ఫేస్‌బుక్ కలిపిన బంధం

ఫేస్‌బుక్ కలిపిన బంధం - Sakshi


ఎయిట్ ఇంక్లయిన్ కాలనీ (కరీంనగర్): ఏడేళ్ల క్రితం ఇంట్లోంచి పారిపోయిన కొడుకు కోసం వెతికి వేసారిపోయిన తల్లిదండ్రులు.. తమ బిడ్డ ఎక్కడున్నాడో.. అసలున్నాడో లేదో అనే బెంగతో కుంగిపోయారు. అయితే, ఫేస్‌బుక్‌లో కొడుకు ఫొటోలను గుర్తించిన తండ్రి అతడు ఉంటున్న తమిళనాడులోని నాగర్‌కోయిల్ వెళ్లి ఆదివారం ఇంటికి తీసుకురావడంతో ఆ కుటుంబంలో ఆనందం నెలకొంది. కరీంనగర్ జిల్లా ఎయిట్ ఇంక్లయిన్ కాలనీలో నివాసముంటూ ఓసీపీ-3లో ట్రిప్‌మన్‌గా పనిచేస్తున్న తుమ్మల నారాయణరెడ్డి-పద్మలకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు విష్ణు చక్రధర్‌రెడ్డి(19)జనగామలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతూ 2008లో అదృశ్యమయ్యాడు. అతడు కాలేజీకి వెళ్లలేదన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురై తెలిసిన చోటల్లా వెతికారు. ఫలితం దక్కలేదు.



ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షం

వారం రోజుల క్రితం నారాయణరెడ్డి సెల్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ ఆన్ చేశారు. అనూహ్యంగా అందులో విష్ణు ఫొటో కనిపించింది. తెల్లవారి అదే నంబర్ వాట్సప్‌కు ‘కాల్ మీ డాడీ’ అంటూ విష్ణు మేసేజ్ పంపాడు. దీంతో విష్ణుతో ఫోన్‌లో మాట్లాడగా, తమిళనాడులోని నాగర్‌కోయల్‌లో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నానని చెప్పడంతో అక్కడి వెళ్లారు. విష్ణును తిరుపతి తీసుకెళ్లి మొక్కు చెల్లించుకుని ఆదివారం ఇంటికి తీసుకుని వచ్చారు. కాలేజీకి వెళ్తున్నట్లు చెప్పి తిరుపతి వెళ్లానని, లాకర్‌లో సెల్‌ఫోన్ పెట్టి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేసరికి ఫోన్ పోయిందని విష్ణు తెలిపాడు. ఇక ఇంటికి రావాలనిపించలేదని, దైవదర్శనానికి వచ్చిన కొందరు భక్తులను కలసి పనికావాలని కోరితే.. తమ వెంట నాగర్‌కోయిల్ తీసుకెళ్లారని చెప్పాడు. అక్కడ ఆర్‌ఆర్ బోర్‌వెల్స్ అనే సంస్థలో పని చేస్తున్నానని వివరించాడు. తండ్రి నారాయణరెడ్డి పేరుతో ఫేస్‌బుక్ సెర్చ్ చేయడంతో అమ్నానాన్నల ఫొటో కనిపించగా, దానికి తన ఫొటోను పంపానని తెలిపాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top