సర్కారీ విత్తూ..నాసిరకమే!

సర్కారీ విత్తూ..నాసిరకమే! - Sakshi


రైతులకు నాసిరకం విత్తనాలను అంటగట్టిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ

సోయాబీన్, జీలుగ విత్తనాలు నాణ్యమైనవి కావని లేబొరేటరీలో నిర్ధారణ


విత్తనాభివృద్ధి సంస్థకు నోటీసుల జారీకి వ్యవసాయశాఖ నిర్ణయం



సాక్షి, హైదరాబాద్‌: నకిలీ విత్తనాలపై యుద్ధం అంటూ ప్రభుత్వం ఓవైపు దాడులు చేస్తుంటే.. మరోవైపు సర్కారు వారి సంస్థే రైతులకు నాసిరకం విత్తనాలను అంటగట్టింది. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎస్‌డీసీ) సబ్సిడీపై సరఫరా చేసిన సోయాబీన్, జీలుగ విత్తనాలు నాసిరకమని సాక్షాత్తూ వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని డీఎన్‌ఏ లేబొరేటరీ నిర్ధారించడం నివ్వెరపరుస్తోంది. వాస్తవానికి సోయాబీన్, జీలుగ విత్తనాల్లో 80–95 శాతం వరకు మొలక రావాలి. కానీ వికారాబాద్‌ జిల్లా తాండూరులో సేకరించిన సోయాబీన్‌ విత్తనా న్ని డీఎన్‌ఏ లేబొరేటరీలో పరీక్షించగా.. కేవలం 56 శాతమే మొలక రావడం గమనార్హం.



 అదే జిల్లా పెద్దేముల్‌లో సేకరించిన జీలుగ విత్తనా లను పరీక్షించగా అందులో 46 శాతమే మొలక వచ్చింది. నిజామాబాద్‌ జిల్లాలో సేకరించిన సోయాబీన్‌ (జేఎస్‌వో–335 వెరైటీ) విత్తనాన్ని డీఎన్‌ఏ లేబొరేటరీలో పరీక్షించగా 57 శాతమే మొలక ఉన్నట్లు నిర్ధారించారు. అదే జిల్లాలో ఓ చోట సేకరించిన జీలుగ విత్తనంలో 55 శాతమే మొలక ఉన్నట్లు గుర్తించారు. యాథృచ్చికంగా అక్కడక్కడ సేక రించిన నమూనాల్లోనే ఇలా నాసిరకం సర్కారు విత్తనాలు బయటప డడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



 రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ జగన్‌మోహనే ఎండీగా వ్యవహరిస్తుం డటం గమనార్హం. ఇతర ప్రైవేటు విత్తన కంపెనీలపై ఎలా చర్యలు తీసు కుంటారో.. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విత్తనాభివృద్ధి సంస్థకు కూడా నోటీసులు జారీ చేస్తామని, ఆ ప్రకా>రం కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తామని వ్యవసాయశాఖ విత్తన విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ కుమారస్వామి ‘సాక్షి’కి తెలిపారు.



టెండర్ల ద్వారా కొనుగోలు చేసి...

ఖరీఫ్‌లో 2.5 లక్షల క్వింటాళ్ల వరి, 63,800 క్వింటాళ్ల మొక్కజొన్న, 64 వేల క్వింటాళ్ల జీలుగ, 2.40 లక్షల క్వింటాళ్ల సోయాబీన్‌ విత్తనాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ఇప్పటివరకు 43 వేల క్వింటాళ్ల సోయాబీన్‌ విత్తనాలు, 39 వేల క్వింటాళ్ల జీలుగ విత్తనాలు సరఫరా చేశారు. సోయాబీన్‌ విత్తనాలను 33 శాతం సబ్సిడీతో, జీలుగ విత్తనాలను 50 శాతం సబ్సిడీతో సరఫరా చేశారు. వీటిని టెండర్లు, ప్రైవేటు విత్తన కంపెనీల ద్వారా సేకరించి రైతులకు విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేసింది. నిబంధనల ప్రకారం టెండర్లు పిలవకపోవడం, నాణ్యమైన విత్తనాలను సరఫరా చేశారా? లేదా? అన్న అంశంపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే సోయాబీన్, జీలుగ విత్తన నమూనాల్లో కొన్నిచోట్ల నాసిరకం విత్తనాలు వెలుగుచూశాయి.



 ప్రభుత్వమే ఇలాంటి విత్తనాలు సరఫరా చేస్తే ఇక ప్రైవేటు కంపెనీలు సరఫరా చేసే ఇతర విత్తనాలపై రైతులకు నమ్మకం ఎలా కలుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా సోయాబీన్‌ విత్తనాలను అధిక ధరకు కొనుగోలు చేసేలా కంపెనీలతో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ టెండర్లు ఖరారు చేయడంపై మొదట్లో విమర్శలు వచ్చాయి. దుమారం చెలరేగడంతో సర్కారు వాటి ధరలను కాస్తంత తగ్గించింది. కానీ కంపెనీలు సరఫరా చేసిన విత్తనాలపై నిఘా పెట్టడంలో వ్యవసాయశాఖ విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.



ఇతర విత్తనాలూ అంతే..?

ప్రైవేటు కంపెనీలు సరఫరా చేసిన విత్తనాల్లో కూడా ఎక్కువగా నాసిరకానివే ఉన్నట్టు డీఎన్‌ఏ లేబొరేటరీలో నిర్ధారణ అయింది. పోలీసులు, వ్యవసాయాధికారులు బృందాలుగా ఏర్పడి రాష్ట్రంలోని పలు దుకాణాలు, కంపెనీల గోదాముల నుంచి విత్తన నమూనాలు సేకరించారు. ఇప్పటివరకు సేకరించిన నమూనా విత్తనాలు 5,594 కాగా.. అందులో 3,830 విత్తనాలను డీఎన్‌ఏ లేబొరేటరీలో పరీక్షించారు. అందులో 122 విత్తనాలు నాసిరకమని తేలింది. అందులో అత్యధికంగా 92 విత్తన నమూనాలు పత్తివే ఉన్నాయి. నాణ్యమైన విత్తనాలైతే 95 శాతానికి పైగా మొలకెత్తుతాయి. అయితే రైతులకు విక్రయించినవాటిలో అత్యధికం 55 నుంచి 70 శాతంలోపే మొలకలుంటున్నాయి. ప్రభుత్వం తూతూమంత్రంగానే విత్తన కంపెనీలపై కేసులు పెడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క పీడీ యాక్టు కేసు నమోదైంది. మిగిలినవన్నీ అత్యంత సాధారణ కేసులు.. అరెస్టులే! దీంతో విత్తన కంపెనీ యాజమాన్యాలు ఏమాత్రం భయపడడంలేదని అంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top