రైతు బాధలు పట్టవా?


 - కేసీఆర్‌కు వ్యవసాయరంగంపై చిత్తశుద్ధి లేదు

- టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు

- వడగండ్లతో దెబ్బతిన్న పంటల పరిశీలన   

సిరికొండ :
రాష్ట్రంలో రైతుల పట్ల సీఎం కేసీఆర్ ఒంటెత్తు పోకడ పోతున్నారని, రైతుల బాధలను పట్టించుకోవడం లేదని టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. వడగండ్ల వానలతో, కరువుతో రైతులు అల్లాడుతున్నా ఆయనకు ఏమాత్రం కనికరం లేదని ఆరోపించారు. మండలంలోని కొండూర్‌లో వడగండ్ల వర్షాలతో దెబ్బతిన్న పంటల ను ఎమ్మేల్యేలు సాయన్న, ప్రకాష్‌గౌడ్, ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డితో కలిసి శనివారం ఆయన  పరిశీలించారు.



ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్‌లో కరెంట్ కోతలు. రబీలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అరుుతే దెబ్బతిన్న పంటలకు ఎంత నష్ట పరిహారం చెల్లిస్తామనే విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటన చేయలేదని విమర్శించారు. వ్యవసాయ రంగం పట్ల ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదన్నారు. పంటల పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో 400 మండలాల్లో కరువు చాయలు ఉన్నా.



కరువు మండలాలుగా ప్రకటించడం లేదన్నారు. తెలంగాణ  ధనిక రాష్ట్రమని సీఎం చెబుతున్నారని, రైతుల వద్ద డబ్బులుంటే మరి ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. సర్వే నెంబర్‌ను యూనిట్‌గా తీసుకుని పంటల బీమా చెల్లించాలని డిమాండ్ చేశారు.



అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు వరికి ఎకరానికి రూ. 25 వేలు, వాణిజ్య పంటలకు రూ. 30 వేలు, మామిడి ఇతర తోటలకు రూ. 15 వేల చొప్పున పరిహరం చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకోకపోతే, టీడీపీ తరపున ఒక్కో కుటుంబానికి రూ. 50 వేల చొప్పున చెల్లించామని తెలిపారు. అకాల వానలతో పంటలు దెబ్బతిని పది రోజులు గడుస్తుంటే పంటల వివరాలు సేకరించాలని శుక్రవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారని, పది రోజులుగా ఈ విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.  పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడి బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు.  తాము రైతుల తరఫున పోరాడుతామని భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు ఎంత పరిహారం చెల్లిస్తారో వారం రోజుల్లోగా ప్రకటించాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top