‘బోరు’మంటున్న బక్కరైతు

‘బోరు’మంటున్న బక్కరైతు - Sakshi


- చుక్కనీరు పడక అప్పులపాలవుతున్న వైనం

- ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలు

- చావే శరణ్యమంటున్న రైతులు




సాక్షి, గద్వాల: సాగు చేసిన పంటలను కాపాడుకోవాలనే తపన జోగుళాంబ గద్వాల జిల్లాలోని రైతు కుటుంబాలను అప్పులపాలు చేస్తోంది. బోర్లు పడకపోతాయా.. పంటలు పండకపోతాయా.. అప్పులు తీరకపోతాయా.. అని కోటి ఆశలతో పదుల సంఖ్యలో బోర్లు వేస్తున్నారు. తీరా నీళ్లు పడకపోవడం.. ఒకవేళ పడినా భూగర్భజలాలు లేకపోవడంతో పంటలకు సరిపోవ డం లేదు. దీంతో చేసిన అప్పుల తీర్చలేక.. రుణ దాతలకు ముఖం చూపలేక చావే శరణ్యమని భావిస్తున్నారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్‌కు తన ఆవేదనను తెలపాలని గట్టు మండలం ఆలూరుకు చెందిన మల్లేశ్‌ మంగళవారం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో బోర్లు వేసి అప్పులపాలైన బక్కరైతుల దైన్యస్థితికి అద్దంపడుతోంది.  



గట్టు, కేటిదొడ్డి మండలాల్లో అధికం

గట్టు, కేటీదొడ్డి మండలాలు సముద్రమట్టానికి ఎత్తైన ప్రాంతంలో ఉండడంతో భూగర్భజలాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం జూరాల నీళ్లపై ఆధారపడి నెట్టెంపాడు ప్రాజెక్టు నిర్మించినప్పటికీ ఈ ప్రాంతానికి పూర్తిస్థాయిలో నీళ్లు రాలేదు. గట్టు, ధరూర్, కేటీదొడ్డి, మల్దకల్, గద్వాల మండలాల్లో బోర్లు వేసి అప్పుల పాలైన రైతులు సుమారు 200 మంది ఉన్నట్లు అంచనా. కేటీదొడ్డి మండలంలో 30 బోర్లు వేసి నీళ్లుపడక అప్పులపాలైన రైతులు ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.



అవగాహన లోపమే కారణం

వాల్టా చట్టం ప్రకారం బోర్లు వేయాలంటే రెవెన్యూ అధికారుల అనుమతి, భూగర్భంలో నీళ్లు ఉన్నాయని జియాలజిస్టుల ధ్రువీకరణ ఉండాలి.  నిరక్షరాస్యులైన చాలామంది పేదరైతులు ఇవేమీ పాటించకుండానే బోర్లు వేస్తున్నారు. స్థోమతకు మించి బోర్లువేసి నీళ్లుపడక, పంటలు పండక అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.



కొంపముంచుతున్న సీడ్‌ పత్తిసాగు: జోగుళాంబ గద్వాల జిల్లాలో రైతులు ఎక్కువగా సీడ్‌పత్తి సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా  పత్తి విత్తన వ్యాపారులు, సీడ్‌ ఆర్గనైజర్లు రైతులకు బోర్లకు డబ్బులిచ్చి పంట పండిన తర్వాత వారి నుంచి వసూలు చేస్తున్నారు.  ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు మల్లేశ్‌ తనకున్న పొలంలో మూడేళ్లుగా సీడ్‌ పత్తిని సాగుచేస్తున్నాడు. నాలుగు బోర్లు వేసినా వర్షాలు లేకపోవడంతో నీళ్లు పడలేదు.  పంట దిగుబడి రాక.. సీడ్‌ ఆర్గనైజర్లకు డబ్బులు చెల్లించలేక.. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీడ్‌పత్తి సాగు చేసుకుంటున్న రైతులు బాగుపడటం లేదు కానీ ఆర్గనైజర్లు కోట్లకు పడగలెత్తుతున్నారు.



15 బోర్లు వేసినా..

కాలం కలసి రాలే దు. ఐదేళ్లలో 15 బోర్లు వేశాను. కేవలం మూడు బోర్లలో మాత్రమే నీళ్లు నామమాత్రంగా పడ్డా యి. పదెకరాల వ్యవసా య పొలంలో ఐదెకరాలు వరినా టాను. కానీ పంట గింజపట్టే దశలో  మూడుబోర్లు కూడా వట్టిపోవడంతో పంట ఎండిపోయింది.  ఇటుపంట నష్టం.. అటు బోర్లు వేసేందుకు తెచ్చిన రూ.15 లక్షల అప్పు మిగిలింది.   

        – గోవింద్, రైతు, కేటీదొడ్డి గ్రామం  



 20 బోర్లు వేసి అప్పుల పాలైన

సాగునీటి కోసం చేయని ప్రయత్నం లేదు. మూడేళ్లలో 20 బోర్లు వేశాను. కేవలం రెండుబోర్లు మాత్రమే పని చేస్తున్నాయి. అరెకరాల పొలం ఉంది. ఐదుగురు అమ్మాయిలు ఉన్నాయి. సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తూనే ఉన్నా. బోర్ల కోసం చేసిన అప్పులను తీర్చేందుకు రెండు ఎకరాల పొలాన్ని అమ్ముకున్నాను..  

 –యనుముల ఆంజనేయులు, తారాపురం, గట్టు మండలం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top