డ్రిప్.. దందా

డ్రిప్..  దందా - Sakshi


మహబూబ్‌నగర్ వ్యవసాయం:

 అధిక పంటదిగుబడులు సాధిం చడంతో పాటు నీరు, కరెంట్‌ను ఆదా చేసి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీపై పంపిణీ చేస్తున్న డ్రిప్ పరికరాలు గద్వాల కేంద్రంగా సరిహద్దు దాటుతున్నాయి. ఆయా కంపెనీల డీలర్లు, ఉద్యోగులు, కొందరు రాజకీయ నాయకుల అండదండలతో పక్కరాష్ట్రాలకు తరలుతున్నాయి. దీంతో ఏటా రూ.ఐదుకోట్ల మేర రాయితీ సొమ్ముకు గండిపడుతోంది. ఈ వ్యవహారమంతా జిల్లా మై క్రోఇరిగేషన్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి.



 దందా ఇలా..

  100 శాతం, 90శాతం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తున్న డ్రిప్ పరికరాలను కొన్నిచోట్ల రైతుల నుండి డీలర్లు, మధ్యవర్తులు తక్కువధరలకు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ధరలకు అ మ్ముతున్నారు. రాయలసీమ ప్రాంతంలో వీటికి బాగా డిమాండ్ ఉంది.



  కొన్నిచోట్ల రైతుల నుండి డీలర్లు దరఖాస్తులను తీసుకుని మైక్రోఇరిగేషన్ అధికారులతో మంజూరు చేయించుకుంటున్నారు. వాటిని రైతులకు తెలియకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రైతులు ప్రశ్నిస్తే అప్పుడు ఇప్పుడు ఇస్తామని తిప్పుకుంటున్నారు.



   మరికొన్నిచోట్ల పాత దరఖాస్తులు లేవని రైతులకు చెప్పి.. కొత్తగా దరఖాస్తులు చేయిస్తున్నారు. ఇలా మంజూరైన పరికరాలను రైతులకు దక్కకుండా పక్కదారి పట్టిస్తున్నారు. ఒకసారి డ్రిప్‌లు పొందిన రైతులు పదేళ్లలోపు దరఖాస్తు చేసుకోకూడదు. కానీ ఇలాంటి దరఖాస్తులే ఎక్కువగా వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఏటా అధికభాగం గద్వాల డివిజన్ పరిధిలో ఉన్న మండలాలకు పరికరాాలను కేటాయిస్తారు.



  గద్వాల, మల్దకల్ మీదుగా వీటిని కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, జడ్చర్ల నియోజకవర్గాల నుండి శ్రీశైలం మీదుగా గుంటూరు, రాయలసీమ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు.   

 

 అక్రమాలు వెలుగులోకి..

 నాలుగునెలల క్రితం కోస్గి మండలంలో ఓ కంపెనీ ఉద్యోగి, డీలర్ కలిసి రైతులకు ఇచ్చిన డ్రిప్‌లను తిరిగి తీసుకుని ఓ లారీలో తరలిస్తుండగా స్థానికులు మైక్రోఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదుచేయగా చర్యలకు ఉపక్రమించారు. సీఎం కేసీఆర్‌కు స్వయంగా ఫిర్యాదుచేశారు. స్పందించిన ముఖ్యమంత్రి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ఆదేశించారు.



ఈ విషయమై రాష్ట్ర మైక్రో ఇరిగేషన్ పీఓ వెంకటరమణరెడ్డి డ్రిప్ కంపెనీల కోఆర్డినేటర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా జరిగితే కఠినచర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. కాగా, కోస్గి వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ఎంఐపీ సిబ్బంది, కంపెనీల ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. విజిలెన్స్ విచారణ చేపట్టకముందే అంతర్గత విచారణ పేరుతో ఎంఐపీ అధికారులు విచారణ చేపట్టి ఏమీ తేల్చలేకపోయారు.  



  20 బండిళ్ల డ్రిప్‌పైపుల పట్టివేత

 గద్వాలటౌన్: గద్వాల పట్టణ శివారులో నిల్వఉంచిన 20 బెండళ్ల రాయితీ డ్రిప్ పైపులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మైక్రో ఇరిగేషన్ స్టేట్ ప్రాజెక్టు పీడీ విద్యాశంకర్, ఏపీడీ సురేష్ ఆదేశాల మేరకు బుధవారం ఆ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈద్గా సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన రాయితీడ్రిప్ పైపులను అధికారులు గుర్తించారు.



ప్రభుత్వం రైతులకు మంజూరు చేసిన రాయితీ డ్రిప్ పైపులుగా స్థానిక అధికారులు శివకుమార్, జనార్ధన్‌లు గుర్తించారు. టౌన్ ఏఎస్సై సూర్యప్రకాష్, సిబ్బంది డ్రిప్ పైపులను పరిశీలించారు. ఈ పైపులపై ప్రభుత్వం విడుదల చేసిన ఎంబోజింగ్ ఉందని అధికారులు తెలిపారు. చిన్న, సన్నకారు రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ రైతులకు పెద్ద మొత్తంలో రాయితీపై డ్రిప్ పైపులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. అక్రమంగా నిల్వ ఉంచిన డ్రిప్ పైపులను పరిశీలించడానికి గురువారం జిల్లా కేంద్రం నుంచి అధికారులు వస్తున్నారని తెలిపారు. దీనిపై టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top