భూకంపం పుకార్ల్లతో నిద్రపోని జిల్లావాసులు

భూకంపం పుకార్ల్లతో నిద్రపోని జిల్లావాసులు


మంగళవారం రాత్రి 12 గంటలు...జిల్లా వాసుల ఫోన్‌లు అదే పనిగా రింగయ్యాయి. ఫోన్ తీసిన వారికి చెమటలు పట్టాయి. అవతలి వ్యక్తి హలో.. అన్నా.. భూకంపం వస్తుందంట ఇంట్లోనుంచి బయటకు వెళ్లండని హెచ్చరించడంతో ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి కుటుంబీకులతో సహా బయటకు పరుగు తీశాడు. ఇలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వారికి భూకంపం వస్తోందంటూ ఫోన్‌లో సమాచారం అందడంతో మెతుకుసీమ మంగళవారం జాగారం చేసింది. అయితే భూపంకం వార్తలన్నీ పుకార్లేనని తేలడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.

 

- భూకంపం పుకార్లతో బెంబేలెత్తిన  ప్రజలు        

- సర్వే కోసం స్వగ్రామాలకు వస్తే నిద్ర లేని రాత్రి!

- వదంతులేనని తేలడంతో ఊపిరి పీల్చుకున్న జనం


పుకార్లు.. షికార్లు

మిరుదొడ్డి:
మండల పరిధిలోని గ్రామాల్లో భూకంపం వస్తున్నట్లు బుధవారం తెల్లవారు జామున పుకార్లు షికార్లు చేశాయి. భూకంపం వస్తోంది.. అందరూ ఇళ్ల నుంచి బయటకు రావాలంటూ మిత్రులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల నుంచి ఫోన్లు రావడంతో జనం భయకంపితులై రోడ్లపైకి వచ్చి చేరా రు. వివిధ గ్రామాల్లో నివసిస్తున్న తమ బంధువుల యోగక్షేమాలను తెలుసుకునేందుకు ఫోన్లు చేశారు. ఇళ్లల్లో పడుకోవద్దని పిల్లాజెల్లాతో సహా ఆరు బయట ఖాళీ ప్రదేశాల్లోనే పడుకోవాలని సూచించారు.

 

సమయం మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట .. ఫోన్ రింగ్.. అవుతోంది.. పది సెకన్ల తర్వాత లిఫ్ట్ చేశాడు శ్రీనివాస్.. అవతలి వ్యక్తి హలో.. అన్నా.. పడుకున్నారే.. నిద్రవట్టిందా.. హా.. ఇప్పుడిప్పుడే కన్నంటుకుందిరా.. ఏం గీ టైంల ఫోన్ జేశినవ్.. ఏం లేదే మన పక్క మండలంల భూకంపమొచ్చిందట.. నాకు ఇప్పుడే ఫోనొచ్చిందే.. తెల్వంగనే అందర్నీ బయటకు తీసుకొచ్చి ఎందుకైనా మంచిదని నీకు గూడ జెప్తున్న..! అలో.. లచ్చక్కా.. నిద్రవోయినారె.. ఏడ శెల్లే.. భూకంపం ఒత్తందని ఈడంత లొల్లిలొల్లి అయితందే.. అయ్యో అక్కా గీ ముచ్చట మీకు ఎర్కైందో లేదోనని భయమై పోన్ జేశిననే.. ఇవీ.. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ జిల్లాలో షికార్లు చేసిన పుకార్లు.. ఎవరు సృష్టించారో.. ఎక్కడ మొదలైందో తెలియదు కానీ భూకంపం వదంతులు ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేశాయి. పిల్లాజెల్లాతో కలిసి వాకిళ్లలోనే పడుకున్నారు. చివరకు ఇవన్నీ ఉత్తి మాటలేనని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

 

కొండపాక మండలంలోనూ...

కొండపాక:
భూకంపం వస్తుందని కొండపాక మండలంలోని కొన్ని గ్రామా ల్లో బుధవారం తెల్లవారుజామున జోరుగా పుకార్లు లేచాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇళ్ల నుండి బయటికి వచ్చారు. తీరా ఇవన్నీ వదంతులేనని తెలుసుకొని ఊపిరిపీల్చుకున్నారు. మండలంలోని లకుడారం, మెధినీపూర్, తిమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఎవరో ఆయా గ్రామాల్లోని ఒకరిద్దరికి ఫోన్‌చేసి భూకంపం రాబోతోందని, ఇళ్లలో ఉండొద్దని చెప్పడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటికి వచ్చి కూర్చున్నారు. ఇవన్నీ పుకార్లేనని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

