ప్రజాప్రతి‘నిధి’.. ఖర్చు ఏదీ?


‘బంగారు తెలంగాణే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోంది. అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలుపుతాం’’ పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ ప్రసంగంలో వినిపించే వ్యాఖ్యలివి.  కానీ జిల్లాలోని ప్రజాప్రతినిధులకు ఆయన మాటలు ఇంకా ఒంటబట్టినట్టు లేదు.. అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. కోట్లు కుమ్మరించినా.. వాటిని వినియోగించుకోవడంలో విఫలమవుతున్నారు. 2014-15 వార్షిక సంవత్సరంలో నియోజకవర్గ అభివృద్ధి కింద ఒక్కొక్కరికి రూ.1.5 కోట్లు ఇచ్చింది. కానీ వార్షిక సంవత్సరం ముగిసినా పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు అందులో సగం నిధులను కూడా ఖర్చు చేయకుండా.. బ్యాంకు ఖాతాల్లో పొదుపు చేస్తుండడం గమనార్హం.   

 - సాక్షి, రంగారెడ్డి జిల్లా

 

 సాక్షి, రంగారెడ్డి జిల్లా : నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ)లో భాగంగా ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రాష్ట్ర ప్రభుత్వం యేటా రూ. 1.5 కోట్లు విడుదల చేస్తోంది. స్థానిక అవసరాలను గుర్తించి వీటిని ఖర్చు చేసే వెసులుబాటుంది. ఇందులో 50 శాతం నిధులకు సంబంధించిన పనులను ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ నేరుగా ఆమోదించే అధికారం ఉంది. మిగతా 50శాతం నిధులు జిల్లా మంత్రి ద్వారా ఖర్చు చేయాలి. ఈ క్రమంలో 2014-15 వార్షిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 మండలి నియోజకవర్గాలకు రూ. 28.5 కోట్లు విడుదలయ్యాయి. వార్షిక సంవత్సరం ముగిసినప్పటికీ.. విడుదలైన మొత్తం నిధులు ఖర్చు కాకుండా సర్కారు ఖజానాలో మూలుగుతున్నాయి.



 వినియోగం రూ. 18.63కోట్లే..

 సీడీపీలో భాగంగా 2014-15 వార్షిక సంవత్సరంలో జిల్లాకు రూ. 28.5 కోట్లు విడుదల కాగా.. ఇప్పటివరకు కేవలం 18.63 కోట్లు మాత్రమే ఖర్చు చేసి 579 పనులు పూర్తిచేశారు. వాస్తవానికి వార్షిక సంవత్సరం ముగిసే నాటికి పనులు గుర్తించి.. వాటికి ఆమోదం తెలియజేయాల్సి ఉండగా.. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా వినియోగం నెమ్మదించింది. అసెంబ్లీ నియోజకవర్గ కేటగిరీలో 14 మంది ఎమ్మెల్యేలు 401 పనులకుగాను రూ. 12.79 కోట్లు ఖర్చు చేశారు. శాసన మండలి నియోజకవర్గ కేటగిరీలో ఐదుగురు ఎమ్మెల్సీలు 178 పనులకు రూ. 5.83 కోట్లు వినియోగించారు.



 పరిగి ఫస్ట్.. ‘పట్నం’ లాస్ట్..

 జిల్లాలో నియోజవర్గ అభివృద్ధి నిధుల వినియోగంలో పరిగి శాసనసభ్యుడు టి.రామ్మోహన్‌రెడ్డి ముందువరుసలో ఉన్నారు. పరిగి సెగ్మెంట్‌లో 83 పనులకుగాను రూ.149.63 కోట్లు ఖర్చు చేశారు. విడుదలైన నిధులన్నింటినీ వినియోగించి స్థానికులతో శభాష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, వికారాబాద్ ఎమ్మెల్యేలు కూడా 99శాతం నిధులను ఖర్చు చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి 19 పనులకు కేవలం రూ.82 లక్షలు ఖర్చు చేశారు. అత్యల్పంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కేవలం 9 పనులకుగాను రూ.22.5లక్షలు మాత్రమే ఖర్చు చేసి చివరివరుసలో నిలిచారు..



 మరో రూ.75 లక్షలు విడుదల..

 ఇదిలా ఉండగా.. 2015-16 వార్షిక సంవత్సరానికి సంబంధించి నిధుల్లో ప్రభుత్వం ఇప్పటికే సగభాగం విడుదల చేసింది. ప్రస్తుత సంవత్సరంలో రెండో త్రైమాసికం వరకు నిధులు జిల్లా యం త్రాంగానికి ఇచ్చింది. ఇందులో భాగం గా ఒక్కో ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీకి రూ.75 లక్షలు విడుదలయ్యాయి. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలు అడుగంటిన నేపథ్యంలో ఈ నిధుల్లో అధికభాగం తాగునీటికి విని యోగించాలని ప్రభుత్వం సూచించింది. అయితే.. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు మెజారిటీ సభ్యులు జిల్లా యంత్రాంగానికి పంపకపోవడం కొసమెరుపు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top