డబుల్ ధమాకా

డబుల్ ధమాకా - Sakshi


* పేదలకు రెండు లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు, లక్ష పట్టాల పంపిణీ

* గృహ నిర్మాణ పాలసీకి కేబినెట్ ఆమోదం

* రాష్ట్ర మంత్రివర్గ భేటీలో పలు నిర్ణయాలు

* జూన్ 2న భూ క్రమబద్ధీకరణ

* గ్రేటర్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

* 12న కొత్త పారిశ్రామిక విధానం ప్రకటన

* భూకబ్జా ట్రిబ్యునల్ రద్దుకు నిర్ణయం  


 

 సాక్షి, హైదరాబాద్: పేదల కోసం ఇళ్లు కట్టేందుకు నూతన గృహ నిర్మాణ విధానాన్ని రాష్ర్ట మంత్రివర్గం ఆమోదించింది. అర్హులైన నిరుపేదలకు ఓపెన్ టెండర్ల విధానంలో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం సాయంత్రం సచివాలయంలో కేబినెట్ భేటీ  జరిగింది. రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడేందుకు మంత్రులు నిరాకరించారు.

 

 ప్రధానంగా రాష్ట్రావతరణ వేడుకల్లో ప్రకటించే కొత్త కార్యక్రమాలు, పథకాలపై మంత్రివర్గం చర్చించినట్లు సమాచారం.   జూన్ 2నే వాటిని ప్రకటించాలన్న ఆలోచనతో ఆ వివరాలేవీ బయటకురాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జీవో నం.58 ప్రకారం భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న లక్ష మంది పేదలకు అదే రోజున పట్టాలను పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 

 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన చర్చ సందర్భంగా కొత్త గృహ నిర్మాణ విధానాన్ని కేబినెట్ ఆమోదించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండు లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించాలని, వరంగల్‌లోనూ జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇళ్లను కట్టించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇటీవల స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా గుర్తించిన సమస్యల ఆధారంగా నగరాభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని తీర్మానించారు. షేక్‌పేట నాలా ఏరియాలో ఓ ప్రైవేటు కంపెనీకి 29 గుంటల స్థలాన్ని కేటాయించేందుకు కేబినెట్ అంగీకరించింది. రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం చేపట్టిన కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి బీహెచ్‌ఈఎల్‌తో చేసుకున్న ఒప్పందాలను కూడా ఆమోదించింది. నూతన పారిశ్రామిక విధానాన్ని ముందుగా ప్రకటించిన విధంగా జూన్ 7న కాకుండా 12న ఆవిష్కరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

 

ప్రధాని మోదీ, వ్యాపార దిగ్గజాలు, ప్రముఖ కంపెనీల సీఈవోలను ఆహ్వానించి, వారి సమక్షంలో ఈ కొత్త విధానాన్ని ఘనంగా ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక భూ ఆక్రమణల నిరోధక చట్టానికి సవరణలను కేబినెట్ ఆమోదించింది. భూ కబ్జా ట్రయల్ ట్రిబ్యునల్‌ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖలో 13 పోస్టుల భర్తీకి, యాదగిరిగుట్ట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన భూ సేకరణకు ఆమోదం తెలిపింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తలపించేలా నిర్వహించాలని నిర్ణయిం చారు.

 

 పార్లమెంటరీ కార్యదర్శులకు మంగళం!

 వివాదాస్పదంగా మారిన పార్లమెంటరీ కార్యదర్శుల పోస్టులకు ప్రభుత్వం మంగళం పాడనుంది. వీరి నియామకాలకు సంబంధించిన జీవో ఉపసంహరించుకుని, హైకోర్టుకు నివేదించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఎం అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ వ్యవహారంపై చర్చ జరిగిందని తెలిసింది. గతేడాది డిసెంబర్ 29న ఆరుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

 ఈ వ్యవహారం కోర్టుకెక్కడం, వీరి నియామకాలను హైకోర్టు తప్పు పట్టడం తెలిసిందే. దీనిపై జూన్‌లో ప్రభుత్వం కోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్త జీవో జారీ చేసి మళ్లీ నియామకాలు చేపట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. కాగా, ఉస్మానియా వర్సిటీ స్థలంలో పేదలకు ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ చేసిన ప్రకటన వివాదాస్పదమవడంపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చి ందని వినికిడి. అన్ని వర్గాల నుంచి ఈ అంశంపై వ్యతిరేకత వ్యక్తమవ్వడంపై దృష్టి సారించారని తెలి సింది. జూన్ 1న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్న ట్లు తెలిసింది. అలాగే ఈ నెల 29న టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top