వన సంపదను నాశనం చేసుకోవద్దు

వన సంపదను నాశనం చేసుకోవద్దు - Sakshi


అడవులను కాపాడడం మనందరి బాధ్యత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిలుకూరులో హరిత హారానికి శ్రీకారం

బాలాజీ టెంపుల్ ఆవరణలో సంపంగి మొక్క నాటిన సీఎం కుటుంబ సమేతంగా బాలాజీ దర్శనం

సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి:
అటవీ సంపద తరిగిపోవడంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తన చిన్నతనంలో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపించేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వానలు కూడా రాకుండా పోయాయని అన్నారు. శుక్రవారం మొయినాబాద్ మండలం చిలుకూరులో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన సీఎం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘వికారాబాద్ అనంతగిరిలో అద్భుతమైన అడవి ఉండేది. ‘కరీంనగర్, ఆదిలాబాద్ నుంచో ఎవరైనా ఇక్కడికి వచ్చి నెలరోజులపాటు ఉంటే.. తెల్లగ నిగనిగలాడేవోళ్లు.. వాళ్లను చూసిన వాళ్లెవరైనా నీకు గండిపేట నీళ్లు బాగా పడ్డయనేవాళ్లు.. అది గండిపేట నీళ్లలో మహాత్యం..’ అని సీఎం గుర్తుచేశారు.

 

మొక్కల సంరక్షణ గ్రామ సేవకులదే..


మొక్కలు నాటడంలో గ్రామ సేవకులను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ఇద్దరు ఉద్యోగులున్నారు. ఒకరు వీఆర్‌ఓ.. మరొకరు గ్రామ కార్యదర్శి. వీరిద్దరు హరితహారంలో మొక్కల పెంపకాన్ని పర్యవేక్షించారు. ఇక వీఆర్‌ఏలకు పనిలేకుండా పోయింది. వారికి చెట్ల సంరక్షణ బాధ్యత అప్పగించాలి. అని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రతి విద్యార్థిని హరితసైనికుడిలా మార్చే బాధ్యత ఉపాధ్యాయలోకంపై ఉందని ఆయన అన్నారు. చిల్కూరు అర్చకులు కూడా ప్రభుత్వానికి సహాకారం అందించాలని, ప్రతి భక్తుడిని ఒక మొక్క నాటమని సూచించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రులు జోగు రామన్న, మహేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top