ఆవేశం వద్దు..ఆలోచించి చేద్దాం

ఆవేశం వద్దు..ఆలోచించి చేద్దాం


సహజంగా ఉరకలు వేసే యువ ఉత్సాహన్ని తమ విజయ సోపానంగా మలచుకోవాల్సిన యువత ఆ శక్తిని క్షణికానందానికి వినియోగిస్తున్నారు. తమలోని అంతర్గత శక్తుల విలువ తెలియక అందుబాటులో ఉన్న ఆధునిక వనరులతో తాత్కాలిక సంతోషాల కోసం ఖర్చుచేస్తున్నారు. టీవీ వ్యామోహం మొదలుకొని వాహనాల మోజు, ఇంటర్‌నెట్, అర చేతిలో సెల్‌ఫోన్, అభిరుచులకు అనుగణమైన వస్త్ర ప్రపంచం వైపు పరుగులు పెట్టే యువత ఆ ఉత్సాహన్ని పటిష్ట లక్ష్య నిర్దేశం కోసం ఉపయోగిస్తే అద్భుతాలు సాధిస్తారని మానసిక వైద్య నిపుణలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువత కోసం ప్రత్యేక కథనం.

 

ఆకర్షణలు అదుపులో ఉండాలి

విభిన్నమైన ఆశయాలు, ఆకాంక్షల మధ్య అనునిత్యం సమరం సాగించే యువతరం జీవితాన్ని రంగుల కలలా సాగించాలని చూస్తుంది. తమ ఆకర్షణలను అదుపులో పెట్టుకొని అందుకు ఉపయోగపడే వనరులను పురోగతి సోపానాలుగా చేసుకునే శక్తి కూడా తమకు ఉందని మరచిపోతుంది. తమ అభిరుచులను సంతృప్తిపరచడం కోసం గంటల తరబడి కాలాన్ని వెచ్చించ గల సామర్థ్యాన్ని సరైన దారిలోకి మళ్లిస్తే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చన్న విషయాన్ని విస్మరిస్తుంది. ప్రస్తుతం యువతకు అత్యంత ప్రీతిగా మారుతున్న ఇంటర్‌నెట్, సెల్‌ఫోన్, ఆధునిక ద్విచక్ర వాహనాల వినియోగం,స్నేహితులతో విలాస సమయాలనే విస్మరించాల్సిన అవసరం లేకుండానే ఆ వ్యాపకాలను తమకు అనుకులంగా మార్చుకునే అపాయాన్ని వీరు అలవర్చుకోవాల్సి ఉంది.

 

బైక్ అవసరాలకు మాత్రమే...

కాలంతో పాటు పరుగులు పెట్టించేందుకు నేటి యువతరం అత్యావశ్యకంగా భావించే అధునాతన బైక్‌ల వినియోగం నిజానికి తమకు అవసరమా.. లేక అభిరుచా.. అనేది సరిగా బేరీజు వేసుకున్న తరువాత వాటి వైపు మొగ్గు చూపాలి. ప్రత్యామ్నాయ రవాణా వనరులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సొంతగా ఒక వాహనం అవసరం లేదు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది యువతే కావడం గమనార్హం. స్థోమత ఉండి మోటారు వాహనాలను సమకుర్చుకున్నా అది కెరీర్‌కి అమూల్యమైన కాలాన్ని మిగేల్చేందుకు ఉపయోగపడుతుందనుకున్నప్పుడే అంగీకరించాలి. కేవలం వినోదానికి వినియోగించే వస్తువుగా భావిస్తే ప్రాణాలకే ముప్పు కావొచ్చు.

 

ఇంటర్‌నెట్ సరదాలకు వాడొద్దు

ప్రపంచంలోని విజ్ఞాన సర్వస్వాన్ని మన కళ్లముందు ఆవిష్కరించే ఈ సాంకేతిక వనరును మూడొంతుల మంది సరదాలు తీర్చే సాధనంగా ఉపయోగిస్తున్నారు. పాఠ్యంశాలు మొదలుకొని పోటీ పరీక్షల వరకూ అవసరమైన ఏ సమాచారానికైన సిద్దంగా ఉండే ఇంటర్‌నెట్ కేవలం ఆకతాయితనాన్ని, అశ్లీలాన్ని వెతుకుతూ పోతే పురోగతికి బదులు పతనానికి దారితీస్తుంది. అందరికీ అందుబాటులోకి వచ్చిన ఇంటర్‌నెట్ సదుపాయాన్ని వినోద వ్యాపకంగా కాక విజ్ఞాన సేకరణకు అవకాశంగా మార్చుకుంటే యువతకు ప్రయోజనం కలుగుతుంది.

 

సైబర్ నేర ప్రపంచంలో ఇరుక్కోవద్దు

సాంకేతిక విప్లవంలో ప్రధాన భూమిక పోషిస్తున్న సెల్‌ఫోన్ సౌకర్యం దుర్వినియోగం కారణంగా హానికరంగానే మారుతుంది. క్రమశిక్షణాయుతమైన సద్వినియోగంతో తమకు ఎంతో ఉపయోగకరంగా మారాల్సిన సెల్‌ఫోన్ ఇప్పుడు నిర్లక్ష్యం మొదలుకొని నిండు ప్రాణాలను బలి తీసుకునే వరకూ వెళ్తోంది. చివరకు సైబర్ నేర ప్రపంచంలోకి నెట్టేస్తోంది. యువత స్వీయ నియంత్రణ ద్వారా సొల్లు కబుర్లకు, చాటింగ్, పామాజిక అనుసంధాన వెబ్‌సైట్లలో కాలక్షేపానికి కాస్త దూరం పాటిస్తే దుష్ఫలితాల స్థానంలో సత్ఫలితాలను చూడొచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top