ముంపు కష్టాలు షురూ..

ముంపు కష్టాలు షురూ..


భద్రాచలం : ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయిస్తూ రాష్ట్రపతి రాజముద్ర వేయటంతో భౌగోళికంగా ఈ ప్రాంతంపై తెలంగాణతో సంబంధాలు తెగిపోయినట్లే. అయితే ఈ మండలాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏమిటనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఆంధ్రకు బదలాయించిన ప్రాంతంలో ఉన్న ప్రజానీకం బాగోగులను తామే చూసుకుంటామని, ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులకు ఇప్పటికే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్‌ల నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి.

 

ముంపు పరిధిలోగురుకుల పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు ఇటీవల కాకినాడలో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ముంపులో పాలనా వ్యవహారాలు ఇక నుంచి ఆంధ్ర రాష్ట్ర అధికారులే చూసే అవకాశం ఉందని సంకేతాలు కూడా వస్తున్నాయి. అయితే ఈ పరిణామాలు ముంపులో పనిచేస్తున్న ఉద్యోగులను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న వారంతా దాదాపు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. వీరంతా తెలంగాణ రాష్ట్రానికే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.



కానీ ఆప్షన్‌ల విషయంలో ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవటంతో ప్రభుత్వం విడుదల చేసే విధి విధానాల కోసం వారు ఎదురు చూస్తున్నారు. అసలు తమకు ఆప్షన్‌లు ఉంటాయా.. లేదా.. అనే అనుమానం కూడా వారిని వేధిస్తోంది. ఉద్యోగుల పంపకాలపై కేంద్రప్రభుత్వం నియమించిన కమల్‌నాథన్ కమిటీ ఇప్పటి వరకూ విధి విధానాలను విడుదల చేయకపోగా, ఇందులో జిల్లా స్థాయి ఉద్యోగుల గురించి అసలు ప్రస్థావనే లేదనే ప్రచారం జరుగుతోంది.

 

దీంతో తమ పరిస్థితి ఏంటని ఉద్యోగులు  ఆందోళన చెందతున్నారు. ముంపు మండలాల్లో పనిచే సే వారంతా జిల్లా, జోనల్ స్థాయి పరిధిలోకే వస్తారు. వీరికి అప్షన్‌లు ఇవ్వాలన్నా,  అక్కడి నుంచి బదిలీ చేయాలన్నా ఇరు రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతోనే జరగాల్సి ఉంటుందని, దీనిపై తాడోపేడో తేల్చుకుంటామని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా, ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జూలై నెల వే తనాల చెల్లింపుపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. సోమవారం భద్రాచలం ఎస్టీవో కార్యాలయంలో జరిగిన పరిణామాలతో ఉద్యోగుల్లో మరింత ఆందోళన ఏర్పడింది.

 

బిల్లులు తీసుకునేందుకు నిరాకరణ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన భద్రాచలం, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల ఉద్యోగులకు భద్రాచలం ఎస్టీవో కార్యాలయం నుంచి, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాల్లోని ఆరుగ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బూర్గంపాడు ఎస్‌టీవో కార్యాలయం నుంచి వేతనాలు మంజూరవుతాయి. ఈ ఏడు మండలాల్లో వివిధ శాఖలకు చెందిన సుమారు 3 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. జూలై నెల వే తనాలు పొందేందుకు ఈనెల 26 లోపు సంబంధిత డీడీవో ద్వారా ఎస్‌టీవో కార్యాలయంలో బిల్లులు అందజేయాల్సి ఉంటుంది.

 

ఈ నేపథ్యంలోనే సోమవారం కొన్ని శాఖలకు చెందిన యూడీసీలు తమ కార్యాలయాల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల బిల్లులను భద్రాచలం ఎస్‌టీవో కార్యాలయంలో అందజేయగా, తీసుకునేందుకు ట్రెజరీ అధికారులు నిరాకరించారు. ముంపు మండలాలు భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించినందున, ఇక్కడి ఉద్యోగుల జీతాల బిల్లుల విషయమై తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలని, భద్రాచలం ఏటీవో ప్రేమ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. దీనిపై డీడీతో మాట్లాడితే హైదరాబాద్ స్థాయిలో చర్చించాల్సి ఉంటుందని చెప్పారని, అందుకే తాము బిల్లులు తీసుకోవడం లేదని వివరించారు. మంగళవారం నాటికి తగిన ఆదేశాలు వస్తాయని, దాన్ని బట్టి బిల్లులు తీసుకోవాలా.? వద్దా.? అనేది ఆలోచిస్తామని అన్నారు.

 

సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నద్యోగులు...

ముంపు ప్రాంత ంతో పాటు, అక్కడ నివసిస్తున్న ప్రజలంతా ఇప్పటికే భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయిన ట్లే. కానీ ఉద్యోగులు ఎటు అనేదే ప్రస్తుతం తేలాల్సి ఉంది. జూలై నెల వేతనాలు తెలంగాణ ప్రభుత్వం చెల్లించని పక్షంలో, ఆంధ్ర నుంచే వేతనాలు తీసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే ఇక్కడి ఉద్యోగులంతా ఆ రాష్ట్ర ప్రభుత్వం కిందకు వెళ్లినట్లే. దీంతో ఆందోళన చెందుతున్న ఉద్యోగులు ముంపు నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సెలవులు పెట్టి బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top