వాహనం వాడకుండానే బిల్లులు డ్రా


► ఇతర మండలానికి చెందిన ఓ వెహికిల్‌పై రూ.1.45లక్షల బిల్లు డ్రా

► ఆరునెలల వాహనం అలవెన్సు బిల్లు జేబులోకి

► గండేడ్‌ మండల ఇన్‌చార్జ్‌ అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు




గండేడ్‌: క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణకు కేటాయించిన వాహనాన్ని వాడుకోకుండానే ఓ అధికారి ఆరునెలల బిల్లును కాజేశారు. అంతేకాకుండా కార్యాలయ మెయింటనెన్స్‌ డబ్బులను కూడా తన సొంత అకౌంట్‌లో వేసుకుని డ్రా చేశారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా ఆరు నెలల బిల్లు రూ.1.45లక్షలను జేబులో వేసుకున్నారు. గండేడ్‌ మండలానికి ఆయన ఇన్‌చార్జ్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. వివిధ పనుల పర్యవేక్షణ కోసంప్రతినెలా అద్దె వాహనంలో ఆయా గ్రామాలను సందర్శించాలి.



అలాంటి పనులకు సంబంధిత శాఖ అధికారులను, సిబ్బందిని కూడా ఆ వాహనంలోనే తీసుకువెళ్లాలి. ఆ వాహనానికి ప్రతినెలా రూ.24వేల చొప్పున అద్దె చెల్లిస్తారు. కానీ, వాహనం వినియోగించకుండానే కోస్గి మండలం ముస్రిప్ప గ్రామానికి చెందిన మౌలానా టీఎస్‌ 06యూపీ3796 ఇండికా వాహనం పేరున బిల్లులు పంపించి సదరు అధికారి తన ఖాతాలో వేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.



2016 అక్టోబర్‌ నుంచి మార్చి వరకు ప్రతినెలా రూ.24వేల చొప్పున లక్షా 45వేల రూపాయలను ఖాతాలోకి వేసుకున్నారు. జీఎస్‌లో చేసిన పనిని బట్టి 6శాతం కార్యాలయ నిర్వహణకు, పేపర్‌ ఖర్చులకు వినియోగించాలి. కానీ ఆ డబ్బులు కూడా తన ఖాతాలోకి మళ్లించి వాడుకున్నట్లు తెలిసింది.



వేసవిలోకూడా వాహనాన్ని వినియోగించలేదు

ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జలనిధి కార్యక్రమంలో ప్రచారం చేసేందుకు సంబంధిత అధికారులను తీసుకువెళ్లేందుకు ఆయా తేదీల్లో వాహనం కూడా వినియోగించాలి. కానీ గతనెల 24న ఎలాంటి వాహనం లేకుండానే ఎండలో మోటారు బైకులపై అధికారులను తీసుకువెళ్లారు. వచ్చే 9, 13,2 0 తేదీల్లో కూడా ఆ వాహనాన్ని వినియోగించాల్సి ఉంది. ఈ విషయమై సంబంధిత ఈజీఎస్‌ అధికారులు కూడా వాహనాన్ని వాడుకుందామన్నా అందుకు ఆయన ఒప్పుకోనట్లు సమాచారం. ఇలా వాహనం బిల్లులు కాజేసినా, కార్యాలయ బిల్లులు వాడినా అడిగేవారే కరువయ్యారు.



ఎలాంటి నిధులు వినియోగించలేదు: కాళుసింగ్, గండేడ్‌ ఎంపీడీఓ

వాహనం వినియోగించేందుకు నెలచొప్పున 24వేల వచ్చేది వాస్తవమే. గత సంవత్సరం రంగారెడ్డిలో ఉన్నప్పుడు వాహనం వినియోగించాం. బిల్లులు పెట్టాం. కాని ఎలాంటి డబ్బులూ రాలేదు.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top