పిట్టల్లా రాలుతున్న అన్నదాతలు

పిట్టల్లా రాలుతున్న అన్నదాతలు - Sakshi


రోజుకు ఒకరిద్దరి చొప్పున ఆత్మహత్య

9 రోజుల్లో 13 మంది బలవన్మరణం

మృతుల్లో పత్తిరైతులే ఎక్కువ..!

వర్షాభావం, అప్పులబాధలే కారణం


 

సాక్షి, మహబూబ్‌నగర్: పాలమూరు రైతన్నను కరువు వెంటాడుతోంది.. అన్నం పెట్టే అన్నదాత మృత్యుఘోష వినిపిస్తోంది. కాలం కనికరించక.. అప్పులు తీర్చేమార్గం లేక ఇక చావే మార్గమని భావిస్తున్నారు. ప్రాణంగా చూసుకునే పంటచేలల్లోనే తనువుచాలిస్తున్నారు. కేవలం 9 రోజుల వ్యవధిలోనే జిల్లాలో 13 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో ఎక్కువమంది పత్తిరైతులే ఉన్నారు. ఇదిలాఉండగా, మరో నలుగురు రైతులు పంటలకు నీళ్లు పారించే క్రమంలో విద్యుదాఘాతానికి బలయ్యారు. ఖరీఫ్ మొదటి నుంచి వరుణుడు దాగుడుమూతలు ఆడుతున్నాడు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతను కష్టాలు వెంటాడుతున్నాయి.

 

గతేడాది అధికవర్షాల కారణంగా మెట్టపంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పత్తిరైతులు దారుణంగా దెబ్బతిన్నారు. ఈ ఏడాదైనా అప్పులబాధ నుంచి గ ట్టెక్కుదామని భావించిన రైతన్నకు ఈ సారీ తీవ్ర నిరాశే ఎదురైంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో మొక్కజొన్న, పత్తి పంటలు చేతికిరాకుండాపోయాయి. రుణదాతల నుంచి ఒత్తిళ్లు ఎక్కువకావడంతో అప్పులు తీర్చేమార్గం లేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఈనెల 26, 27 తేదీల్లో ఉప్పునుంతలలో భార్యాభర్తలు మృతిచెందారు. పంటకోసం తెచ్చిన అప్పులు గుదిబండలా మారడంతో కొట్టం బచ్చయ్య(48) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంత్యక్రియల అనంతరం అతని భార్య వెంకటమ్మ(38) కుప్పకూలి తనువు చాలించింది. ఈ సంఘటనలు రైతుల మనోవేదనకు అద్దంపడుతున్నాయి.

 

చనిపోయిన రైతులు వీరే..

  21న మల్దకల్ మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన పాతింటి ఈరన్న(30)అప్పులబాధతో కుంగిపోయి ఆస్పత్రిలో చనిపోయాడు.  

  22న వంగూరు మండలం తుర్కలపల్లి గ్రామానికి చెందిన లింగం(40) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

  23న మల్దకల్ మండలం దాసరిపల్లిలోని బతుకన్న(32) ఆత్మహత్యకు ఒడిగట్టాడు. అదేరోజు పాన్‌గల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన తెలుగు మద్దిలేటి(30), ధన్వాడ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన వడ్డెన్న మృత్యువాతపడ్డారు.

  25న అమ్రాబాద్ మండలం తుర్కపల్లికి చెందిన ఆలూరు పర్వతాలు(35)పురుగుల మందుతాగాడు. అదేరోజున పెద్దమందడి మండలం పెద్ద మునగాల్‌చేడ్ గ్రామానికి చెందిన చాకలి నాగేష్(35)తనువుచాలించాడు.

  26న వీపనగండ్ల మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన బడికెల కిష్టన్న (36)మరణించారు. అదేరోజు ఉప్పునుంతలకు చెందిన కొట్టం బచ్చయ్య(48)పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

  27న ఉప్పునుంతలకు చెందిన కొట్టం వెంకటమ్మ, తన భర్త బచ్చయ్య మరణం తట్టుకోలేక కుప్పకూలి మరణించింది. అదేరోజు అమ్రాబాద్ మండలం తుర్కపల్లికి చెందిన కోరె బాలస్వామి(28)ఆత్మహత్య చేసుకున్నాడు.

  28న భూత్పూరు మండలం అమిస్తాపూర్ గ్రామానికి చెందిన బక్కా జగదీష్(60)పురుగుమందుతాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు.

  29న ఉప్పునుంతల మండలం పెనిమిళ్లలో అప్పులబాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

 విద్యుదాఘాతంతో..

  20న గద్వాల మండలం కొత్తపల్లికి చెందిన కుర్వరాజు(27)పొలంలో విద్యుదాఘతానికి గురై మరణించాడు.

  21న వడ్డేపల్లికి చెందిన కుర్వపెద్ద గోవిందు(45)విద్యుదాఘతానికి గురైమృతిచెందాడు.

  22న గట్టు మండలం మర్సన్‌దొడ్డి పంచాయితీ సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన నాగరాజు(23) విద్యుదాఘాతానికి గురయ్యాడు.

  28న మల్దకల్‌కు చెందిన నర్సింహులు(27)విద్యుదాఘాతానికి గురయ్యాడు.

 

కరుణించని వరుణుడు

వరుణుడు మొదటి నుంచీ కరుణించడం లేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 14 నాటికి 374.8మి.మీ వ ర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, కేవలం 329 మి.మీ మాత్రమే కురిసింది. జిల్లాలోని 23 మం డలాల్లో తీవ్రవర్షభావ పరిస్థితులు నెలకొన్నా యి. దీంతో సాధారణ సాగుకంటే అతితక్కువగా పంటలు సాగయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 7,37,582 హెక్టార్లు సాగుచేయాల్సి ఉండగా, ఆశించిస్థాయిలో వానలు కురకపోవడంతో 7,09,583 హెక్టార్లు మాత్రమే సాగయింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో 8,700 హె క్టార్ల మేర మొక్కజొన్న పంట చేతికిరాకుండా పో యింది. ప్రస్తుత కాతదశలో ఉన్న పత్తి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. పక్షం రో జులుగా చినుకులేకపోవడంతో పత్తిచేలు ఎండిపోతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top