ఎన్నిక వేళ... సీన్ రివర్స్

ఎన్నిక వేళ... సీన్ రివర్స్ - Sakshi


ఉపపోరుకు పార్టీలు సమాయత్తం

జెండా పాతేందుకు సిద్ధమైన బీజేపీ

అస్త్రాలు సమకూర్చుకుంటున్న కాంగ్రెస్

అసలేమాత్రం పట్టని రీతిలో టీఆర్‌ఎస్

ఎన్నికల వేళ సీన్ రివర్స్ అయ్యింది. జాతీయ నాయకులంతా హైదరాబాద్‌కు వచ్చి ఉప పోరుకు సైరన్ ఊదుతుంటే...  పోరు రాజేసిన గులాబీ ‘దళపతి’ హైదరాబాద్‌ను వదిలేసి సింగపూర్‌లో చక్కర్లు కొడుతున్నారు. కాంగ్రె స్ దిగ్గజం దిగ్గీరాజా, కమలం బాద్‌షా అమిత్ షా హైదరాబాద్‌లో మకాం వేసి అస్త్రాలకు పదును పెడుతుంటే, గులాబీ దళపతి సింగపూర్ సిటీ అందాలు చూస్తూ గడిపేస్తున్నారు.

 

కమళదళం కసరత్తు

మెదక్ పార్లమెంటు సీటును మోడీకి బహుమతిగా ఇవ్వాలని రెండు రోజుల కిందనే కమలనాథుడు అమిత్‌షా ఢిల్లీ ఫ్లైట్ దిగి హైదరాబాద్‌లో మకాం వేశారు. కిషన్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, రఘునందన్‌రావు లాంటి పార్టీ ముఖ్య నాయకులందరినీ పిలిచి మెదక్ ఉపపోరులో పార్టీ తరఫున ఎవరిని నిలపాలంటూ మంతనాలు జరిపారు. మెదక్ ఎంపీ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని, అందువల్ల గెలిచే సత్తా ఉన్న వారి పేర్లే సూచించాలని కోరగా, నేతలంతా ‘నేనైతేనే గెలుస్తా’ నంటూ ఎవరికి వారు రేసులో నిలిచేందుకు ప్రయత్నించారట. అయితే మెదక్ ఉపపోరులో కిషన్‌రెడ్డినే నిలపాలని తొలుత పార్టీ నాయకత్వం భావించింది. అయితే  తాను అందుకు సిద్ధంగా లేనని కిషన్‌రెడ్డి  చెప్పినట్లు సమాచారం.



రాష్ట్రపార్టీ అధ్యక్షునిగా ఉండి ఒడిపోతే బాగుండదని ఆయన ముందుగానే పోటీ నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక స్థానికుడు, యువకుడు, తెలంగాణవాది రఘునందన్‌రావు పేరు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. తెలంగాణ వాదంతోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, కేసీఆర్‌తో విబేధించారు కానీ, తెలంగాణ వాదాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఆయనకు అవకాశం ఇస్తే మోడీ అనుకూల వర్గాల ఓట్లు చీలిపోకుండా ఒడిసిపట్టుకోగలడని భావించినా, ఆయన దగ్గర ‘డబ్బు’లేదని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇక బుచ్చిరెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, బాల్‌రెడ్డి తదితరులు కూడా పోటీకి సిద్ధంగా ఉండటంతో ఎవరిని అభ్యర్ధిగా నిలబెట్టాలో అంతు చిక్కక అమిత్ షా తలపట్టుకున్నారు.

 

