ఎన్నికల హామీలను నెరవేరుస్తాం

ఎన్నికల హామీలను నెరవేరుస్తాం - Sakshi


- రూ.19 వేల కోట్ల  రైతు రుణాల మాఫీ  

- బోడ్మట్‌పల్లి నుంచి బీదర్ రోడ్డు అభివృద్ధికి రూ. 120 కోట్లు

- నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు


 అల్లాదుర్గం రూరల్: రాష్ట్రంలో త్వరలో రూ. 19 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేయన్నుట్లు రాష్ట్ర  నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. సోమవారం అల్లాదుర్గం ఎంపీపీ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చేసిన హమీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా  రూ. లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపారు. రుణ మాఫీతో ప్రభుత్వంపై రూ.19 వేల కోట్ల భారం పడనున్నదన్నారు. బోడ్మట్‌పల్లి నుంచి నిజాంపేట, నారాయణఖేడ్, పుల్‌కుర్తి, మీదుగా బీదర్ వరకు చేపట్టనున్న రోడ్డు వెడల్పు పనులకు రూ.120 కోట్లతో ప్రతి పాదనలు పంపామని, 15 రోజుల్లో నిధులు మంజూరవుతాయన్నారు.



సంగారెడ్డి నుంచి బోడ్మట్‌పల్లి  వరకు నేషనల్ హైవే కావడంతో 7 మీటర్ల రోడ్డును 10 మీటర్లు పెంచేందుకు రూ.100 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు.  బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా వృద్ధులకు , వితంతువులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ. 1500ల పింఛను అందజేస్తామన్నారు. గ్రామాల్లోనే ప్రణాళికలు తయారు చేసేందుకు మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యే బాబూమోహన్, మెదక్ ఆర్డీఓ వనజాదేవి, ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఎంపీపీ ఇందిర, జెడ్పీటీసీ మమత, ఉపాధ్యక్షులు భిక్షపతి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.

 

త్వరలో డీఎస్సీ, గ్రూప్ పోస్టుల భర్తీ

జోగిపేట: కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామనే హమీతోనే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులు నిరుద్యోగులేనని, ఏళ్ల తరబడి అతితక్కువ వేతనంతో పనిచేస్తున్న వారికి రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు  పరిమితంగానే ఉన్నారన్నారు.  భారీ ఎత్తున ఉద్యోగావకాశాలు ఉన్నందున నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రపంచ బ్యాంకు నిబంధనలకు లోబడి గతంలో నియామకాలు చేపట్టకపోవడం వల్ల చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.  ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని,

 

త్వరలో డీఎస్సీతోపాటు వివిధ శాఖల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.  గ్రూపు-1, గ్రూపు-2 పోస్టులను కూడా భర్తీ చేయనున్నామని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే బాబూమోహన్, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.

 అంగన్‌వాడీ కార్యకర్తలకు హమీ

 

అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కవిత నేతృత్వంలోని కార్యకర్తలు మంత్రి హరీష్‌రావుకు వినతి పత్రం సమర్పించారు. 30 సంవత్సరాలుగా తాము కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు తమకు రెగ్యులరైజ్ చేయాలని వారు వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top