‘మత్తు’ వదిలించేదెవరు?

‘మత్తు’ వదిలించేదెవరు? - Sakshi


పోలీసులా.. ఎక్సైజ్‌నా.. సీఐడీనా..?

సాక్షి, హైదరాబాద్‌:
ఒక్క కేసు.. పదిహేను రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పంజాబ్‌ను కుదిపేసిన డ్రగ్స్‌ మహమ్మారి తరహాలో రాష్ట్రం మొత్తంగా కలవరం రేపింది. తొలుత విద్యార్థులు, ఆ తర్వాత హోటళ్లు, ఇప్పుడు సినీ ప్రముఖులు.. రేపు వ్యాపారవేత్తలు.. ఎల్లుండి రాజకీయ ప్రముఖుల వారసులు.. ఇలా ఒక్క కేసులోనే వివిధ రంగాలకు చెందిన వారు వెలుగులోకి వస్తున్నారు.



నియంత్రణ బాధ్యత ఎవరిది?

తొలిసారిగా సంచలన రీతిలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభా గం డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టును చేధించింది. కేసులో 15 మంది పెడ్లర్లను అరెస్ట్‌ చేసింది. పెడ్లర్లుగా భావిస్తున్న సినీ ప్రముఖులకు శ్రీముఖాలు జారీ చేసింది. అయితే ఇదంతా భారీ స్థాయిలో హడావుడి కార్యక్రమంగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేసు చేధించిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రాష్ట్రంలోకి డ్రగ్స్‌ రాకుండా నియంత్రించేంత సామర్థ్యం కలిగి ఉందా.. అని అధికారులను ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఓ కేసు పట్టుకుని దాని చార్జిషీట్‌ వేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, రాష్ట్రంలోకి డ్రగ్స్‌ రాకుండా అడ్డుకోవడం, ఎక్కడి నుంచి వస్తుందో అక్కడే దాన్ని తుంచేసే బాధ్యత ఎవరిదన్నది చర్చనీయాంశంగా మారింది.



రాష్ట్రంలోని విభాగాలు.. వాటి శక్తులు..

డ్రగ్స్‌పై నియంత్రణ బాధ్యత ఏ విభాగానిదో ఇప్పటికీ ఉన్నతాధికారులకే స్పష్టంగా తెలియదు. ఇన్‌ఫార్మర్లు ఇచ్చే సమాచారంతో అడపాదడపా కేసులు వేసే పోలీస్‌ శాఖదా.. లేక నిత్యం మద్యం వ్యవహారాలు, గుడుంబా నియంత్రణ వంటి వ్యవహారాలు చూసే ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌దా అని తేల్చుకోలేకపోతున్నారు. ఇవికాక కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో కూడా డ్రగ్స్‌ నియంత్రణ, చర్యలు చేపడుతుంది.


రాష్ట్రంలో ప్రధానంగా డ్రగ్స్‌ నియంత్రణను పర్యవేక్షించాల్సిన విభాగం సీఐడీలోని నార్కోటిక్‌ సెల్, హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో యాంటీ నార్కోటిక్‌ సెల్‌ ఉన్నాయి. ఇప్పటివరకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో చెప్పుకోదగ్గ రీతిలో డ్రగ్స్‌ కేసులను పట్టుకున్న, మూలాలను చేధించిన ఘటన ఒక్కటీ లేదు. రాష్ట్రంలో ఉన్న సీఐడీలో ఒకటి రెండు కేసులు తప్ప.. ఇప్పటివరకు పెద్దగా చేధించిన డ్రగ్‌ కేసులేమీ లేవు. వీటితో పోల్చుకుంటే హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని టాస్క్‌ఫోర్స్, యాంటీ నార్కోటిక్‌ సెల్‌ చురకుగా పనిచేస్తున్నాయి. ఇక ప్రస్తుతం నడుస్తున్న కేసు మినహా పెద్దగా చెప్పుకోదగ్గ కేసులేవి ఎక్సైజ్‌ శాఖ చేధించలేదని ఆ విభాగం ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.



యాంటీ నార్కోటిక్‌.. కోరలు తీసిన పాము

సాధారణంగా ఒక ఎస్పీ స్థాయి నేతృత్వంలో పని చేయాల్సిన నార్కోటిక్‌ సెల్‌ ప్రస్తుతం ఒక డీఎస్పీ, ఒక ఇన్‌స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లతో కాలం వెళ్లదీస్తోంది. ఒక ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 10 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుళ్లతో నార్కోటిక్‌ సెల్‌ పటిష్టంగా ఉండాలి. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేసే యాంటీ నార్కోటిక్‌ విభాగానికి ప్రత్యేకంగా డ్రగ్‌ పెడ్లర్లపై సర్వైలెన్స్‌ పెట్టాలన్నా, విజిలెన్సింగ్‌ చేయాలన్న అధికారం లేదు. కేవలం కేసుల దర్యాప్తులు, చార్జిషీట్‌ దాఖలుకు మాత్రమే పనిచేస్తోంది. ఈ విభాగం కోరలు తీసేసిన పాములా బుస కొట్టడం తప్పా.. పెద్దగా చేసేదేమీ లేదన్న విమర్శ కూడా వినిపిస్తోంది.



ఎక్సైజ్‌కు వ్యవస్థే లేదు..

ఆబ్కారీ శాఖలో గుడుంబా నియంత్రణ, కల్తీ కల్లు, ఇతరత్రా విజిలెన్స్‌ కేసులు నమోదు చేసే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి పెద్దగా కేసుల దర్యాప్తులో సామర్థ్యం లేదు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో అంతా కలిపి 40 మంది సిబ్బంది కూడా లేకపోవడం ఈ విభాగం తీవ్ర సమస్య. ప్రస్తుత డ్రగ్స్‌ కేసు దర్యాప్తునకు యాక్షన్‌ టీం, టెక్నికల్‌ అనాలసిస్‌ అడ్వాన్స్‌ టీం, ఇంటర్‌ స్టేట్‌ గ్యాంగ్‌ రిలేటింగ్‌ టీం, ఇంటెలిజెన్స్‌ వింగ్‌.. ఇలా పలు విభాగాలు పటిష్టంగా ఉండాలి. ఇవేవి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లో లేకపోవడం కేసు దర్యాప్తు ఆలస్యం కావడానికి కారణాలని అధికారులే చెబుతున్నారు.



పేరుకే నార్కోటిక్‌ సెల్‌

సీఐడీలో పేరుకు మాత్రమే నార్కోటిక్‌ సెల్‌ విభాగం ఉంటుంది. కానీ ఈ విభాగంలో అధికారులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇప్పటివరకు ఒక్క డ్రగ్‌ కేసు కూడా నార్కోటిక్‌ సెల్‌ పట్టుకోలేకపోయింది. సరిపడా అధికారులు, సిబ్బంది కొరత ఒక కారణం కాగా, దీనికంటూ ప్రత్యేక వ్యవస్థ లేకపోవడం మరో కారణం. డ్రగ్స్‌ సమాచారం రావాలంటే ఇన్‌ఫార్మర్లకు సీక్రెట్‌ ఫండ్‌ కింద లక్షల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సీక్రెట్‌ ఫండ్‌ కేవలం ఇంటెలిజెన్స్‌కే సరిపెడుతోంది. రాష్ట్ర పోలీస్‌ శాఖకు కీలకమైన సీఐడీకి నయా పైసా సీక్రెట్‌ ఫండ్‌ ఇవ్వకపోవడం ఇబ్బందిగా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top