ప్రాణం తీసిన సెల్ చార్జింగ్


- విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి

- పరిగి మండలం చిట్యాల్‌లో విషాదం


 పరిగి: సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతమవడంతో ఓ వ్యవసాయ కూలీ మృతిచెందాడు. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని చిట్యాల్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రావులగల్ల చంద్రయ్య(35) తనకున్న అరెకరం పొలంలో వ్యవసాయం చేస్తూ మిగతా సమయంలో భార్య మంజులతో కలిసి స్థానికంగా కూలిపనులు చేస్తున్నాడు.



శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే పొలం పనులకు వెళ్లిన చంద్రయ్య మధ్యాహ్నం తర్వాత ఇంటికి వచ్చాడు. తన సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టే యత్నం చేశాడు. ఈక్రమంలో విద్యుదాఘాతమవడంతో చంద్రయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ఆస్పత్రికి తరలించారు. అక్కడ మృతుడి కుటుంబీకులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అంత్యక్రియల కోసం రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుడికి భార్య మంజుల, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

కరెంటోళ్ల నిర్లక్ష్యం వల్లే...




విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో చంద్రయ్య మృతిచెందాడని చిట్యాల్ గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ నుంచి సరిగా ఎర్తింగ్ లేకపోవడంతో ఎస్సీ కాలనీలో కొంతకాలంగా ఇళ్లలో సామగ్రికి, గోడలకు షాక్ వస్తుందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కూడా ఇళ్లకు షాక్ రావడంతో ట్రాన్స్‌కో ఏఈకి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని  సర్పంచ్ విజయలక్ష్మిశ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సకాలంలో స్పందిస్తే ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయేది కాదని ఆమె చెప్పారు. చంద్రయ్య మృతికి ట్రాన్స్‌కో అధికారులు బాధ్యత వహిస్తూ మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ డిమాండ్ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top