వ్యూహం రచిస్తున్న కాంగ్రెస్


మెదక్ ఉప ఎన్నికపై  హోటల్ దసపల్లాలో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశంలో నేతలంతా అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని తేల్చిచెప్పారు. ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పని చేస్తామని ముక్త కంఠంతో చెప్పారు. నాయకులు చెప్పిన విషయాన్నే పొన్నాల లక్ష్మయ్య అధిష్టానికి నివేదించారు. దీంతో తెలంగాణలో బక్కచిక్కిన కాంగ్రెస్ పార్టీకి మరమ్మతు చేసి మెదక్ పార్లమెంటు సీటును సోనియాకు బహుమతిగా ఇవ్వాలని కోటి  ఆశలతో ఢిల్లీ నుంచి ఫ్లైట్ దిగిన దిగ్గీరాజాకు మెతుకుసీమ నాయకులు ముచ్చెమటలు పట్టించారు. ఎప్పటిలాగే వర్గపోరుతో స్వాగతం పలికారు. ఢిల్లీలో కూర్చుని డీసీసీ అధ్యక్షుని పదవికి జగ్గారెడ్డి పేరు మీద టిక్ కొట్టిన దిగ్గీరాజా, ఇక్కడకు రాగానే వర్గపోరును చూసి  ‘అంతా..తూచ్ అన్నారు.



అధ్యక్షుని ఎంపిక మళ్లీ మొదటి నుంచి కానిద్దాం’ అన్నారు. ఇదిలావుండగా, మెదక్ టికెట్ కోసం ప్రభుత్వ మాజీ విప్ జగ్గారెడ్డి, మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ భార్య పద్మిని, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ తీవ్రంగా పోటీపడుతున్నారు. సర్వే సత్యనారాయణ ఢిల్లీలో చక్రం తిప్పి మెదక్ టికెట్ చేరువలో ఉండగా, మెతుకు సీమ నాయకులంతా కలిసికట్టుగా జిల్లాకు చెందిన వారికే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ పెట్టారు. దీంతో సర్వే రేసులో కాస్త వెనుకబడ్డారు.

 

ఇదే అదునుగా తూర్పు జగ్గారెడ్డి  టికెట్ కోసం  చకచకా పావులు కదిపారు. ఢిల్లీ స్థాయిలో  పైరవీ చేసుకున్న ఆయన, ఇటీవల మూడో కంటికి తెలియకుండా డీసీసీ అధ్యక్షుని పదవి తెచ్చుకున్నారు. అదే ఊపులో ఎంపీ టికెట్ కూడా చేజిక్కించుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో ముఠా రాజకీయాలు  తెరమీదకు వచ్చాయి. జగ్గారెడ్డిని కాలుపట్టి కిందకు గుంజేశారు. ప్రస్తుతం మెదక్ ఉపపోరులో కాంగ్రెస్ అభ్యర్థిగా సునితా లక్ష్మారెడ్డి పేరు బలంగా వినపడుతోంది. ఆమె వెనుకాలే ఉన్న పద్మినీరెడ్డి ఏం చేస్తారో చూడాలి.

 

ఎదురుచూపుల్లో గులాబీ నేతలు

ఇక గెలుపు ధీమాతో ఉన్న గులాబి దళపతి కేసీఆర్  ఎత్తులు..పైఎత్తులు కసరత్తులు అన్నీ తన ‘ట్రబుల్ షూటర్’ భుజాన పెట్టి  సింగపూర్ మీదుగా మలేషియాకు వెళ్లే రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇప్పుడాయన అక్కడి అద్దల్లాంటి రోడ్లను హైదరాబాద్‌లోనూ వేయాలనే ధ్యాసలో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. మెదక్ ఉప ఎన్నికల నామినేషన్ల ముగింపు గుడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు టెన్షన్‌తో జుట్టు పీక్కుంటున్నారు.



పార్టీ నుంచి టీఎన్‌జీఓల సంఘం అధ్యక్షుడు దేవి ప్రసాద్, ఉద్యమ సమయంలో పార్టీకి ఆర్థికంగా అండగా నిలబడిన కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాజయ్య యాదవ్, మరో రియల్టర్ టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కేసీఆర్‌ను కలిసి టికెట్ తనకే ఇవ్వాలని ఏ ఒక్కరు కూడా ధైర్యం చేసి అడగలేదు. ఒక్క దేవీ ప్రసాద్ మాత్రమే టీఎన్‌జీఓలతో కలిసి కేసీఆర్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  అయితే పక్కా ప్లాన్‌తో కేసీఆర్ ఇప్పటికే మెదక్ అభ్యర్థి ఎవరికో తేల్చేసి ఉంటారు. ఇక కావాల్సింది..ఆయన మనుసులోని ఆ పేరు బయటికి రావడమే. అంత వరకు గులాబిదళానికి ఎదురు చూపులు తప్పవు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top