బిల్లులు చెల్లించండి..!


 నల్లగొండ : విద్యుత్ బిల్లుల వసూళ్లకు ఆ శాఖ అష్టకష్టాలు పడుతోంది. క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించండి ప్లీజ్..! అంటూ జీపులకు మైకులుపెట్టి మరీ తిరుగుతున్నా ఫలితం లేకుండాపోతోంది. సకాలంలో అనుకున్న మేర  బిల్లులు వసూలుకాక, ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్రంలో ఏర్పడిన కొరత తీర్చేందుకు అవసరమయ్యే విద్యుత్‌ను ప్రైవేటు డిస్కంల నుంచి కొనేం దుకు కూడా డబ్బుల్లేక బిక్కమొహం వేసింది. జిల్లాలో పేరుకుపోయిన కోట్ల రూపాయల మొండిబకాయిలకుతోడు,  నెలవారీగా వసూలు కావాల్సిన బిల్లులు కూడా రావడం లేదు. బిల్లులు చెల్లించిన వాటిల్లో ఎక్కువభాగం ప్రభుత్వ సంస్థలే కావడంతో విద్యుత్‌శాఖ కఠినంగా వ్యవహరించలేకపోతోంది. నోటీసులు జారీ చేస్తున్నారే తప్ప, మరే ఇతర చర్యలు తీసుకోలేకపోతున్నారు. విద్యుత్ సరఫరా నిలిపేద్దామంటే సంబంధిత శాఖలకు సరఫరాఅయ్యే విద్యుత్ అంతా కూడా పరోక్షంగా ప్రజావసరాలతో ముడిపడి ఉండడమే కారణం.

 

 సింహభాగం ప్రభుత్వ సంస్థలే...

 జిల్లాలో రెండు కేటగిరీల్లో విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. దీంట్లో  గృహావసరాలు, గ్రామ పంచాయతీలు, పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, దేవాదాయశాఖ తదితర సంస్థల విద్యుత్ బిల్లులు ఎల్‌టీ (లోటెన్షన్) పరిధిలోకి వస్తాయి. వీటిల్లో గృహావసరాల బిల్లులు సక్రమంగానే వసూలవుతున్నా,  ప్రభుత్వ సంస్థలు, పంచాయతీ కార్యాలయాలు చెల్లించాల్సిన బకాయిలు కోట్లలో పేరుకుపోయాయి. వీటిల్లో సింహభాగం గ్రామ పంచాయతీలు, వీధిదీపాలు, వర్తక, వ్యాపార వాణిజ్య సముదాయాలు చెల్లించాల్సినవే.

 

 కలెక్టరేట్ నుంచి ప్రాజెక్టుల వరకు...

 హెచ్‌టీ (హై టెన్షన్) పరిధిలోకి మునిసిపాలిటీలు, కలెక్టరేట్, ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు వస్తాయి. ఈ సంస్థలు ప్రతి నెలా కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆయా శాఖలకు ప్రభుత్వం నుంచి విడుదలయ్యే బడ్జెట్ ప్రకారమే బిల్లులు చెల్లిస్తున్నారు. ఆ విధంగా రెండుమూడు మాసాలకోసారి విద్యుత్ బిల్లులు ఎంతోకొంత కడుతున్నారే తప్ప పూర్తిస్థాయిలో  చెల్లించడం లేదు. దీంతో ఏళ్ల కొద్ది బకాయిలు పెరిగిపోయి ఆ మొత్తం చివరకు కోట్ల రూపాయలకు చేరుతోంది.  వీటిన్నింటికి ఎప్పటికప్పుడు విద్యుత్ శాఖ నోటీసులు జారీచేస్తున్నా, వాటి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ప్రభుత్వం బిల్లులకు సరిపడా బడ్జెట్‌ను ఆయా శాఖలకు విడుదల చేస్తే తప్ప విద్యుత్‌శాఖ కష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేదు.

 

 బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటున్నాం : యు.బాలస్వామి, ఎస్‌ఈ

 ప్రభుత్వం మారడం వల్ల విద్యుత్ బకాయిల బడ్జెట్ ఆగిపోయింది. ఈ బడ్జెట్‌లో నిధులు విడుదలైతే బకాయిల కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నాం. మెట్రోవాటర్ వర్క్స్ బోర్డు సుమారు రెండు వందల కోట్లు చెల్లించాలి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చినందుకుగాను ఒక్కో రైతు సర్వీసు చార్జీ కింద రూ.30 చెల్లించాలి. సర్వీసు చార్జీలే సుమారు రూ.56 వేల కోట్లు రావాలి. ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్ యూనిట్‌కు రూ.6 నుంచి రూ.12 లు చొప్పున కొనుగోలు చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నాం. కరెంట్ కష్టాలు అర్థం చేసుకుని రైతాంగం ఆరుతడి పంటలు వేసుకోవాలి.

 

 ఎల్‌టీ కేటగిరీ    వసూలు చేయాల్సింది    వసూలైంది

 గృహావసరాలు    రూ.109.54 కోట్లు    రూ.106.64 కోట్లు

 వ్యాపార, వాణిజ్య సముదాయాలు    రూ.71.28 లక్షలు    రూ.70.80 లక్షలు

 గ్రామపంచాయతీలు, వీధిదీపాలు    రూ.50.05 లక్షలు    రూ.6.87 లక్షలు

 దేవాదాయ శాఖ    రూ.3.13 లక్షలు    రూ.2.72 లక్షలు

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top