పచ్చగా ఉందాం..

పచ్చగా ఉందాం.. - Sakshi


⇒ ప్రతి విద్యార్థి ఓ హరిత సైనికుడు కావాలి

⇒ చిలుకూరులో హరితహారానికి సీఎం కేసీఆర్ శ్రీకారం


 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘‘వానలు కురిపించేవీ.. రాళ్లవానను ఆపేవీ.. మన బతుకును బాగు చేసేవీ చెట్లే. పచ్చదనంతోనే బంగారు తెలంగాణ సాధ్యం. హరితహారం ఓ మహాయజ్ఞం. ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదు నిరంతర ప్రక్రియ’’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు వెంకటేశ్వరస్వామి సన్నిధిలో ‘సంపంగి’ మొక్కను నాటి లాంఛనంగా హరితహారం కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. అనంతరం ఘట్‌కేసర్ మండలం నారపల్లిలోని భాగ్యనగర నందనవనంలో మొక్క నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తొలి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటనున్నట్లు చెప్పారు.



రాబోయే మూడు సంవత్సరాల్లో 230 కోట్ల మొక్కలు నాటుతామన్నారు. ప్రతి విద్యార్థి ఓ హరిత సైనికుడిగా మారాలని పిలుపునిచ్చారు. వన సంపదను కాపాడుకోవడం సామాజిక బాధ్యత అని, ఆకుపచ్చ తెలంగాణ సాధనకు మహిళా సంఘాలు, అక్కాచెల్లెళ్లు కొంగుబిగించాలని అన్నారు. ‘‘హరితహారం అంటే ఇదేదో సంస్కృత పదబంధం కాదు. బ్రహ్మపదార్థం అనుకోకూడదు. ప్రతి మనిషి నాలుగు చె ట్లు పెట్టుడు.. వాటిని చక్కగా సాదుడే.. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు.



అన్నివర్గాల ప్రజలందరూ భాగస్వాములు కావాలి. తెలంగాణ రాష్ర్ట సాధించినట్టే హరితహారం కూడా సుసాధ్యమే. వచ్చే నాలుగేళ్లలో ప్రతి గ్రామంలో 1.60 లక్షల మొక్కలు నాటితే వానమబ్బు కురవకుండా ఎక్కడికీ పోదు. హరితహారంతో రెండేళ్లలో తెలంగాణలో కరువును పారదోలాలి’’ అని అన్నారు. గ్రామాల్లో పంట పొలాలపై కోతులు దాడులు చేయడానికి అటవీ సంపద తరిగిపోవడమే ప్రధాన కారణమని చెప్పారు. కోతులు, అడవి పందులు, ఏనుగులు ఊళ్లపై పడడానికి కారణం.. అవి ఉండే జాగాలను మనం నాశనం చేయడమేనన్నారు.



 ఆ పార్కులో సిమెంట్ బొమ్మలు

 హైదరాబాద్‌లో పరిశ్రమలు, కాలుష్యం పెరిగిపోయి నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారిందని సీఎం అన్నారు. నగరంలోని కోటి మంది జనాభాకు సరిపడా పచ్చదనం లేదని పేర్కొన్నారు. బయోడైవర్సిటీ పార్కులో సిమెంట్ బొమ్మలు ఉన్నాయని, పాలపిట్టను పంజరంలో చూడాల్సిన రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తంచేశారు. కులీకుతుబ్ షా హైదరాబాద్‌ను బషీర్‌బాగ్, జాంబాగ్ వంటి తోటల్లో నిర్మించారన్నారు. ‘‘బాగ్‌లు మాయమైనై.. బంగ్లాలు మోపైనై.. ముందు తరాలైన  మన మనుమలు.. మనుమరాండ్లకు ఇలాంటి వాతవరణం ఇద్దామా..?’’ అని సీఎం ప్రశ్నించారు. ‘‘ఈ బాగ్‌లను ఎవరో దోసుకపోలేదు., సమైక్యాంధ్ర పాలకుల కబ్జాలు, పరిశ్రమల వల్ల ఇదంతా జరిగింది. ఇదే పరిస్థితి ఉంటే పైన శేర్వాణీ లోపల పరేషానీ అన్న మాదిరిగా ఉంటుంది’’ అని అన్నారు. హైదరాబాద్ కొద్ది కాలంలోనే రెండింతలు అవుతుందని, రియల్ భూమ్ తిరిగి ప్రారంభమైందని చెప్పారు.



 రెండేళ్లలో 24 గంటలూ కరెంట్

 ‘‘కరెంట్ ఇబ్బందులు తొలిగిపోయాయి. రెండేళ్ల తర్వాత 24 గంటలు విద్యుత్ ఇస్తాం. వ్యవసాయ విస్తీర్ణానికి ఇక పరిమితులుండవు’’ అని సీఎం స్పష్టంచేశారు. రెండు పడకల గదుల ఇళ్ల పథకం ఈ ఏడాది నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, అటవీ శాఖ మంత్రి జోగురామన్న, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ సునీత, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. హరితహారానికి శ్రీకారం చుట్టేముందు కేసీఆర్ చిలుకూరు బాలాజీని దర్శించుకున్నారు.



 దోమ సోషలిస్టు..

 ‘‘చెత్త ఉంటే దోమ ఉంటది.. దోమ ఎవరినైనా కుడతది. ఎమ్మెల్యేనీ, ముఖ్యమంత్రినైనా కుడతది. దానికి అడ్డంలేదు. దోమ మంచి సోషలిస్టు. దానికి ఏ తారతమ్యం లేదు. తన ఎదురుగా వచ్చేది మంత్రా.. కాదా.. ఊరి సర్పంచా.. అని చూడదు. కుట్టిందంటే ఏ మలేరియానో, చలి జ్వరమో వస్తది.. పోయి దావాఖానలో పడతం’’ అని సీఎం అన్నారు. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో గతంలో ప్రబలిన ప్లేగు వ్యాధిని ఉటంకిస్తూ సీఎం కేసీఆర్ ఈ దోమ కథను చెప్పారు. ఆ నగరంలో వజ్రాల వ్యాపారులున్నారు. ప్లేగు ప్రబలడంతో సంపన్నులు సైతం తట్టాబుట్ట సర్దుకొని నగరాన్ని విడిచారు. దీనికంతటికి చెత్తే కారణమని అన్నారు. డబ్బు ఉంటే సరిపోదు.. ఆరోగ్యమూ అత్యవసరమేనని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top