వానమ్మా.. కురవమ్మా...

వానమ్మా.. కురవమ్మా... - Sakshi

- వర్షాల కోసం ఎదురుచూపు
- నెల రోజులు గడిచినా...
- నారు పోయలేదు.. విత్తనాలు వేయలేదు..
-  ఆందోళనలో నర్సాపూర్ నియోజకవర్గ రైతాంగం
నర్సాపూర్:
వర్షాకాలం వచ్చినా నియోజకవర్గంలో నైరుతి రుతు పవనాల జాడ కన్పించడం లేదు. రైతులు వానల కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాకాలం వచ్చి నెల రోజులు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం ఏ మండలంలోనూ నమోదు కాలేదు. దీంతో కుంటలు, చెరువులన్నీ బోసిపోయి కన్పిస్తున్నాయి. వరి నారు పోసేందుకు, మొక్కజొన్న విత్తనం విత్తేందుకు వర్షాలు కురవనందున రైతులు వ్యవసాయంలో ప్రాథమిక దశ పనులనే చేపట్టలేదు. పలు గ్రామాల్లో పొలాలను దుక్కి దున్ని వ్యవసాయ పనులకు సిద్ధిం చేసినా వర్షాలు లేక బీడు భూములే దర్శన మిస్తున్నాయి.

బోర్లు ఉన్న రైతులు అంతో ఇంతో  నారు పోసే పనులకు శ్రీకారం చుట్టారు. చెరువులు, కుంటలపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులు ఇంత వరకు నారు పోయలేకపోయారు. ఆరుతడి పంటలు పండించే రైతులు విత్తనం విత్తలేకపోయారు. కాగా నర్సాపూర్ మండలంలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 188 మిల్లీ మీటర్లు కాగా ఇప్పటి వరకు 106 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలో వరి, మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 47వందల హెక్టార్లు ఉండగా.. వెయ్యి హెక్టార్లకు సరిపడా వరి నారు, 450 హెక్టార్లలో మొక్కజొన్న విత్తనం వేశారు. వరినారు సైతం ఎక్కువగా వ్యవసాయ బోరుబావుల వద్దే పోశారు.

వెల్దుర్తి మండలంలో సాధారణ వర్షపాతం 120 మిల్లీమీటర్లకు గాను 75 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ సాగులో మూడో వంతు మాత్రమే చేపట్టారు. హత్నూర మండలంలో 190 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి 107మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. దీంతో వ్యవసాయ పనులు ఊపందుకోలేదు. మండల పరిధిలో 3,500 ెహ క్టార్లలో వరి సాగు చేయాల్సి ఉండగా రెండువేల ెహ క్టర్లకు సరిపడా నారుపోశారు. 600హెక్టార్లకు గాను వంద హెక్టార్లలో మాత్రమే మొక్కజొన్న విత్తనం వేశారు. మండలపరిధిలో సుమారు 1600 హెక్టార్లలో పత్తిని పండిస్తారు. కాని ఈసారి 750 హెక్టార్లలో మాత్రమే పత్తి పండించేందుకు రైతులు చర్యలు తీసుకున్నారు. శివ్వంపేట మండలంలో 190 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను వంద మిల్లీమీటర్ల వర్షమే కురవడంతో సుమారు ఐదు వందల ఎకరాల్లో మాత్రమే నారు పోయడం, విత్తనం వేసే పనులు చేపట్టారు.
 
కొల్చారంలో అధ్వానం
కొల్చారం మండల పరిస్థితి ఇతర మండలాల కన్న అధ్వానంగా ఉంది. సాధారణ వర్షపాతం 130 మిల్లీ మీటర్లకు గాను  ఇప్పటి వరకు 26 మిల్లీమీటర్ల వర్షమే కురవడం గమనార్హం. వరి నారు, మొక్కజొన్న విత్తనం వేసే పనులు చాలా తక్కువగా చేపట్టారు. మండలంలో పన్నెండు వేల ఎకరాల సాగు భూములు ఉండగా వాటిలో ఐదు వందల ఎకరాలలో సాగు పనులు చేపట్టారంటే పరిస్థితి ఎలా ఉందో స్పష్టమవుతుంది. కౌడిపల్లి మండలంలో సైతం వర్షం తక్కువగానే కురిసింది. 223 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 72మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. సుమారు ఐదున్నరవేల ఎకరాల వరి సాగు భూములుండగా 800 ఎకరాలకు సరిపడా వరి నారు పోశారు. నాల్గున్నర వేల మొక్కజొన్న సాగు భూములుండగా 50ఎకరాల్లోనే విత్తనం వేశారంటే మండలంలో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top