని కోరారు. తాను రెండేళ్ల తర్వాత వస్తే ఈ గ్రామాల్లో అన్ని చెట్లే కనబడాలన్నారు. జనవరిలో తాను పలు ఇళ్లను సందర్శించి, మొక్కలు నాటి బాగా సంరక్షించిన కుటుంబానికి ప్రభుత్వం తరఫున రెండు పాడి పశువులను బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు.



రెండు గ్రామాలపై వరాల జల్లు

తెలంగాణ తొలిదశ పోరాటంలో స్ఫూర్తిదాయకంగా నిలిచిన గౌడవెళ్లి వెంకట్రాంరెడ్డి, మూడుచింతలపల్లి వీరారెడ్డిలు పుట్టినగడ్డ మేడ్చల్‌ జిల్లా అని కేసీఆర్‌ పేర్కొన్నారు. అలాంటి అమరులు పుట్టినగడ్డను అభివృద్ధిపర్చాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి మేడ్చల్, నల్లగొండ జిల్లాలకు సాగు నీరు అందిస్తామని, రైతుల పొలాలను సిరుల మాగాణిగా మారుస్తామని చెప్పారు. ఇక కేశవరం గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, మినీ ఫంక్షన్‌హాల్, డంపింగ్‌ యార్డు, విద్యుత్‌ సమస్య, స్మృతివనం, వైకుంఠ ధామం, అంగన్‌వాడీ భవనం ఏర్పాటు వంటి పలు సమస్యల పరిష్కారానికి రూ.12 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. లక్ష్మాపూర్‌ గ్రామంలో సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల కోసం రూ.13 కోట్ల 48 లక్షలు ఇవ్వాలని గ్రామస్తులు కోరగా.. రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం వీటికి సంబంధించిన జీవోలు జారీ చేస్తామన్నారు. ఆరు నెలల్లో ఈ పనులన్నీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. రెండు గ్రామాలలో ఒక రోజు పవర్‌డేగా ప్రకటించుకుని.. ఆ రోజు విద్యుత్‌ సమస్యలన్నీ తీర్చుకోవాలని సూచించారు. గ్రామస్తులంతా ఏకమై శ్రమదానం చేసి గ్రామ అభివృద్ధికి పాటు పడాలని.. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పనులను పర్యవేక్షించాలని కోరారు.



ఆగస్టు 8న మళ్లీ వస్తా..

తాను మళ్లీ ఈ నెల 8వ తేదీన వస్తానని.. ఈ రెండు గ్రామాల్లో ఏదో ఒక గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తానని కేసీఆర్‌ చెప్పారు. ఆ రోజు మూడుచింతలపల్లిలో గ్రామసభలో పాల్గొంటానని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top