సామాన్య రైతు ముంగిట్లో సూక్ష్మ సేద్యం


  • పథ కం అమలులో పలు మార్పులు

  •  నేటి నుంచి 14 తేదీ వరకు ఎంపీపీ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ

  • హన్మకొండ సిటీ : సూక్ష్మ సేద్యం పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలనే ఉద్ధేశంతో తెలంగాణ రాష్ట్ర సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టు(టీఎస్ ఎంఐపీ) విభాగం పలు మార్పు లు చేసింది. ఇప్పటి వరకు మైక్రో కంపెనీలు దరఖాస్తులు తీసుకునేవి. రైతులు నేరుగా ఎంఐపీ కార్యాలయాల్లో అందిం చే వారు. ఈ పద్ధతిలో మార్పు చేసి మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించడం ద్వారా సామా న్య, పేద రైతులు పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కలెక్టర్ జి.కిషన్, టీఎస్ ఎంఐపీ అధికారులు నూతన పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 1 నుంచి 14వ తేదీ వరకు సూక్ష్మ సేద్యం పథకం దరఖాస్తులను ఎంపీపీ కార్యాలయాల్లో స్వీకరిస్తారు. ఇందుకుగాను ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తారు.



    సూక్ష్మ సేద్యం పథకం కింద 2014-15 సంవత్సరానికి జిల్లాలో 5370 హెక్టార్లలో బిందు, తుపంర్ల సేద్యం చేపట్టాలని టీఎస్ ఎంఐపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 4500 హెక్టార్లలో డ్రిప్(బిందు), 870 హెక్టార్లలో స్ప్రింక్లర్(తుంపర్లు) పరికరాలు ఇవ్వాలని ప్రణాళిక రూపొందిం చిం ది. రైతులు పొందిన పరికరాలు బిగించింది లేనిది ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులకు(మండల కోఆర్డినేటింగ్ ఆఫీసర్లు) అప్పగించారు.  

     

    ఇవీ నిబంధనలు

     

    సాగు భూమి, నీటి వసతి, విద్యుత్ సౌకర్యం కలిగి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. ఒక సారి లబ్ధి పొందిన రైతులు పది సంవత్సరాల వరకు తిరిగి రాయితీ పొందేందు కు అర్హులు కారు. పండ్లు, కూరగాయలు, పత్తి, మిర్చి, మొక్కజొన్న, పుసుపు, వేరుశనగ, మల్బరీ తోటలు పెంచే రైతులు పథకాన్ని వినియోగించుకోవచ్చు. బిందు, తుంపర్ల పరికరాలు పొందేందుకు జిల్లాలో 20 కంపెనీలను గుర్తించా రు. రైతు తనకు నచ్చిన ఏవేని మూడు కంపెనీల పేర్లు ప్రాధాన్యతాక్రమంలో దరఖాస్తులో తెలపాల్సి ఉంటుంది. బయోటెక్నాలజీస్, బంగారు ఇరిగేషన్, ఈపీసీ, ఫినోలెక్స్, గోదావరి, హరిత, జైన్, జాన్‌డీర్, కోటారి, క్రితి, కుమార్, నాగార్జున, నంది ఇరిగేషన్, నంది ప్లాస్టిక్, నెటాఫిమ్, సింజెంట, రుంగ్టా, హార్వెల్, పారిక్జిట్, ప్రీమియర్ కంపెనీలు డ్రిప్, స్ప్రంక్లర్ పరికారాలను అందించనున్నాయి.

     

     రాయితీ వివరాలు



     ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు రూ.లక్షకు మించకుండా రాయితీ అందిస్తుంది. బిందు సేద్యానికి ఐదు ఎకరాలలోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, సన్న చిన్నకారు రైతులకు 90శాతం, ఐదు నుంచి పది ఎకారల రైతుకు 75శాతం, పది ఎకరాల పైన భూమి కలిగిన రైతులకు 60శాతం రాయితీ ఇస్తుంది. పరికరాల విలువ రూ.లక్ష దాటిన రైతులకు 12.5 ఎకరాల వరకు 40 శాతం రాయితీ లభిస్తుంది. తుంపర్లకు హెక్టార్‌కు యూనిట్ విలువ రూ.19,600 చొప్పున అన్ని వర్గాల రైతులకు 50 శాతం రాయితీ కింద ఇస్తున్నారు. రైతులు దరఖాస్తుతోపాటు తహసీల్దార్, ఉప తహసీల్దార్ ధ్రువీకరించిన భూమి యాజమాన్యం హక్కుపత్రం లేదా మీసేవ ద్వారా పొందిన ఫారం-1బి, వీఆర్‌ఓ ధ్రువీకరించిన సర్వే నంబర్ కలిగిన నక్ష, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, గుర్తింపు కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్, కుల ధ్రువీకరణ పత్రం, విద్యుత్ కనెక్షన్ న ంబర్ ప్రతులు జతపరచాల్సి ఉంటుంది.

     

     ముందుగా వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యం



     ఎంపీపీ కార్యాలయంలో స్వీకరించిన దరఖాస్తులను టీఎస్ ఎంఐపీ కార్యాలయంలో సీనియారిటీ ప్రకారం జాబితా తయారు చేస్తాం. ఆ జాబితాను మండలాల వారీగా విభజించి పరిశీలన అనంతరం ఆయా గ్రామాలకు పంపిస్తాం. పంచాయతీ కార్యదర్శి కన్వీనర్‌గా గ్రామసభ నిర్వహించి జాబితాకు సభ ఆమోదం తీసుకోవాలి. తుది జాబితా కలెక్టర్ ఆమోదం పొందిన తరువాత రైతులకు పరికరాలు మంజూరు చేయబడతాయి. ముందు గా దరఖాస్తు చేసుకున్న రైతులకు ముందు మంజూరు చేస్తాం. ఇందుకుగాను దరఖాస్తుల స్వీకరణ సమయం, తేదీని ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చే స్తారు. 

                                             

     -సునీత, టీఎస్ ఎంఐపీ పీడీ

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top