కేబినెట్‌లోకి ఎర్రబెల్లి?

కేబినెట్‌లోకి ఎర్రబెల్లి?


టీఆర్‌ఎస్‌లో చేరిక దాదాపు ఖాయం

     

వెంట మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా..!

కేసీఆర్‌తో ఎర్రబెల్లి రహస్య భేటీ మర్మమిదే

ఇప్పటికే కేసీఆర్‌ను కలిసిన తీగల, ధర్మారెడ్డి

వరంగల్ జిల్లాలోనూ ఇక టీడీపీ శిబిరం ఖాళీయే!


 

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కారెక్కడం ఖాయమైపోయిందా? టీఆర్‌ఎస్‌లో చేరిన వెంటనే ఆయనకు కేబినెట్ మంత్రి పదవి ఇవ్వనున్నారా? ఎర్రబెల్లి వెంట మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరనున్నారా? ఈ మేరకే తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో ఎర్రబెల్లి ఆదివారం అర్ధరాత్రి రహస్యంగా భేటీ అయ్యారా? ఇప్పటికే పలు జిల్లాల్లో ఖాళీ అయిపోయిన టీడీపీపై ఈ పరిణామంతో మరో పెద్ద దెబ్బ పడనుందా? టీఆర్‌ఎస్ పార్టీ వర్గాల్లో సాగుతున్న చర్చ, లీకవుతున్న అంశాలు ఈ పరిణామాలనే నిర్ధారిస్తున్నాయి.



మెట్రో రైలు ప్రాజెక్టు వ్యవహారం ఇప్పటికే టీటీడీపీలో ఎర్రబెల్లికి, రేవంత్‌రెడ్డికి మధ్య అగాధాన్ని బాగా పెంచింది. దీనికితోడు ఎర్రబెల్లి అభ్యంతరాలను తోసిపుచ్చిన చంద్రబాబు.. ఈ విషయంలో రేవంత్‌రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో ఎర్రబెల్లి కొద్దిరోజులుగా పార్టీపై, పార్టీ అధినేతపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీపై క్రమేపీ రేవంత్‌రెడ్డి పట్టు పెంచుకుంటున్న తీరు, దానికి చంద్రబాబు ఇస్తున్న ఊతం కొందరు సీనియర్లలోనూ అసహనానికి కారణమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి ఆదివారం అర్ధరాత్రి కేసీఆర్‌ను కలిశారు. అయితే తాను టీఆర్‌ఎస్‌లో చేరేది లేదంటూ ఎర్రబెల్లి చెబుతున్నా... పార్టీవర్గాలు, ఆయన సన్నిహితులు మాత్రం ఎర్రబెల్లి టీఆర్‌ఎస్ తీర్థం తీసుకోవడం ఖరారైనట్లేనని అంటున్నారు.



మంత్రి పదవి సాధ్యమేనా!



అయితే ఎర్రబెల్లి ఇప్పటికిప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరితే ఆయనకు వచ్చే ప్రయోజనమేమిటనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో ఆరంభమైంది. ఇప్పటికే ఆ సామాజికవర్గం తరఫున కేబినెట్‌లో సీఎంతో పాటు హరీశ్‌రావు, కేటీఆర్ ఉన్నారు. ఒకవేళ త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో జూపల్లి కృష్ణారావుకు అవకాశమిస్తే మరొకరు పెరిగినట్లే. అలాంటప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన ఎర్రబెల్లికి మంత్రిగా అవకాశం ఇవ్వగలరా? అనే ప్రశ్న రాజకీయవర్గాల్లో చర్చకు ఆస్కారమిస్తోంది. కొందరు మంత్రుల తొలగింపు, పలువురు మంత్రుల పోర్ట్‌ఫోలియోల్లో మార్పులు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. తుమ్మల నాగేశ్వర్‌రావుకు కూడా ఈసారి మంత్రివర్గంలో స్థానమిస్తారని భావిస్తున్నందున... ఎర్రబెల్లిని కూడా సర్దుబాటు చేయడం కష్టమేమీ కాదని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అంతేగాకుండా తనకు పట్టణాభివృద్ధి శాఖ కావాలని, మంత్రి కావాలనేది తన చిరకాల కోరిక అని ఎర్రబెల్లి పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఎర్రబెల్లితోపాటు హైదరాబాద్‌కు చెందిన టీడీపీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, వరంగల్ జిల్లా ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూడా పార్టీ నుంచి వలస వెళ్లే జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారిద్దరూ ఎర్రబెల్లి ఖాతాలోనే శనివారం మధ్యాహ్నం కేసీఆర్‌ను కలిశారని చెబుతున్నారు. వీరితోపాటు పార్టీలోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా తీసుకొస్తానని ఎర్రబెల్లి హామీనిచ్చారు. ఆ ఇద్దరూ మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాలకు చెందినవారని సమాచారం.



ఎవరికేం లాభం?



ఈ టీడీపీ నేతల చేరికలతో టీఆర్‌ఎస్‌కు వచ్చేదేమిటనే దానిపైనా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో టీడీపీ శిబిరాన్ని ఖాళీ చేసినట్లుగానే.. వరంగల్ జిల్లాలోనూ చేయాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మహబూబ్‌నగర్, హైదరాబాద్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలతో ఆయా ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలనేది ఆయన భావన. వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి ఆ జిల్లాలో కీలకమే గాకుండా పార్టీకి తెలంగాణ ప్రాంత  వ్యవహారాల్లో ముఖ్య నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే పార్టీ మారడం వల్ల తాను ఎంతోకాలంగా కలగంటున్న మంత్రిపదవి దక్కుతుందని, రానురాను మనుగడే కష్టమైపోతున్న టీడీపీలో ఉండటం శ్రేయస్కరం

 కాదనేది ఎర్రబెల్లి మనోగతంగా చెబుతున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top