చితికిపోతున్న రైతన్న

చితికిపోతున్న రైతన్న - Sakshi


 సాక్షిప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ రైతు అన్యాయమై పోతున్నాడు. ఆయకట్టు, ఆయకట్టేతర అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల రైతులు దిగులు పడుతున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసిపోయింది. అయినా, వాన జాడలేక, ప్రాజెక్టుల్లోకి నీరు చేరక సాగు చేసింది లేదు. అడపాదడపా కురిసిన వానలకు మురిసిపోయి సాగుచేసినా పత్తి మొలకె త్తింది చాలా తక్కువ. దీంతో పత్తి సాగుకోసం పెట్టిన పెట్టుబడులు మట్టిలో పోసినట్టయ్యింది. రాష్ట్రంలో అత్యధికంగా భూగర్భ జలాలను వినియోగించే జిల్లాల్లో నల్లగొండ కూడా ఒకటి. జిల్లాలో 2.87లక్షల పంపుసెట్లు (బావులు/బోరుబావులు) వినియోగిస్తున్నారు.

 

 దీంతో విద్యుత్ వినియోగమూ ఎక్కువగానే ఉంది. అయితే, అరకొరగా, వేళాపాలా లేని విద్యుత్ సరఫరాతో బోర్లు, బావుల కింద సాగవుతున్న పంటలకూ గ్యారెంటీ లేకుండా పోయింది. ఇక పంటల సాగు కోసం  ఇప్పటికే అప్పుల పాలైన అన్నదాతకు కొత్త రుణం పుట్టడం లేదు. పాత రుణం చెల్లిస్తే కదా.. కొత్త రుణాలు ఇచ్చేది అని బ్యాంకర్లు భీష్మిస్తున్నారు. ప్రభుత్వం పంటరుణాలు మాఫీ చేస్తానని అన్నది కాబట్టి, తామెలా బకాయిలు చెల్లిస్తామన్నది రైతుల వాదన.  ఈ నేపథ్యంలోనే రైతులకు పెట్టుబడుల ఖర్చులకు ఎక్కడా పైస పుట్టడం లేదు.

 

 గతేడాది ఇదే సమయంలో...

 గత ఏడాది ఖరీఫ్‌లో సరిగ్గా ఇదే సమయానికి రూ. 1041 కోట్ల పంట రుణం ఇచ్చారు. సుమారు 3 లక్షల 24వేల మంది రైతులు రుణాలను పొందారు. కానీ ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు కేవలం రూ. 221 కోట్లు మాత్రమే పంట రుణాలు ఇచ్చారు. వాస్తవానికి ఈ ఏడాది క్రెడిట్ ప్లాన్ ప్రకారం ఖరీఫ్ సీజన్ ఆఖరు నాటికి రూ. 1226కోట్లు రుణాలు పంపిణీ కావాల్సి ఉంది. కానీ ఇచ్చింది మాత్రం రూ. 221కోట్లే కావడం గమనార్హం.  పంట రుణాల మాఫీకి సంబంధించి బ్యాంకర్లు, అధికారులు అన్ని లెక్కలు సిద్ధం చేసినా, ఇంకా స్పష్టత రాకపోవడంతో  మాఫీ ప్రక్రియ మొదలు కాలేదు.

 

 పాత రుణాలు బకాయి ఉండగా,  కొత్త రుణాలు ఇచ్చే వీలెక్కడిదన్న బ్యాంకర్ల ప్రశ్నతో అసలు రైతులు బ్యాంకుల వైపు వెళ్లడమే మానేశారు. జిల్లాలో లక్ష రూపాయలలోపు రుణాలు తీసుకున్న 2,26,800 మంది రైతులు, లక్ష రూపాయలపైన రుణాలు తీసుకున్న 4876 మంది వెరసి 2,31,676 మంది రుణాల మాఫీ కోసమే కాదు, కొత్త రుణాల కోసమూ ఎదురు చూస్తున్నారు. అంతా గందరగోళంగా ఉన్న పరిస్థితులతో మనోనిబ్బరం కోల్పోతున్న కొందరు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఖరీఫ్ ఆరంభమైన నాటి నుంచి కేవలం ఈ రెండు నెలల కాలంలోనే జిల్లాలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top