ఎన్నాళ్లో వేచిన ఉదయం

ఎన్నాళ్లో వేచిన ఉదయం


- పోతనకాలనీకి సింగరేణి విద్యుత్

- ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర

- నేటి నుంచి సరఫరా    

యైటింక్లయిన్‌కాలనీ :
మహాకవి పోతన కాలనీవాసుల ఎనిమిదేళ్ల విద్యుత్ కష్టాలకు తెరపడింది. కార్మిక కుటుంబాల సౌకర్యార్థం న్యూ మారేడుపాక గ్రామ శివారులో 1190 క్వార్టర్లను సింగరేణి యాజమాన్యం నిర్మించింది. 2007లో ప్రారంభించిన అప్పటి సీఅండ్‌ఎండీ నర్సింగరావు మహాకవి పోతనకాలనీ అని పేరు పెట్టారు. ఆ క్వార్టర్లకు సింగరేణి యాజమాన్యం ఎక్స్‌ప్రెస్ లైన్ పేరుతో సుమారు రూ. 50లక్షలు కేటాయించి ఏపీట్రాన్స్‌కో విద్యుత్‌ను ఏర్పాటు చేసింది.



ఈ క్వార్టర్లలో ఉంటున్న కార్మికులకు తరచూ విద్యుత్ అంతరాయం కలుతుండటంతో క్వార్టర్లు మాకొద్దని ఆందోళనలు చేపట్టారు. వర్షాకాలంలో దోమలబెడద ఒకవైపు, విద్యుత్ కోత మరోవైపు ఉండటంతో అసలు క్వార్టర్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది. దీనిపై గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు పోరాటానికి దిగాయి. దీంతో స్పందించిన యాజమాన్యం ఎట్టకేలకు సింగరేణి విద్యుత్ ఏర్పాటుకు సంస్థ సీఅండ్‌ఎండీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 

నేడు ప్రారంభోత్సవం..

సింగరేణి విద్యుత్ సరఫరాను శనివారం సంస్థ ప్రాజెక్టు అండ్‌ప్లానింగ్ డెరైక్టర్ మనోహర్‌రావు ప్రారంభించనున్నారు. రూ. 30లక్షల వ్యయంతో సింగరేణి విద్యుత్ లైన్ ఏర్పాటు చేసింది. పోతనకాలనీ సబ్‌స్టేషన్‌లో సింగరేణి విద్యుత్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

 

పోతనకాలనీ క్వార్టర్లకు పెరగనున్న డిమాండ్..

పోతనకాలనీ అనుకుని సింగరేణి కోల్‌కారిడార్ ప్రధాన రోడ్డు ఏర్పాటు కావడం, క్వార్టర్లకు సింగరేణి విద్యుత్ రావడంతో పోతనకాలని క్వార్టర్లకు డిమాండ్ పెరగనుంది. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న క్వార్టర్లు కూడా పూర్తి స్థాయిలో డిమాండ్ రానుంది. రాబోయే రోజుల్లో గోదావరిఖని-సెంటినరీకాలనీ వెళ్లాలంటే ప్రధాన దారి ఇదే కావడంతో  కార్మిక కుటుంబాల దృష్టంతా ఈ క్వార్టర్లమీదే ఉంది.

 

ఎనిమిదేళ్ల కష్టాలు తీరుతున్నాయి

డ్యూటీ చేసి వ స్తే కరెంట్ లేక దోమల బాధతో నిద్రపట్టేది కాదు. ఎనిమిదేళ్లు ఎట్ల వెళ్లదీశామో తలచుకుంటేనే భయం వేస్తోంది. రాత్రి పూట వర్షాకాలం అయితే అసలు విద్యుత్ ఉండేది కాదు. ఇప్పుడు సంతోషంగా ఉంది. మ్యాజిక్‌అలీ, సెక్యూరిటీగార్డు షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి క్వార్టర్ల నిర్మించారే తప్ప ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇప్పుడిప్పుడే రోడ్డు పూర్తయ్యింది. సింగరేణి కరెంటు వచ్చింది. అయితే షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కరెంట్ ఇప్పించేందుకు కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు.

- నల్లగొండ రాజయ్య, వకీల్‌పల్లి

 

ఏళ్ల గోస గిప్పుడు తీరింది

ఏళ్లుగా పడుతున్న కరెంట్‌గోస గిప్పుడు తీరింది. చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంకా పోతనకాలనీలో కమ్యూనిటీ హాలు, సులబ్‌మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. యోగా నేర్చుకునేందుకు ప్రత్యేక హాలు నిర్మించాలి.

- కొండం నారాయణ, ఓసీపీ-1 కార్మికుడు

 


వారసంత ఏర్పాటు చేయాలి

తాజా కూరగాయలు కొనుక్కునేందుకు యైటింక్లయిన్‌కాలనీకి వెళ్లాల్సివస్తోంది. వారంలో ఒకరోజు ఇక్కడే వారసంత ఏర్పాటు చేస్తే ఈ బాధ తప్పుతుంది. అలాగే యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేసి శిక్షణ కొనసాగించాలి.

 - మాదాసు మౌనిక, పోతనకాలనీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top