రైతులను బలవంత పెట్టొద్దు


మల్లన్నసాగర్ భూసేకరణపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

చట్ట నిబంధనల ప్రకారమే ప్రక్రియ చేపట్టాలని ఉత్తర్వులు

సర్కారు అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం

ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదని వ్యాఖ్య


 

 సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ఎత్తిపోతల పథకం భూసేకరణ కోసం ఒప్పందం చేసుకోవాలంటూ రైతులను బలవంతం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చట్ట నిబంధనలకు లోబడే భూసేకరణ చేపట్టాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణను వేగవంతం చేయడానికే జీవో 123ని జారీ చేశాం తప్ప భూములను బలవంతంగా తీసుకోవడానికి కాదన్న ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకుంటూ ఈ ఉత్తర్వులిచ్చింది.

 

 బలవంతంగా భూములు తీసుకోవట్లేదు: ఏజీ

 ప్రాజెక్టుల భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన జీవో 123ని చట్ట విరుద్ధంగా  ప్రకటించడంతోపాటు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ మెదక్ జిల్లాకు చెందిన రైతులు సేరుపల్లి ఉపేందర్‌రెడ్డి, మరో 14 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గత వారం విచారణ సందర్భంగా భూసేకరణ విధానంపై అఫిడవిట్ సమర్పించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించడం తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (రెవెన్యూ) ప్రదీప్‌చంద్ర రెండు పేజీల అఫిడవిట్‌ను ధర్మాసనం ముందుంచారు.


ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ రైతుల నుంచి తాము బలవంతంగా భూములు తీసుకోవడం లేదని పునరుద్ఘాటించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి నుంచే భూములు కొనుగోలు చేస్తున్నామన్నారు. భూములు ఇవ్వడానికి ముందుకు రాని వారి విషయంలో ఏ రకంగానూ కఠిన చర్యలకు పాల్పడటం లేదని కోర్టుకు నివేదించారు. ఇవే అంశాలను అఫిడవిట్‌లో పొందుపరిచామన్నారు. అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. అయితే తమ వాదనలను వినాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ కోరగా అందుకు అంగీకరించింది.


జీవో 123కి విలువ లేదు: పిటిషనర్ల తరఫు న్యాయవాది

 కేంద్ర ప్రభుత్వం 2013లో తెచ్చిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారమే దేశంలో ఎవరైనా భూములను సేకరించాలి తప్ప, మరో మార్గం లేదని వేదుల వాదించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగిస్తూ జీవో 123ను జారీ చేసిందన్నారు. ఈ అధికారాల ద్వారా తెచ్చిన జీవోకన్నా చట్టానికే ఎక్కువ విలువని, అందువల్ల జీవో 123కు చట్ట ప్రకారం విలువ లేదన్నారు. భూసేకరణ చట్టం లేనప్పుడు జీవో 123 జారీ చేయడంలో అర్థముంటుందని, కానీ 2013 భూసేకరణ చట్టం ఉండగా దాన్ని అమలు చేయకుండా మరో చట్టాన్ని తేవడం, భూములను సేకరించడానికి వీల్లేదన్నారు. జీవో 123 వల్ల బాధితులకు ఎటువంటి లబ్ధి దక్కడం లేదన్నారు. అయితే హైకోర్టు ఈ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top