ఆంధ్రోళ్లే బిచ్చమెత్తుకుంటారు

ఆంధ్రోళ్లే బిచ్చమెత్తుకుంటారు - Sakshi


కమలాపూర్: గల్ఫ్ బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్‌లో సోమవారం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు గల్ఫ్ బాధితులు తమను ఆదుకోవాలని మంత్రికి విన్నవించారు. మంత్రి స్పందిస్తూ.. తాము గల్ఫ్ దేశాలు సందర్శించి బాధితుల కష్టాలను స్వయంగా చూశామన్నారు. రూ.500 కోట్లతో కేరళ మాదిరిగా గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.  మొన్నటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేసిన 43 అంశాల్లో గల్ఫ్ బాధితుల అంశం కూడా ఉందన్నారు.



బీడీ కార్మికులు, గల్ఫ్ బాధితులు, రైతుల ఆత్మహత్యలను అరికట్టేందుకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నంటిని నెరవేరుస్తామన్నారు. రాజకీయ అవినీతిని పూర్తిగా అంతమొందించిన ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. తెలంగాణ ఏర్పడితే ఏ అనుభవంతో పరిపాలిస్తారని, భిక్షమెత్తుకోవాల్సి వస్తుందని కొందరు చులకనగా మాట్లాడారని మంత్రి గుర్తుచేశారు. తమకు మందిని ముంచే అనుభవం లేదని, అక్రమాలను చెరబట్టి, బ్రోకర్లను జైళ్లల్లో పెట్టే అనుభవం మాత్రం ఉందని అన్నారు. భిక్షమెత్తుకునేది ఆంధ్రోళ్లే తప్ప తెలంగాణ సమాజం కాదన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top