మానేరు మింగింది...

మానేరు మింగింది...


నీటిగుంటలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి

 

కరీంనగర్: ఈత సరదా ఆరుగురు చిన్నారులను బలి తీసుకుంది. ఓ నీటిగుంట మృత్యుగుంటలా మారి పిల్లలను కబళించింది. వారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. క్రికెట్ ఆడేందుకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానేరు డ్యాం వద్దకు వెళ్లిన చిన్నారులు ఈత కోసమని డ్యాంలో ఉన్న ఓ నీటి గుంటలో దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మృతులంతా 14 ఏళ్లలోపు వారే. ఇందులో కవలలు కూడా ఉన్నారు. పిల్లల మరణవార్తతో కడుపు కోత భరించలేని తల్లిదండ్రుల రోదన లు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.

 

క్రికెట్ ఆడాక నీటిలో దిగి...



 కరీంనగర్‌లోని రాంనగర్‌కు చెందిన యాచమనేని ప్రతీష్ (14), ప్రద్యుమ్న (10), జువ్వాడి సౌమిత్ (8), సహేత్ (8), సప్తగిరి కాలనీకి చెందిన జోగినిపల్లి శివసాయి(14) (తండ్రి వేములవాడ ఆలయంలో ఉద్యోగి), దానబోయిన సాయిశ్రీజన్ (13), బోయినపల్లి రోహన్ (12) సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో కరీంనగర్‌లోని పద్మనగర్ శివారులో ఉన్న మానేరు డ్యాం కింద క్రికెట్ ఆడడానికి వెళ్లారు. కొద్దిసేపు క్రికెట్ ఆడాక డ్యాంలోని ఓ నీటి మడుగు వద్దకు వెళ్లారు (వేసవి వల్ల డ్యాంలో నీరు ఎండిపోగా అక్కడక్కడా నీటి గుంటలు మాత్రం మిగిలాయి). వీరిలో రోహన్ బ్యాట్ కోసం ఇంటికి వెళ్లగా మిగతా వారంతా నీటిలో దిగారు. రోహన్ వచ్చే సరికి స్నేహితులు కనిపించకపోవంతో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారంతా డ్యాం వద్దకు చేరుకుని గాలించగా నీటి గుంత పక్కన ఆరుగురు పిల్లల బ్యాట్‌లు, బట్టలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నీటి మడుగులో గాలించగా ఆరుగురి మృతుదేహలు లభ్యమయ్యూరుు.



శివసాయి, సాయిశ్రీజన్ చేతికి ఉన్న గడియారాలు 7.45 గంటలకు ఆగిపోవడంతో వారు ఆ సమయానికి మృతిచెందినట్లు తెలుస్తోంది. రోహన్‌తో కలసి తొలుత ఇంటికి బయలుదేరిన సాయిశ్రీజన్ కొద్దిదూరం వెళ్లాక తిరిగి వెనక్కివచ్చి నీటిలో దిగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మృతదేహాలకు ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. పిల్లల తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘటనా స్థలికి చేరుకుని మృతుల కుటుంబాలను ఓదార్చారు.

 

ఒక్కరికే ఈత వచ్చు..




 తల్లిదండ్రుల బంధువులు, స్థానికులు చెబుతున్న వివరాల మేరకు... శివసాయికి మినహా మిగిలిన వారికి ఈత రాదు. తొలుత శివసాయి నీటి మడుగులో దిగి ఈత కొట్టడం ప్రారంభించగా మిగిలిన వారు నీటిలో దిగినట్లు భావిస్తున్నారు. మడుగు లోతు ఉండటం, అడుగున బురద ఉండటంతో వీరంతా శివసాయిని గట్టిగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మోకాల్లోతు బురదలోకి కూరుకుపోయిన శివసాయి పైకి రాలేక ఊపిరాడక మృతి చెందగా, మిగిలిన వాళ్లకు ఈత రాకపోవడంతో ప్రాణాలొదిలారు. శివసారుు మృతదేహం బురదలో కూరుకుపోరుు చివరగా బయటపడింది.



నీటి మడుగు కాదు... మృత్యుకూపం



మానేరు డ్యాంలో చాలా చోట్ల నీటి మడుగులున్నాయి. చాలా మంది ఇటుకల వ్యాపారులు అక్కడి మట్టిని తరలించడంతో గుంటలు ఏర్పడ్డాయి. గతంలో చాలా మంది విద్యార్థులు ఈతకు వచ్చి చనిపోయారని పేర్కొన్నారు. ఇంతటి ప్రమాదకరమైన నీటి మడుగు వద్ద హెచ్చరికలుగానీ కాపలాగానీ ఉంచకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్యాం అధికారులు మాత్రం తాము గతంలో ఇక్కడ హెచ్చరికగా ఎర్రజెండా పాతామని... పశువులు మేతకు వచ్చి జెండాను కూలదోసి ఉంటాయంటున్నారు.

 

 కుటుంబసభ్యులతో ప్రద్యుమ్న,

 కవలలు సహేత్, సౌమిత్, ప్రతీష్ (ఫైల్)

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top