తెలంగాణలో ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ వాయిదా

తెలంగాణలో ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ వాయిదా


సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈనెల 8 నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి వెల్లడించారు. కోర్టును ఆశ్రయించిన ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు అన్నింటిని వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై బుధవారం డివిజన్ బెంచ్‌కు వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీంతో 8 నుంచి ప్రారంభించాల్సిన వెబ్ ఆప్షన్లు, 23 నుంచి చేపట్టాల్సిన రెండో దశ కౌన్సెలింగ్ వాయిదా వేసినట్లు వివరించారు.

 

 తీర్పుపై చర్చలు..

 హైదరాబాద్ జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు అనుబంధ గుర్తింపు విషయంలో తలెత్తిన వివాదం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. అనుబంధ గుర్తింపుపై ఇటీవల జేఎన్‌టీయూహెచ్ 220 కాలేజీల్లో పలు కోర్సులకు కోత విధించింది. ఫలితంగా దాదాపు 70 వేల వరకు సీట్లు తగ్గిపోయాయి. దీంతో పలు కాలేజీ యాజమన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై మంగళవారం హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అంతకుముందు ఉదయమే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తదితరులు సమావేశమై ఈ అంశంపై చర్చించారు.



కోర్టు తీర్పు జేఎన్‌టీయూకు అనుకూలంగా వస్తే ఏం చేయాలి? కాలేజీలకు అనుకూలంగా వస్తే ఏం చేయాలన్న అంశాలపై చర్చించారు. కాలేజీలను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని సింగిల్ జడ్జి తీర్పు వెలువరించడంతో ఉన్నతాధికారులు మరోసారి సమావేశమై చర్చించారు. అడ్వొకేట్ జనరల్‌ను సంప్రదించారు. అనంతరం సీఎం కేసీఆర్‌తో చర్చించి, డివిజన్ బెంచ్ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top