అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇప్పిస్తా


చిన్నశంకరంపేట: అర్హులైన ప్రతి ఒక్కరికి అసరా పథకం కింద పింఛన్లు మంజూరు చేయించే బాధ్యత తనదేనని, ఎవరూ ఆందోళన చెందవద్దని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో పింఛన్లను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విదంగా అసరా పథకం కింద పింఛన్లను రూ. వెయ్యి, రూ.15వందలకు పెంచడంతో పాటు గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో తమ ప్రభుత్వం పింఛన్లు ఇస్తోందన్నారు. జాబితాలో అర్హుల పేర్లు లేకున్నా అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హుల పేర్లను గుర్తించే బాధ్యత సర్పంచ్‌లదేనని, వారు అందించిన జాబితాను పరిశీలించి పింఛన్లు మంజూరు చేయిస్తామన్నారు.



చందంపేట గ్రామాభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానన్నారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ. 10 లక్షలు, రుద్రారంలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని జెడ్పీ పాఠశాలలకు నాలుగు అదనపు గదులు మంజూరు చేయించానని, త్వరలోనే మోడల్ పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తాన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సంతోషి గ్రామ సమస్యలు వివరించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహశీల్దార్ మోహన్, ఎంపీపీ కృపావతి, జెడ్పీటీసీ స్వరూప, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, ఎంపీటీసీ శశికళపోచగౌడ్, సర్పంచ్‌లు సత్యనారాయణ, నాగరాజ్, మాజీ సర్పంచ్‌లు సుధాకర్,రాజు పాల్గొన్నారు.



సమాజసేవలో పాలుపంచుకోవాలి

రామాయంపేట: ప్రతి ఒక్కరూ సేవా దృ క్పథాన్ని అలవర్చుకోవాలని  డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రామాయంపేటలో లయన్స్ క్లబ్ స్నేహబంధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ  రక్తదానం ఎంతో గొప్పదని, అత్యవసర సమయాల్లో రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. సమాజసేవలో విద్యార్థులు పాలుపంచుకోవాలన్నారు. రామాయంపేటలో రోడ్డు విస్తరణతోపాటు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అదేశించారన్నారు.



స్థానికంగా ఉన్న మల్లెచెరువును శుద్ధిచేయించడంతోపాటు మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడానికి కృషిచేస్తామన్నారు. అంతకుముందు డిప్యూటీ స్పీకర్ స్థానికంగా ఒక హోటల్‌తోపాటు, దుకాణానికి ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో  క్లబ్ చైర్మన్ సత్యనారాయణ,  ఎంపీపీ అధ్యక్షురాలు పుట్టి విజయలక్ష్మి, ఉపాధ్యక్షుడు జితేందర్‌గౌడ్, జెడ్పీటీసీ బిజ్జ విజయలక్ష్మి, టీఆర్‌ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, పార్టీ జిల్లా నాయకుడు కొండల్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ పాతూరి ప్రభావతి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మానెగల్ల రామకిష్టయ్య, మాజీ ఎంపీపీ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top