గాలివాన, వడగళ్ల బీభత్సం


దోమ / కుల్కచర్ల, న్యూస్‌లైన్:  అన్నదాత ఆశలను ప్రకృతి అడియాస చేసింది. శుక్రవారం జోరుగాలి, వడగళ్లతో విరుచుకుపడిన వాన దోమ, కుల్కచర్ల మండలాల్లో పంటలను నాశనం చేసింది. తీవ్రమైన గాలికి వడగళ్ల వర్షం తోడవడంతో వేల సంఖ్యలో మామిడి కాయలు రాలిపోయాయి. గాలివాన బీభత్సానికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి పలువురు నిరాశ్రయులయ్యారు.



 దోమ మండలంలోని పలు గ్రామాల్లో 120 ఎకరాల్లో పెంచుతున్న మామిడి తోటల్లో కాయలు నేలరాలి రైతులకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. ఉదన్‌రావుపల్లి గ్రామంలో వడగళ్ల ధాటికి సుమారు 40ఎకరాల్లో వరి పంట చేతికందకుండా పోయింది. దోమతో పాటు ఎల్లారెడ్డిపల్లి, లింగన్‌పల్లి, దిర్సంపల్లి, బ్రాహ్మణ్‌పల్లి, ఉదన్‌రావ్‌పల్లి, పాలేపల్లి, ఐనాపూర్, మోత్కూర్ తదితర గ్రామాల్లో పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.



 కన్నీటిపర్యంతమైన రైతులు

 వడగళ్ల వాన దోమతో పాటు ఉదన్‌రావ్‌పల్లి గ్రామాల్లో వరి పంట సాగు చేస్తున్న రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. సుమారు 40 ఎకరాల్లో ధాన్యం నేల రాలి పాడైపోయింది. ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంట కళ్ల ముందే పాడవడంతో రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. ఒక్క దోమ గ్రామంలోనే రైతు గానుగ నర్సయ్య 16 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట పూర్తిగా నాశనమైంది. దోమ సర్పంచ్ రాధాబాయి గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి తెలుసుకున్నారు. బాధిత రైతులకు పరిహారం అందించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.



 కుల్కచర్లలో...

 మండలంలో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులు, వడగళ్లు ప్రజలతో పాటు రైతులకు నష్టం మిగిల్చాయి. అంతారం, కుల్కచర్ల, బండ వెల్కిచర్ల, పుట్టపహడ్, ఘణపూర్ గ్రామాల్లో సుమారు 500 ఎకరాల్లో వరి పంట దెబ్బతినగా, తోటల్లో పెద్దసంఖ్యలో మామిడికాయలు నేలరాలాయి. జోరుగాలికి కుల్కచర్ల, బంగరంపల్లి గ్రామాల్లో 20 ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. మండల కేంద్రంలో ఈడ్గి పుల్లయ్యగౌడ్ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top