తాగునీరు తగ్గుతోంది!

తాగునీరు తగ్గుతోంది!


► జలాశయాల్లో అడుగంటుతున్న నీటి మట్టాలు

► నగర శివారు కాలనీల్లో నల్లాలకు నీళ్లు బంద్‌

► నీటి సరఫరాపై దృష్టిసారించని పాలక, అధికార వర్గాలు

► నెల రోజుల వరకు  ఢోకా లేదంటున్న గ్రేటర్‌ ఇంజనీర్లు




వరంగల్‌ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌ దాహార్తిని తీర్చే జలాశయాల్లో నీరు తగ్గిపోతోంది. ఎండల తీవ్రతతో ఆయా జలాశయాల్లో నీటి మట్టం పడిపోతోంది. నాలుగైదు రోజులకోమారు అరకొరగా నీరు సరఫరా చేస్తుండటంతో శివారు కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్‌ మహా నగర పాలక సంస్థ పరిధిలో ధర్మసాగర్, వడ్డేపల్లి, భద్రకాళి జలాశయాలున్నాయి. నగర పరిధిలో, విలీన గ్రామాల్లో కలిపి 80వేల నల్లాలకు నీళుసరఫరా చేయాల్సి ఉంది.



ఈ దశలో ధర్మసాగర్‌ చెరువు మరో పక్షం రోజుల్లో డెడ్‌ స్టోరేజీకి చేరనుంది. భద్రకాళి, వడ్డేపల్లి చెరువుల్లో కూడా నీటి మట్టాలు అడుగంటిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వతో మరో నెల రోజుల పాటు సరఫరా చేస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. గత ఏడాది రూ.15 కోట్లు వెచ్చించి ప్రత్యామ్నాయంగా దేవాదుల ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా చేపట్టారు. ఈ ఏడాది అటుపై దృష్టిసారించడం లేదు.  



నీటి సరఫరాలో కోత..

మూడు రిజర్వాయర్‌లలో నీరు అడుగంటిపోవడంతో నీటి సరఫరాలో కోతలు మొదలు పెట్టారు. వరంగల్‌ ప్రాంతంలోని వ్యవసాయ మార్కెట్‌ రోడ్డులోని మధురానగర్‌ కాలనీ, లక్ష్మి గణపతి కాలనీ, మర్రి చెన్నారెడ్డి కాలనీ, వీవర్స్‌ కాలనీ, తుమ్మలకుంట, ఎన్టీఆర్‌ నగర్‌ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఎస్‌ఆర్‌టీ, టీఆర్‌టీ, గరీబ్‌ నగర్, ఎస్‌ఆర్‌ నగర్, రైల్వే గేట్‌ ప్రాంతంలోని రంగశాయిపేట, నాగేంద్ర నగర్, ఖిలా వరంగల్, చంద్రవద కాలనీ, కాశికుంట, హన్మకొండలోని న్యూశాయంపేట, పద్మాక్ష్మి కాలనీ, లక్ష్మిపురం, ప్రకాశ్‌రెడ్డి పేట, స్నే హనగర్, పరిమళ కాలనీ, భీమారం, గుండ్ల సింగారం, సమ్మ య్య నగర్, సగర వీధి, కాజీపేటలోని బాపూజీ నగర్, సోమిడి తదితర కాలనీల్లో రెండు, మూడు రోజు లకోసారి నీటి సరఫరా చేస్తున్నారు. మొన్నటి వరకు వర కు నల్లాలకు గంట పాటు నీళ్లు వచ్చేవి. ఇప్పడు అరగంటకు తగ్గించారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


రంగుమారుతున్న నీళ్లు..

గత వారం రోజులుగా నల్లాల ద్వారా రంగుమారిన నీళ్లు వస్తున్నాయి. వడ్డేపల్లి, భద్రకాళి చెరువుల్లో ఉన్న నీళ్లు పచ్చరంగుగా మారాయి. వీటిని సరిగ్గా శుద్ధి చేయకపోవడంతో దుర్వాసన వస్తున్నాయని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా తాగునీటి నిల్వలు తగ్గుతున్నప్పడు నీళ్లు బురదతో వస్తాయని ఇంజనీర్లే అంటున్నాయి. అయినా వాటివల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా, రసాయనాలు వాడుతున్నామని చెబుతున్నారు. కాలనీల్లో ప్రజలు మాత్రం నల్లా నీళ్లను తాగేందుకు జంకుతున్నారు. ఒండ్రు మట్టి, పచ్చరంగు, నాచు వస్తోందని వాపోతున్నారు. దీంతో మినరల్‌ వాటర్‌ కొనుగోలు చేసి దాహర్తిని తీర్చుకుంటున్నారు.  


ఎల్‌ఎండీ నీళ్లే దిక్కు..

కరీంనగర్‌ జిల్లా లోయర్‌ మానేరు డ్యాం(ఎల్‌ఎండీ) నుంచి కెనాల్‌ ద్వారా గ్రేటర్‌ వరంగల్‌కు నీళ్లు విడుదల చేయాలి. అందుకోసం కమిషనర్, ఇంజనీరింగ్‌ అధికారులు చొరవ చూపాలి. ఎల్‌ఎండీలో నీళ్లు ఆశాజనంగా ఉన్నాయి.  సమ్మర్‌ జలశయాలు అడుగంటుతున్నందున ఇంజనీర్లు మేల్కోవాల్సిన అవసరం ఉంది.

 

జలాశయాల్లో తాగునీటి నిల్వలు ఇలా..

నగరానికి  రోజు ఐదు ఎంసీఎఫ్‌టీల నీళ్లు అవసరం. మూడు జలాశయాల్లో ఉన్న నిల్వలు మరో 30 రోజులకు సరిపోతాయని ఇంజనీర్లు చెబుతున్నారు. ధర్మసాగర్‌ చెరువు సామర్థ్యం 839 ఎంసీఎఫ్‌టీలు. ప్రస్తుతం 200 ఎంసీఎఫ్‌టీల వరకు నీళ్లున్నాయి. అందులో డెడ్‌ స్టోరేజీ 60 ఎంసీఎఫ్‌టీలు. ఆవిరిగా 30 శాతం అంటే 42 ఎంసీఎఫ్‌టీల నీళ్లు పోగా 98 ఎంసీఎఫ్‌టీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.



వడ్డేపల్లి చెరువు సామర్థ్యం 139 ఎంసీఎఫ్‌టీలు. ప్రస్తుత నీటి నిల్వలు 113 ఎంసీఎఫ్‌టీలు. డెడ్‌ స్టోరేజీ 20 ఎంసీఎఫ్‌టీలు. ఆవిరిగా 30 శాతం అంటే 28 ఎంసీఎఫ్‌టీలు పోగా 65 ఎంసీఎఫ్‌టీ నిల్వ ఉంది.


భద్రకాళి చెరువు సామర్థ్యం 150 ఎంసీఎఫ్‌టీలు కాగా ప్రస్తుత నిల్వలు 130 ఎంసీఎఫ్‌టీలు. అందులో డెడ్‌ స్టోరేజీ 20 ఎంసీఎఫ్‌టీలు ఉండగా, నీటి ఆవిరిగా 33 ఎంసీఎఫ్‌టీలు 77 ఎంసీఎఫ్‌టీలు మాత్రమే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top