పొన్నాల అసమర్థత వల్లే కాంగ్రెస్ ఓటమి


  • రేట్లు పెంచే ఫైళ్ల మీద మాత్రమే సంతకాలు పెడుతున్న కేసీఆర్

  • కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్

  • డోర్నకల్ : పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అసమర్థపు నాయకత్వం వల్లే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందిందని కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్ ఆరోపించారు. డోర్నకల్‌లోని అశోక్ భవన్‌లో శనివారం జరిగిన కాంగ్రెస్ మండలస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పొన్నాల లక్ష్మయ్యను పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన నాటి నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగడం ప్రారంభమైందన్నారు.



    పొన్నాల వల్లే కాంగ్రెస్ ఓటమి పాలైందన్న విషయాన్ని తాను ఎక్కడైనా ధైర్యంగా చెబుతానని పేర్కొన్నారు. పొన్నాల మినహా ఎవరు ఆ పదవిలో ఉన్నా... ఫలితాలు ఆశాజనకంగా ఉండేవన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగనప్పుడు... రెడ్యానాయక్ ప్రాతినిథ్యం వహిస్తున్న డోర్నకల్‌లో అభివృద్ది ఎలా జరుగుతుందన్నారు.



    రేట్లు పెంచే ఫైళ్ల మీద మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం పనులతో ఆయన కుటుంబానికే లబ్ధి జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు ముఖ్యమంత్రి గానీ... ఉప ముఖ్యమంత్రి గానీ అయ్యే అవకాశముండేదన్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా రెడ్యాకు డోర్నకల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సత్తా ఉందన్నారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎంపీపీ మేకపోతుల రమ్య, జెడ్పీటీసీ సభ్యురాలు కేశబోయిన స్వరూప పాల్గొన్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top