మృత్యుంజయురాలు ఈ అంజలి

మృత్యుంజయురాలు ఈ అంజలి - Sakshi

మహబూబ్ నగర్ (గండేడ్) ‌: చిరు ప్రాయంలోనే ప్రమాదం రూపంలో తరుముకొచ్చిన మృత్త్యువును జయించి పునర్జన్మ సాధించిన అంజలి ఇప్పుడు బడిలో తోటి చిన్నారులతో ఆడుతూపాడుతూ చదువుకుంటుంది. నేడు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో పాప బోరుబావిలో మృత్యువుతో కొట్టుమిట్టాడుతున్న సంఘటన టీవీల్లో చూస్తున్న వారంతా మృత్యుంజయురాలైన అంజలిని గుర్తుచేసుకుంటున్నారు.

 

రెండేళ్ల కిందట గండేడ్‌ మండంలో జరిగిన సంఘటన ఇది. ఈ మండల పరిధిలోని రంగారెడ్డిపల్లి అనుబంధ గ్రామమైన గోవింద్‌పల్లి తాండాకు చెందిన లక్ష్మణ్‌ నాయక్‌ కూతురు కొర్ర అంజలి 3 సంవత్సరాల పాప. రెండున్నరేళ్ల కిందట (14 జనవరి, 2015) తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లింది. సాయంత్రం 3 గంటల సమయంలో తోటిపిల్లల దగ్గర ఆడుకుంటూ అక్కడే ఉన్న అంజలి ప్రమాదవశాత్తు బోరుబావిలో జారి పడింది. అక్కడే ఆడుకుంటున్న తోటిపిల్లలు కూడా ఆ విషయాన్ని గమనించలేదు. 

 

సాయంత్రం పొలంపని ముగిశాక ఇంటికి వెళ్లేముందు చిన్నారిని చూసుకోగా ఎక్కడా కనిపించలేదు. పిల్లలు ఆడుకున్న చోట బోరు బావి పరిసరాల్లో వెతగ్గా బోరులోనుండి చిన్నగా అరుపులు కేకలు వినిపించాయి. దీంతో కుటుంబీకులు గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు అధికారులకు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చి జేసీబీల సహయంతో తవ్వకం ప్రారంభించారు. సుమారు 20 ఫీట్ల లోతులో పడిపోయిన చిన్నారిని రాత్రి 9 గంటల వరకు బయటకు తీశారు.

 

అంతకు ముందే బోరుబావిని పూడ్చడంతో 20 ఫీట్లవరకు మిగిలి ఉంది. బోరులో పడినపాప అక్కడే 20 ఫీట్లలోపే ఇరుక్కుపోయింది. సమాంతరంగా తవ్విన బావి నుంచి పోలీసుల అధికారుల సహయంతో చిన్నారి అంజలిని బయటకు తీసి మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. అప్పటి కలెక్టర్‌ రఘునందన్‌రావు, పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి చిన్నారిని పరామర్శించారు. నేడు అంజలికి 6 సంవత్సరాలు. సల్కర్‌పేట్‌ మినీ గురుకుల పాఠశాలలో 2 వ తరగతి చదువుతోంది. తండ్రి దుబాయికి వలస వెళ్లగా, తల్లి మహరాష్ట్రకు వలసవెళ్లింది.

 

ఆ పాప బతకాలి : బోరు అంజలి

"నేను చిన్నగున్నపుడు బోరులో పడి బతికినందుకు అందరూ నన్ను బోరు అంజలీ అని పిలుస్తారు. మా అమ్మానాన్నలు కూడా తన దగ్గర లేనందుకు నన్ను అందరూ ఆప్యాయంగా చూసుకుంటారు. నాలాగా బోరుబావిలో పడిన ఆ చిన్నారి బతికితే బాగుండును."

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top