డెంగీ పేరుతో దోపిడీ

డెంగీ పేరుతో దోపిడీ


ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లు, హాస్పిటళ్ల నిర్వాహకులు డెంగీ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ దోచు కుంటున్నారని, ఇలాంటి వారిపై చర్యలు తప్పవని  డెప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి రాజయ్య  హెచ్చరించారు. శుక్రవారం ఆయన కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేశారు.  

 

కరీంనగర్ హెల్త్: ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆస్పత్రుల నిర్వాహకులు డెంగీ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ దోచుకుంటున్నారని రాష్ట్ర డెప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి రాజయ్య అన్నారు. జిల్లాలో డెంగీ లక్షణాలున్న 495 మంది రోగుల రక్తనమూనాలు సేకరించి పరీక్షలు చేయగా.. మూడు కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయన్నారు. డెంగీ పేరుతో దోపిడీ చేస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆస్పత్రులపై చర్యలు తీసుకునేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి ఆధ్వర్యంలో విజిలెన్స్ కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. జిల్లాలో మలేరియా వంటి విషజ్వరాల కేసులు మాత్రమే ఉన్నాయని, డెంగీ కేసులు లేవని అన్నారు.



వార్డుల్లో తిరిగి.. పిల్లలను పరీక్షించి..

మంత్రి రాజయ్య ఆస్పత్రిలోని పలు వార్డుల్లోకి వెళ్లి రోగుల పరిస్థితి, వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. జెజ్జంకి మండలం కిష్నంపల్లికి చెందిన దుర్గమ్మ, శంకరపట్నం మండలం కన్నాపురంకు చెందిన మీనాక్షి, జ్వరంతో బాధపడుతున్న చిన్నారి కృపరాజ్(1), మంచిర్యాలకు చెందిన పర్శరామ్‌ని స్వయంగా పరిశీలించి.. అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. నగరంలోని పాతబజార్‌కు చెందిన శ్రీకాంత్ తన తల్లి గొంతునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిందని, వారం రోజులుగా ఆహారం మింగలేని పరిస్థితిలో ఉందని, వైద్యులు వరంగల్‌కు వెళ్లమంటున్నారని ఫిర్యాదు చేశాడు.



దుమ్ము దులిపిన మంత్రి..

ఫిమేల్‌వార్డులో డోర్‌పై దుమ్ముతేలి, మరకలు ఉండడంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియదా అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. అటెండర్ ఎక్కడ ఉన్నారని అడగడంతో అధికారులు పరుగులు తీశారు. పది నిమిషాలైనా రాకపోవడంతో పిలిపించడని అక్కడే వేచి ఉన్నారు. శుభ్రం చేయడానికి పారిశుధ్య సిబ్బంది బకెట్‌తో రావడంతో.. మంత్రి స్వయంగా బోర్డును, డోర్‌ను శుభ్రం చేశారు. ఇదే వార్డులో డ్యూటీ డాక్టర్ చార్టులో సిబ్బంది పేర్లు ఎందుకు రాయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వైద్యారోగ్యశాఖ అధికారులు, డాక్టర్లు, సిబ్బందితో గంటపాటు సమావేశం నిర్వహించారు. ఆయన వెంట జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్ వీరబ్రహ్మయ్య, వైద్యారోగ్యశాఖ సంచాలకుడు సాంబశివరావు, ఆర్‌డీ డాక్టర్ నాగేశ్వర్‌రావు, డీఎంహెచ్‌వో కె.బాలు, సూపరింటెండెంట్ లక్ష్మణ్, ఆర్‌ఎంవో లక్ష్మీదేవి, డాక్టర్ జ్యోతి ఉన్నారు.



రెఫర్ చేసి చేతులు దులుపుకోవద్దు

ప్రాణాపాయస్థితిలో పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులకు వచ్చిన రోగులను పరీక్షించకుండా పెద్దాస్పత్రులకు రెఫర్ చేస్తూ వైద్యులు, సిబ్బంది చేతులు దులుపుకోవద్దని డెప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి రాజయ్య హెచ్చరించారు. అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైన నిధులను ఆసుపత్రి అభిృద్ధి నిధుల నుంచి, ఆరోగ్యశ్రీ కార్పస్ ఫండ్‌నుంచి వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ఆస్పత్రిలో రూ.22లక్షలు హెచ్‌డీఎస్ నిధులు, 6లక్షలు ఆరోగ్యశ్రీ కార్పస్ నిధులున్నాయని, వీటితో నెల రోజుల్లోగా ఆస్పత్రిని అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.



కాంట్రాక్టు పద్ధతిలో డాక్టర్ల నియమాకం చేపడుతున్నామని, త్వరలోనే జిల్లాకు డాక్టర్లను కేటాయిస్తామని చెప్పారు. ప్రభుత్వాసుపత్రికి అనుబంధంగా వైద్యకళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా ఆసుపత్రి మరమ్మతుల నిమ్మిత్తం రూ.2కోట్లు, పాత బకాయిలు రూ.2.89 కోట్లు రానున్న బడ్జెట్‌లో మంజూరు చేస్తామన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ తుల ఉమ ఆస్పత్రిలోని సమస్యలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ముంబయికి చెందిన సంస్థ పారిశుధ్య కాంట్రా క్టు కాలపరిమితి మార్చిలో ముగిసిందని, కోర్టులో కేసు ఉన్నందున్న కాంట్రాక్టు ఇవ్వలేదన్నారు. స్థానికంగా ఉండే వారికే కాంట్రాక్టు ఇప్పించాని కోరారు. రోగులకు ప్రస్తుతం భోజనం కోసం ఇస్తున్న రూ.40సరిపోవడం లేదని, దీనిని పెంచాలని కోరారు. మరొక ప్లేట్‌లేట్ మిషన్ ఇవ్వాలని, ల్యాబ్ టెక్నీషియన్, డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top