ఎలివేటెడ్ కారిడార్లతో ట్రాఫిక్‌కు చెక్

ఎలివేటెడ్ కారిడార్లతో ట్రాఫిక్‌కు చెక్ - Sakshi

  • స్కైవేస్, మల్టీ లెవల్ గ్రేడ్ సెపరేటర్స్ అవశ్యం

  • తెలంగాణ సర్కార్  నిర్ణయం

  • సాక్షి, హైదరాబాద్: నగర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలివేటెడ్ కారిడార్లు, స్కైవేస్, మల్టీ లెవల్ గ్రేడ్ సెపరేటర్స్ వంటివే పరిష్కారమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. వీటిని నిర్మించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన పలు ప్రదేశాల ఎంపిక కోసం శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.



    నగరంలో పాతబస్తీ, కొత్తబస్తీ అనే తేడా లేకుండా ఎక్కడిపడితే అక్కడ... ఎప్పుడుపడితే అప్పుడు ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణమయ్యాయని, జంక్షన్ల వద్ద ఎక్కువ సేపు ఎదురుచూడాల్సి వస్తోందని సీఎం తెలిపారు. ప్రధాన రహదారులపై జిల్లాల నుంచి వచ్చే ట్రాఫిక్‌ను తట్టుకునేందుకు అవసరమైన నివేదికలు  ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఇదివరకే ఆదేశించిన సంగతి విదితమే. కన్సల్టెంట్ల సాయంతో, బాగా రద్దీగా ఉండే ప్రాంతాలను  అధికారులు గుర్తించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందు పెట్టారు. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా ఎవరిదారిలో వారు పోవడానికి వీలయ్యేలా మల్టీలెవల్ గ్రేడ్ సెపరేటర్స్ నిర్మించడంపై చర్చించారు.

     

    అధికారులు గుర్తించిన ట్రాఫిక్ ప్రాంతాలు...

    1. హరిహరకళాభవన్ నుంచి ఉప్పల్..

    2. మాసాబ్‌ట్యాంక్ నుంచి హరిహర కళాభవన్

    3. నాగార్జున సర్కిల్ నుంచి మాదాపూర్

    4. తార్నాక నుంచి ఈసీఐఎల్

    5.చార్మినార్ నుంచి బీహెచ్‌ఈఎల్ ఇలా నగరంలో మొత్తం దాదాపు 11 స్కైవేలు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు.  



    స్కైవేల నుంచి రోడ్డు మారే ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. వాటికి అనుగుణంగా అండర్‌వేలు నిర్మించాలని సూచించారు. నగరంలో దాదాపు 35-40  కూడళ్లలో ట్రాఫిక్ సమస్యను అధిగమించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వివరించారు. ఒక్కసారి సిగ్నల్ పడితే వందలాది వాహనాలు ఆగిపోవాల్సి వస్తోందని, భవిష్యత్‌లో మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉన్నందున, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నట్టు జంక్షన్ల వద్ద  ఎత్తుగా సెపరేటర్స్ నిర్మించాలన్నారు.

     

    ఎల్‌బీనగర్, ఉప్పల్, బంజారాహిల్స్ పార్క్ చుట్టూ, ఖైరతాబాద్, సచివాలయం,  అంబేద్కర్ సెంటర్, నెక్లెస్‌రోడ్డు చౌరస్తా, ఆబిడ్స్, చాదర్‌ఘాట్, కోఠి, ఒవైసీ హాస్పిటల్, తిరుమలగిరి జంక్షన్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్,  సంగీత్, పారడైజ్, తదితర జంక్షన్ల వద్ద మల్టీ లెవల్ గ్రేడ్ సెపరేటర్స్ అవసరం ఉందన్నారు. ఎక్కడైనా మెట్రోరైలు లైను అడ్డుగా వస్తే.. దానిపై నుంచి మార్గం నిర్మించాలని కూడా ప్రతిపాదించారు. వీటికి సంబంధించి డిజైన్స్, ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, సలహాదారు బీవీ పాపారావు, జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారి సోమేశ్‌కుమార్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నరసింగరావు, రవాణారంగ నిపుణులు పాల్గొన్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top