 

 

తెల్లవార్లూ ఆరుబయటే

నారాయణఖేడ్ రూరల్:
భూకంపం వస్తుందన్న పుకార్లు షికార్లు చేయడంతో జనాలు తెల్లవార్లూ జాగారం చేయాల్సివచ్చింది. బుధవారం తెల్లవారు జాము 2 గంటల ప్రాంతంలో భూకంపం వస్తుందన్న ఫోన్లు రావడం, పుకార్లు వ్యాపించడంతో నారాయణఖేడ్ మండలంలోని అన్ని గ్రామాల్లోనూ జనాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఫలానా గ్రామంలో భూకంపం ప్రారంభం అయ్యిందంటూ పుకార్లు రావడంతో తమ బంధువులను అప్రమత్తం చేశారు. వెంకటాపూర్, జూకల్, సత్తెగామ, సంజీవర్‌రావుపేట్, నిజాంపేట్, ర్యాలమడుగు, రుద్రార్, పంచగామ, పైడిపల్లి, ర్యాకల్, అబ్బెంద, చాప్టా(కె) తదితర గ్రామాల్లో జనాలు తెల్లవార్లూ ఆరుబయటే నిద్రించారు. ఇళ్లకు తాళాలు వేసి ఆరుబయట, మందిరాలవద్ద సేదతీరారు. సెల్‌ఫోన్ వాడకం పెరగడం వల్ల ఒకరికొకరు ఫోన్లు చేసుకోవడంతో పుకార్లు త్వరితగతిన అన్ని గ్రామాలకూ వ్యాప్తి చెందాయి.

 

దావానలంలా వ్యాపించిన వదంతులు

 దుబ్బాక:
భూమి కంపిస్తోందన్న పుకార్లతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బుధవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో వదంతులు రావడంతో ఒక్కసారిగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. దూర ప్రాంతంలో ఉన్న బంధువులు, మిత్రులు ఫోన్ల ద్వారా ఒకరికొకరు సమాచారం చేరవేసుకోవడంతో నియోజకవర్గమంతా ఈ వార్త దావానలంలా వ్యాపించింది.   

 

కంటి మీద కునుకు లేకుండా

రామాయంపేట:
భూకంపం వస్తుందనే భయంతో మంగళవారం రాత్రి ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. భూకంపం వస్తుందని నిజామాబాద్ జిల్లా నుంచి తమకు సమాచారం అందిందని, దీనితో తాము నిద్రలేకుండా ఇళ్లముందు పడిగాపులు కాశామని మండలంలోని అక్కన్నపేట, కాట్రియాల, కోనాపూర్, నిజాంపేట, నస్కల్ గ్రామాల ప్రజలు తెలిపారు. ఇలా మండలంలోని చాలా గ్రామాలకు పుకార్లు వ్యాపించడంతో ప్రజలు హడలెత్తిపోయారు. భూకంపం వస్తుందని ఎవరో కావాలనే పుకార్లు పుట్టించారని కొందరు చెప్పారు.

 

ఒకటాయె.. రొండాయె.. ఆఖరికి తెల్లారె!

పుల్‌కల్:
భూ కంపం వచ్చేస్తోంది.. ఇళ్లు కూలిపోతాయంట.. అందరూ బయటకు వచ్చేయండి.. అంటూ ఫోన్లు.. దీంతో ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. పన్నెండు గంటలకు ఫోన్లు రావడంతో లేచి కూర్చున్న ప్రజలు రాత్రంతా జాగారం చేశారు. ఒకటాయె.. రొండాయె.. ఆఖరికి తెల్లారె.. భూకంపం లేదు.. ఏం లేదు. ఇవన్నీ పుకార్లేనని తేలడంతో ప్రజలు హమ్మయ్యా.. అనుకున్నారు.

 

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని  

దౌల్తాబాద్:
భూకంపం వస్తోందంటూ వదంతులు లేవడంతో జనాలు ఆరుబయటకు వచ్చి జాగారణ చేసిన సంఘటన మంగళవారం రాత్రి దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో చోటుచేసుకుంది. అర్ధరాత్రి సుమారు 12 గంట ల సమయంలో హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో ఉన్న బంధువులు దొమ్మా ట, గాజులపల్లి, సూరంపల్లి, వడ్డెపల్లి, రామా రం, దౌల్తాబాద్, రాంసాగర్, అనాజీపూర్‌వాసులకు  భూకంపం వస్తోందంటూ ఫోన్లు రావడంతో హడలెత్తిపోయారు. తెల్లారే వరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు.

