ప్రజల ప్రాణాలతో చెలగాటం

ప్రజల ప్రాణాలతో చెలగాటం - Sakshi


* పులుమామిడి సబ్ సెంటర్‌లో కాలం చెల్లిన మాత్రల పంపిణీ

* తీవ్ర ఇబ్బందికి గురైన రోగి

* పట్టించుకోని అధికారులు


నవాబుపేట: అధికారుల నిర్లక్ష్యం జనాల పాలిట శాపంగా మారుతోంది. మండల పరిధిలోని పులుమామిడి గ్రామ సబ్ సెంటర్‌లో ఓ ఏఎన్‌ఎం కాలం చెల్లిన మందుల పంపిణీ చేసింది. దీంతో ఓ రోగి తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పులుమామిడి గ్రామానికి చెందిన టి. వెంకటేషంగౌడ్‌కు ఉదయం 11 గంటల సమయంలో కడుపునొప్పి వ చ్చింది. దీంతో ఆయన గ్రామంలోని ప్రభుత్వ సబ్ సెంటర్‌కు వెళ్లాడు. విధుల్లో ఉన్న ఏఎన్‌ఎం స్రవంతికి విషయాన్ని చెప్పాడు.



దాంతో ఆమె కొన్ని మాత్రలు వెంకటేశంగౌడ్‌కు ఇచ్చింది. మాత్రలు వేసుకుంటే నొప్పి తగ్గిపోతుందని చెప్పింది. ఇంటికి వెళ్లిన ఆయన మాత్రలు వేసుకోగా నొప్పి తగ్గలేదు. మరింత తీవ్రమైంది. దీంతో వెంకటేశంగౌడ్ మాత్రలను గ్రామానికి చెందిన పలువురికి చూపించి అవి కాలం చెల్లినవి (జూన్ 2014 ఎక్స్‌పైరీ డేట్)గా గుర్తించాడు. ఆయన తిరిగి సబ్ సెంటర్‌కు వెళ్లగా అక్కడ ఏఎన్‌ఎం స్రవంతి లేదు.



అక్కడి నుంచి నవాబుపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన వెంకటేశంగౌడ్ విషయం డాక్టర్ సందీప్‌కుమార్‌కు చెప్పాడు. మొదట్లో సరిగా స్పందించని డాక్టర్.. వెంకటేషంగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సర్దిచెప్పాడు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా..  వెంకటేషంగౌడ్ కంటే ముందు అదే గ్రామానికి చెందిన కె.జయమ్మ కీళ్ల నొప్పులతో సబ్ సెంటర్‌కు వెళ్లగా ఆమెకు కూడా కాలం చెల్లిన మందులు ఇచ్చారని స్థానికులు ఆరోపించారు. ఈ విషయమై డాక్టర్ సందీప్‌కుమార్‌ను ఫోన్లో సంప్రదించే యత్నం చేయగా ఆయన స్పందించలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top