జైల్లో నుంచి తప్పించుకుంటా!

జైల్లో నుంచి తప్పించుకుంటా! - Sakshi


ఢిల్లీలోని భార్యతో ఫోన్లో ఐఎం ఉగ్రవాది యాసిన్ భత్కల్

బయటపడ్డాక సిరియా రాజధాని డమాస్కస్ పారిపోదాం

ఫోన్ సంభాషణల ఆధారంగా గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు

భద్రత రెట్టింపునకు ప్రభుత్వం ఆదేశాలు


 

హైదరాబాద్: ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న ఐఎస్‌ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాద సంస్థ దేశంలో మారణహోమం సృష్టించడంతోపాటు జైళ్లలోని ఉగ్రవాదులను ఎలాగైనా తప్పించేందుకు కుట్రపన్నుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌ను హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు నుంచి తప్పించేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు యాసిన్ ఇటీవల తన భార్య జెహిదాతో మాట్లాడిన ఫోన్ సంభాషణల ఆధారంగా గుర్తించాయి. సిరియా రాజధాని డమాస్కస్‌లోని స్నేహితులు త్వరలో తనను జైలు నుంచి తప్పిస్తారని...అవసరమైతే జైలు గోడలు బద్దలు కొట్టైనా బయటకు తెస్తారని అతను చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం డమాస్కస్ పారిపోదామని భార్యతో పేర్కొన్నట్లు తెలియవచ్చింది.

 

అప్రమత్తమైన నిఘా వర్గాలు...

 దేశంలో దాదాపు 40 బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడైన యాసిన్ భత్కల్ తన భార్యతో జరిపిన ఫోన్ సంభాషణల నేపథ్యంలో కేంద్ర నిఘా  వర్గాలు అప్రమత్తమయ్యాయి. జైళ్లలోని ఉగ్రవాదులపై నిఘా పెంచాలని, భద్రతను రెట్టింపు చేయాలని, ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించాయి. మరోవైపు యాసిన్ భత్కల్‌కు న్యాయస్థానం ఆదేశాల మేరకు ఫిబ్రవరి 18 నుంచి కుటుంబ సభ్యులతో ల్యాండ్‌లైన్ ఫోన్లో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు జైళ్లశాఖ డీఐజీ నర్సింహ తెలిపారు. భత్కల్ ఇప్పటివరకు 27 సార్లు ఫోన్లో మాట్లాడాడని, అరబిక్, ఉర్దూలలో సాగిన అతని సంభాషణలను ప్రత్యేక నిపుణుల కమిటీ విశ్లేషిస్తున్నట్లు శనివారం విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. భత్కల్‌కు అందరి ఖైదీల మాదిరిగానే వారానికి రెండుసార్లు ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. భత్కల్ తన భార్య జెహిదా, తల్లి రెహానాలతో మాట్లాడేందుకు అనుమతి కోరగా తాము ఆయా ఫోన్ నంబర్లను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతో సంప్రదించి వారి ఆదేశాల మేరకే అనుమతించామన్నారు.



జైల్లో కేవలం ఎస్టీడీ ఫోన్ సౌకర్యమే ఉంటుందని, ఐఎస్‌డీకి అవకాశం లేదని డీఐజీ స్పష్టం చేశారు. చర్లపల్లి కేంద్రకారాగారంలో మొత్తం 13 మంది ఉగ్రవాదులున్నారన్నారు. 2013 సెప్టెంబర్ 24 నుంచి భత్కల్ చర్లపల్లి జైల్లో ఉంటున్నాడని, మధ్యలో ఒకట్రెండుసార్లు అతన్ని వివిధ కేసులరీత్యా ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించామన్నారు. గతేడాది నవంబర్ 16 నుంచి అతన్ని పూర్తి స్థాయిలో చర్లపల్లి జైల్లోనే ఉంచామన్నారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top