బాలల హక్కుల పరిరక్షణకు కృషి


గజ్వేల్: బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని లీగల్ సర్వీస్ అథారిటీ జిల్లా కార్యదర్శి కనకదుర్గ పేర్కొన్నారు. గురువారం గజ్వేల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో బాలల న్యాయ సలహా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాలబాలికలు హింసకు గురికాకుండా ఈ కేంద్రం ద్వారా భద్రత కల్పిస్తామన్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారు కేంద్రాన్ని సందర్శించి న్యాయాన్ని పొందాలని సూచించారు.



లీగల్ సెల్ అథారిటీ, జడ్జి, పోలీసుల సమన్వయంతో కేంద్రం పనిచేస్తుందన్నారు. రైతు ఆత్మహత్యలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. క్షణికావేశంలో రైతులు ఆత్మహత్యల బారిన పడుతున్నారన్నారు.  కష్టాల్లో ఉన్న రైతులకు లీగల్ సర్వీస్ అథారీటీ అండగా ఉంటుందన్నారు. ఎవరైనా నేరుగా వచ్చి సమస్యలను చెప్పుకోవచ్చని తెలిపారు. సమావేశంలో గజ్వేల్ సీఐ అమృతరెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎస్‌ఐ జార్జి, ఎస్‌ఐ-2 స్వామి, నగర పంచాయతీ కౌన్సిలర్లు నరేందర్‌రావు, బోస్, శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకులు నారాయణరెడ్డి, ఆకుల దేవేందర్, రామచంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.



 బాల్యవివాహలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు

 జగదేవ్‌పూర్: ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలంటే అందరూ చిన్నచూపు చూస్తున్నారని, దేశం ఎంత ప్రగతి సాధించినా సామాజిక రుగ్మతలు కొనసాగుతున్నయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కనకదుర్గ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో ఐసీడీఎస్ అధ్వర్యంలో జరిగిన బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కనకదుర్గ మాట్లాడుతూ  దేశంలో రోజు రోజుకు బాలికల నిష్పత్తి తగ్గుతోందన్నారు. తప్పుడు భావనలే ఇందుకు మూలమన్నారు.



ఆడపిల్ల పుట్టక ముందే  భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారన్నారు. దీనిని ఆరికట్టడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఆడపిల్లల రక్షణ కోసమే ప్రభుత్వాలు ఆడపిల్లను బతికిద్దాం..ఆడపిల్లను చదవిద్దాం అనే పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.  పేదరికం వల్ల గ్రామాల్లో బాలికలను బడికి పంపకుండా, చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేస్తున్నారన్నారు. బాల్యవివాహాలు చేసినా,  లింగవివక్షకు పాల్పడినా చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. బాలల హక్కులను సంరించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.  చదువుతోనే సమాజంలో మార్పు వస్తుందన్నారు.



అందుకే ఆడ మగ తేడా లేకుండా తల్లిదండ్రులు చదివించాలని సూచించారు. కార్యక్రమంలో గజ్వేల్ జూనియర్ సివిల్ జడ్జి సంతోష్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాస్కర్, ఎస్‌ఐ వీరన్న, డిసిఎ రత్నం, ఐసిడిఎస్ అధికారి విమల, అంగన్‌వాడి మండల సూపర్‌వైజర్లు వర్దనమ్మ, రమణ, జెడ్‌పీటీసీ రాంచ్రందం, తహశీల్దార్ శ్రీనివాసులు, సర్పంచ్ కరుణకర్, ఎంఈఓ సుగుణకర్‌రావు, ఎంపీటీసీలు వెంకటయ్య, బాలేషం, అన్ని గ్రామాల అంగన్‌వాడి కర్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top