కన్నీటి సాగు..


- 8 నెలల్లో 9 సార్లు కాలిన ట్రాన్స్‌ఫార్మర్

- తరచూ కరెంట్ సరఫరాకు అంతరాయం

- నీటితడులందక అవస్థలు

- వంద ఎకరాల్లో వరి ఎండుముఖం

- తాజాగా అమర్చిన మూడు గంటల్లోనే కాలిన వైనం

- మరమ్మతుకు వచ్చిన ప్రతిసారీ రూ.5 వేల ఖర్చు

- గుండెలు బాదుకుంటున్న రాజిపేట రైతులు


రాజిపేట రైతులు కరెంట్ లేక కన్నీటి సాగు చేస్తున్నారు. తరచూ కరెంటు సమస్యతో సతమతమవుతున్నారు. నెలకోసారి ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతుండడంతో నెత్తినోరు బాదుకుంటున్నారు. మరమ్మతుకు వచ్చిన ప్రతిసారీ రూ.5 వేల చొప్పున ఖర్చు చేస్తున్నారు. మరమ్మతు చేసి బిగించడానికి రోజుల సమయం పడుతుంది. అప్పటిదాక కరెంటు లేక పంటలు ఎండుతున్నాయి. రబీలో దాదాపు వంద ఎకరాల్లో వరి ఎండడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు.  



మెదక్ రూరల్: మెదక్ మండలం రాజిపేట గ్రామ శివారులోగల వెంకటేశ్వరాలయం సమీపంలోని మామిళ్ల వద్ద 100 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. దానిపై 19 వ్యవసాయ బోరుబావులున్నాయి. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయింది. దాదాపు నెలకోసారి కాలిపోతుంది. కాలిపోయిన ప్రతిసారీ మరమ్మతులు చేయిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో ట్రిప్పుకు రూ.5 వేల చొప్పున ఖర్చు చేస్తున్నారు. దీన్ని మరమ్మతులు చేయించి తిరిగి బిగించేందుకు రోజుల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా నీటి తడులందక పంటలు ఎండిపోతున్నాయి.



వంద ఎకరాలకు దెబ్బ...

రబీ సీజన్‌లో సుమారు 100 ఎకరాల్లో వరి సాగు చేశారు. మరో ఇరవై రోజుల్లో పంట చేతికందుతుందనగా ఈనెలలోనే నాలుగు సార్లు కాలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవర్ లోడ్ వల్లే కాలిపోతుందని భావించి కొన్ని కనెక్షన్లు తొలగించినా ట్రాన్స్‌ఫార్మర్ పరిస్థితిలో మార్పు లేదని వారంటున్నారు.



తరచూ కాలిపోతుండడంతో టీఆర్ సెంటర్ అధికారులు పాత ట్రాన్స్‌ఫార్మర్ తీసుకుని కొత్తది అమర్చినా అదే పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎనిమిది నెలల్లో తొమ్మిది సార్లు కాలిపోవడంతో సుమారు రూ.45 వేల ఖర్చు వచ్చిందన్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న  100 ఎకరాల వరి పొలాలు కళ్లముందే ఎండిపోవటంతో అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు.



బిగించిన మూడు గంటల్లోపే..

తాజాగా రెండు రోజుల క్రితం ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోగా దాన్ని బాగుచేయించి బిగించిన మూడు గంటల్లోపే మళ్లీ కాలిపోయిందని రైతులు కంటతడి పెట్టారు. ఎకరానికి సుమారు రూ.15 వేల చొప్పున పెట్టుబడులు పెట్టి సాగుచేస్తే ట్రాన్స్‌ఫార్మర్ కారణంగా పంటలు దెబ్బతిన్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు.



మెయిన్ లైన్ కింద ఎల్టీ లైన్ వల్లేనా?

బోరుబావులకు సరఫరా అయ్యే ఎల్‌టీ విద్యుత్ వైర్ల పైనుంచే మెయిన్ లైన్ వెళ్తోంది. మామిడి శివారు ప్రాంతంలో స్తంభాలకు పైభాగంలో మెయిన్ వైర్లు ఉంటే ఆ స్తంభాలకే కొంత దూరంలో కింది భాగంలో ఎల్టీ వైర్లను అమర్చారు. దీంతో కరెంట్ సరఫరాలో లోపం ఏర్పడి ట్రాన్స్‌ఫార్మర్ తరచూ కాలిపోతుందా...? అని రైతులు అనుమానిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ విషయాన్ని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన చెందుతున్నారు.



ఇప్పటికైనా స్పందించి ఎక్కడ సమస్య ఉందో గుర్తించి పరిష్కరించాలని రైతులు రామకిష్టయ్య, రామారావు, గోపాల్, యాదాగౌడ్, సత్తయ్య, చిన్న రామకిష్టయ్య, బాల్‌రాజ్, సాయగౌడ్ తదితరులు కోరుతున్నారు. లేనిచో తమకు ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top