గిరిజనేతర రైతులకు రుణమాఫీ దక్కేనా?


- ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉంటున్న గిరిజనేతరులు

- పహాణీలతో రుణాలిచ్చిన బ్యాంకులు

- గతంలో రుణమాఫీ పొందిన రైతులు

- రుణ మాఫీ అర్హత పత్రాలు ఎస్టీలకే ఇవ్వాలంటున్న కలెక్టర్


గోవిందరావుపేట : ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దాలుగా జీవిస్తున్న గిరిజనేతర రైతులకు అధికారులు మొండి చేరుు చూపనున్నారనే వార్తలు వారిలో కలకలం రేపుతోంది. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు, కొత్తగూడ, వెంకటాపురం, మహబూబాబాద్, గూడూరు, నర్సంపేట, భూపాలపల్లి, ఖానాపురం, నల్లబెల్లి మండలాలు ఉన్నాయి. 13 మండలాల్లో ప్రతీ మండలంలోనూ గిరిజనేతర రైతులు దశాబ్దాల కాలంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు.



గోవిందరావుపేట మండలంలో 5,510 మంది రైతులకు రుణమాఫీ అందాల్సి ఉందని అధికారులు లెక్కలు తేల్చారు. దీంతో మండలంలో రుణ మాఫీ కావాల్సిన రూ.20 కోట్లలో దాదాపు రూ.5 కోట్లు ప్రస్తుతం బ్యాంకుల్లో రైతుల ఖాతాల్లోకి చేరాయి. అయితే వీరిలో మండలంలో ఉన్న  గిరిజనేతర రైతులే 4 వేల మంది వరకు ఉంటారని అంచనా. ఏజెన్సీ ప్రాంతంలో నివాసముంటున్న గిరిజనేతరులకు పట్టాలు ఉండవు. దీంతో 50 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు కూడా కేవలం పహాణీలే అందిస్తున్నారు. దీంతో బ్యాంకులు కూడా పహాణీల ద్వారా రైతులకు రుణాలు అందిస్తున్నాయి.



గత రెండేళ్లుగా  గతంలో వచ్చిన పహాణీలను అధికారులు నిలిపివేయడం, రైతులకు నోటీసులు అందించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పహాణీలు రాకపోవడంతో బ్యాంకుల్లో రుణాలు కట్టి తీసుకునే రైతులు తగ్గిపోయారు. కాగా తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం మొదటి విడతగా 25 శాతం రుణమాఫీ డబ్బును బ్యాంకులకు అందించింది. ఈ పథకంలో లబ్ధిదారులకు తహసీల్దార్ల ద్వారా రుణమాఫీ అర్హత పత్రాలను రైతులకు అందించనున్నారు. అయితే ఏజెన్సీ ప్రాంతంలో కేవలం గిరిజన రైతులకే వీటిని అందించాలని కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో కలెక్టర్ కిషన్ ఆదేశాలు జారీ చేయడంతో గిరిజనేర రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.



ఇదే విషయమై కొత్తగూడ మండల కేంద్రంలో రైతులు ఇటీవల ఆందోళన నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్లు కూడా తమ సిబ్బంది ద్వారా ముందుగా తమ వద్ద ఉన్న రుణాలు కలిగిన రైతుల్లో ఎస్టీలను గుర్తించే పనిలోపడ్డారు. వారికి రుణమాఫీ అర్హత పత్రాలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో మిగతా గిరిజనేతర రైతులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రైతుల సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. లేనట్లరుుతే రుణ భారంతో మళ్లీ రైతులు గడ్డుపరిస్థితిని ఎదుర్కోవడం తప్పేలా లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top