 

రాకరాక ఇంటికొస్తె గిదేం గోస!

రేగోడ్:
మండలంలో మంగ ళవారం సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేసుకుని అధికారులు, ప్రజలు రాత్రి నిద్రపోయారు. అర్ధరాత్రి భూకంపం వస్తుందని ఇక్కడి ప్రజలకు బంధువులు, స్నేహితులు ఫోన్లు చేశారు. ఆ ఒక్క ఫోన్‌కాల్‌తో జనమంతా రాత్రంతా జాగరణ చేశారు. సర్వే వివరాలు తెలిపేందుకు ఆయా పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చిన ప్రజలు రాత్రి నిద్రలేక ఇబ్బందులు పడ్డారు. రాకరాక సొంతిళ్లకు చేరుకున్న వారు రాత్రంతా నిద్ర లేక భయంభయంగా గడిపారు.

 

కుక్కిన పేనుల్లా.. బిక్కుబిక్కుమంటూ!

నర్సాపూర్:
మంగళవారం రాత్రి నర్సాపూర్ తో పాటు మండలంలోని తుజాల్‌పూర్ తది తర గ్రామాల్లో భూకంపం వస్తోందంటూ  పుకార్లు రావడంతో గాఢనిద్రలో ఉన్న ప్రజ లు లేచి కుక్కిన పేనుల్లా బిక్కుబిక్కుమంటూ గడిపారు. తుజాల్‌పూర్‌కు చెందిన ఒకరికి తమ బంధువులు ఫోన్ చేసి తమ ప్రాంతం లో భూకంపం వస్తోందని చెప్పి జాగ్రత్తగా ఉండాలనడంతో కలకలం రేగింది. ఈ వార్తలు గాలి కన్నా వేగంగా వ్యాపించి నియోజకవర్గ ప్రజలకు నిద్ర లేకుండా చేశాయి.

 

ఆరుబయటే జాగారం

కల్హేర్:
మండలంలో భూకంపం వదంతులు వ్యాపించాయి. మంగళవారం అర్ధరాత్రి భూకంపం వస్తుందని పుకార్లు షికారు చేశాయి. కల్హేర్, మాసాన్‌పల్లి, మార్డి, నాగధర్ తదితర చోట్ల భూకంపం వస్తుందని వదంతులు వచ్చాయి. బుధవారం తెల్లవారుజాము వరకు పుకార్లు కొనసాగాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పిల్లాపాపలతో కలిసి బయటే జాగారం చేశారు. కొందరు ఇంటి బయటే నిద్రించారు.

 

ప్రజల్లో భయాందోళన  

నారాయణఖేడ్, పెద్దశంకరంపేట:
భూకంపం పుకార్లతో నారాయణఖేడ్ పట్టణం, పెద్దశంకరంపేట మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భూమి కంపిస్తోందంటూ స్థానికులకు ఫోన్లు వచ్చాయి. దీంతో నారాయణఖేడ్ పట్టణంలోని కొందరు ఫోన్లు, టీవీ చానళ్లు చూసి భూకంపం వస్తుందా లేదా అని ఆరా తీశారు. పెద్దశంకరంపేట మండలంలోని బూర్గుపల్లి, చీలపల్లి, కోళపల్లి, కె.వెంకటాపూర్, తదితర గ్రామాల ప్రజలు ఇళ్ల నుంచి ఆరుబయటకు వచ్చి పడిగాపులు కాశారు. ఉదయం వరకు భూమి ఎప్పుడు కంపిస్తుందో ఏమోనని ఆందోళన చెంది ఇంటి బయటే గడిపారు.

 

కుక్కిన పేనుల్లా.. బిక్కుబిక్కుమంటూ!

నర్సాపూర్:
మంగళవారం రాత్రి నర్సాపూర్‌తో పాటు మండలంలోని తుజాల్‌పూర్ తదితర గ్రామాల్లో భూకంపం వస్తోందంటూ  పుకార్లు రావడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు లేచి కుక్కిన పేనుల్లా బిక్కుబిక్కుమంటూ గడిపారు. తుజాల్‌పూర్ గ్రామానికి చెందిన ఒకరికి తమ బంధువులు ఫోన్ చేసి తమ ప్రాంతంలో భూకంపం వస్తోందని చెప్పి జాగ్రత్తగా ఉండాలనడంతో కలకలం రేగింది. ఈ వార్తలు గాలి కన్నా వేగంగా వ్యాపించి నియోజకవర్గ ప్రజలకు నిద్ర లేకుండా చేశాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top