పాత కక్షలతో యువకుడి దారుణ హత్య


  • తొర్రూరులో ఘటన

  • బంధువులపైనే అనుమానం

  • తొర్రూరు : పాత కక్షలతో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన తొర్రూరు శివారులో అమ్మాపురంలో రోడ్డులోని భద్రకాళి దేవాలయం సమీపంలో శనివారం వెలుగు చూసింది. సీఐ సార్ల రాజు, ఎస్సై కరుణాకర్‌రావు కథనం ప్రకారం... మండలంలోని ఖానాపురం గ్రామానికి చెందిన కుంట వెంకన్న, సుగుణమ్మ దంపతుల రెండో కుమారుడు మహేందర్(24) కొద్దినెలలుగా తొర్రూరులోని ఓ టైలర్‌షాపులో టైలరింగ్ నేర్చుకుంటున్నాడు.



    ఈ క్రమంలో అతడు శుక్రవారం ఉదయం షాపునకు వచ్చాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా తన బావలు నారబోయిన రాజారాం(మహేందర్ పిన్ని కూతురు భర్త), నారబోయిన పురుషోత్తం షాపు దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచే మహేందర్‌ను వెంట తీసుకెళ్లారు. అరుుతే రాత్రి 10 గంటలైనా ఇంటికి రాకపోవడంతో మహేందర్‌కు అతడి అన్న కుమారస్వామి ఫోన్ చేశాడు.ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో టైలర్‌షాపు యజమానికి ఫోన్ చేయగా మహేందర్‌ను రాజారాం, పురుషోత్తం తీసుకెళ్లారని చెప్పాడు.



    పురుషోత్తం, రాజారంకు కూడా ఫోన్ చేయగా వారి ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ వచ్చారుు. దీంతో వారు ఆందోళనకు రాత్రంతా బంధువులకు ఫోన్లు చేస్తూ ఎదురు చూశా రు. అతడి జాడ తెలియకపోవడంతో శనివారం ఉదయమే కుమారస్వామి తన తమ్ముడి జాడ కోసం ఆటోలో తొర్రూరు బయల్దేరాడు. అదే సమయంలో భద్రకాళి ఆలయం సమీపంలోని ముళ్ల పొదల్లోపడి ఉన్న వ్యక్తిని చూసిన రైతులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.



    సంఘటన స్థలానికి సీఐ, ఎస్సై చేరుకుని ముళ్లపొదల్లోపడి ఉన్న అతడిని బయటికి తీసేసరికి రక్తపు మడుగులో మహేందర్ మృతిచెంది ఉన్నాడు. ఆటోలో తొర్రూరుకు వస్తున్న కుమారస్వామి పోలీసులు, స్థాని కులు గుమిగూడి ఉండడాన్ని చూసి ఆటో దిగి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. మృతదేహం తన తమ్ముడిదిగా గుర్తించి బోరున విలపించాడు. రాజారాం, పురుషోత్తంలే తమ్ముడిని పొట్టనపెట్టుకున్నారని రోదించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

     

    పెళ్లయిన నాలుగు నెలలకే..  

    మృతుడు మహేందర్‌కు నాలుగు నెలల క్రితమే వివాహమైంది. మృతుడి భార్య మౌనిక, తల్లిదండ్రులు వెంకన్న, సుగుణమ్మ, సోదరులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా రోదించారు.

     

    చెల్లెలిని కొడుతుంటే అడ్డుకున్నందుకే.. దారుణం



    మహేందర్ పిన్ని కూతురికి నారబోయిన రాజారాంతో వివాహమైంది. గత ఆరు నెలలుగా రాజారాం తన భార్యతో తరచూ గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో ఒకసారి అలాగే కొడుతుండగా ఇంటి పక్కనే ఉన్న మహేందర్ చూడలేక తన ముందే తన చెల్లెలిని ఎందుకు కొడుతున్నావని రాజారాంతో గొడవపడ్డాడు. వారి గొడవ పోలీస్ స్టేషన్  వరకు వెళ్లింది. గ్రామపెద్దలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బావ, బావమరిది నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చారు. ఆ విషయూన్ని మనసులో పెట్టుకున్న రాజారాం తన బావమరిది మహేందర్‌ను ఎలాగైనా హత్య చేయాలని పథకం పన్నినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన పెద్దనాన్న కుమారుడు పురుషోత్తంతో కలిసి మహేందర్‌ను హత్య చేశాడని మృతుడి కుటుంబ సభ్యులు, అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top