అంతా డొల్లే!

అంతా డొల్లే! - Sakshi

  • తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అన్ని లోపాలే

  • ఫ్యాకల్టీ లేకుండానే కళాశాలల నిర్వహణ

  • కంప్యూటర్లు, లైబ్రరీలు లేవు.. కనీస మౌలిక సదుపాయాలకూ దిక్కులేదు

  • జేఎన్టీయూహెచ్ తాజా తనిఖీల్లో వెల్లడి

  • గతంలో కోర్టు ఆదేశాల మేరకు 163 కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతి

  • అందులోని 143 కాలేజీల్లో తొలి ఏడాది కోర్సుల గుర్తింపు రద్దు

  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల రంగు మరోసారి బయటపడింది. అన్ని సదుపాయాలూ ఉన్నాయని చెప్పుకొచ్చిన కళాశాలల్లో డొల్లతనం.. ఇటీవల జేఎన్టీయూహెచ్ నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైంది. అవసరమైన సంఖ్యలో కంప్యూటర్లూ లేవు.. చదువుకునేందుకు లైబ్రరీల్లేవు, ఉన్నా వాటిల్లో పుస్తకాలు లేవు.. కనీస మౌలిక సదుపాయాలు లేవు.. చివరికి అధ్యాపకులు లేరు. అసలు అధ్యాపకులు లేకుండా చదువెలా చెబుతున్నారని తనిఖీ బృందాలు ప్రశ్నిస్తే యాజమాన్యాల నుంచి సమాధానం కరువైంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో నిపుణుల కమిటీలు చేసిన తనిఖీల్లో ఇలా అనేక లోపాలు బయటపడ్డాయి.



    ఈ నేపథ్యంలో ఆయా కాలేజీల్లో బీటెక్ ఫస్టియర్‌కు చెందిన 839 కోర్సుల్లో 807 కోర్సుల అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్)ను జేఎన్టీయూహెచ్ రద్దు చేసింది. గతంలో సుప్రీంకోర్టు అనుమతితో ప్రవేశాలు చేపట్టిన 163 కాలేజీల్లో ప్రధానంగా ఫ్యాకల్టీ కొరత ఎక్కువగా ఉన్న 143 కాలేజీల్లో కోర్సుల గుర్తింపును రద్దు చేసినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఎన్‌వీ రమణారావు చెప్పారు. మిగతా మూడేళ్లకు సంబంధించి వేలాది మంది విద్యార్థులు ఉన్నందున.. 45 రోజుల్లో ఫ్యాకల్టీ లోపాలను సవరించుకోవాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాలేజీలు లోపాలను దిద్దుకోకపోతే వాటి గుర్తింపును కూడా రద్దు చేసే అవకాశముంది.

     

    ఇతర కాలేజీల్లోకి మార్పు!



    ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరం విద్యార్థుల కోసం అధ్యాపకులను ఆయా కాలేజీలు 45 రోజుల్లోగా నియమించుకోకపోతే.. వాటి గుర్తింపు రద్దయ్యే అవకాశం ఉంది. ఒకవేళ 25 శాతం వరకు ఫ్యాకల్టీ కొరతను మినహాయించినా... అంతకుమించి కొరత ఉన్న 90 కాలేజీల్లో 43,020 మంది విద్యార్థులు చదువుతున్నారు. 30 శాతం వరకు మినహాయింపు ఇస్తే.. 39,674 మంది (83 కాలేజీలు) విద్యార్థులు, 40 శాతం వరకు ఇస్తే 33,938 మంది విద్యార్థులు (83 కాలేజీలు), 50 శాతంలోపు ఫ్యాకల్టీ కొరతను మినహాయించినా 31,070 మంది విద్యార్థులు చదువుతున్న 65 కాలేజీలు అనర్హత పరిధిలో ఉంటాయి. అయితే ఏరకంగా చూసినా 25 శాతానికి మించి ఫ్యాకల్టీ కొరతకు మినహాయింపు ఇచ్చే అవకాశాలు లేవు. దీంతో ఆయా కాలేజీల్లోని బీటెక్ ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరం కోర్సుల గుర్తింపు రద్దు తప్పదు. అదే జరిగితే 43,020 మంది విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

     

    ‘ప్రథమ’ విద్యార్థుల పరిస్థితేమిటి?



    ప్రథమ సంవత్సర అఫిలియేషన్ కోల్పోయిన 143 కాలేజీల్లో చేరిన మూడు వేల మంది విద్యార్థుల అడ్మిషన్లు రద్దు కానున్నాయి. లోపాలు ఉన్నట్లు తేలితే ఆ ప్రవేశాలు రద్దవుతాయని, విద్యార్థుల ఫీజును వెనక్కి ఇచ్చేస్తారని సుప్రీం కోర్టు ఆ కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతిచ్చిన సమయంలోనే స్పష్టం చేసింది. అయితే ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఏదైనా కళాశాలను మూసివేసినా, గుర్తింపును రద్దుచేసినా అందులోని విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేర్చాల్సిన బాధ్యత కాంపిటెంట్ అథారిటీదే. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వమే ఇతర కాలేజీలకు పంపించే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top