‘మాస్టర్ ’కు మళ్లీ మార్పులు


సాక్షి, హైదరాబాద్:  హెచ్‌ఎండీఏ విస్తరిత ప్రాంతానికి ప్రస్తుతం అమల్లో ఉన్న మాస్టర్ ప్లాన్ త్వరలో కొత్త రూపు సంతరించుకోనుంది. ఐటీఐఆర్ ప్రాజెక్టుకనుగుణంగా మాస్టర్ ప్లాన్‌ను సవరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈమేరకు మాస్టర్ ప్లాన్‌లో మళ్లీ మార్పులు చేసేందుకు హెచ్‌ఎండీఏ సన్నద్ధమైంది.



కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకునేందుకు వీలుగా ఐటీఐఆర్‌కు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించడంతో ఆ మేరకు కసరత్తు మొదలైంది. నగర పరిధిలో ఇప్పటికే ఉన్న ఏడు మాస్టర్ ప్లాన్లను ఒకే గొడుగు కిందకు తెస్తూ హెచ్‌ఎండీఏ రూపొందిం చిన బృహత్ ప్రణాళికను ఏడాది క్రితం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.

 

మరోమారు మార్పులకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి హెచ్‌ఎండీఏ యాక్టు ప్రకారం... మహా నగరంలో  మరో అథార్టీ ఉండకూడదు. ఇప్పటికే హెచ్‌ఎండీఏ రూపొందించి అమలు చేస్తున్న విస్తరిత ప్రాంత మాస్టర్‌ప్లాన్‌లో ఐటీఐఆర్‌కు ప్రత్యేకంగా భూముల కేటాయింపు జరగలేదు. అదే ఇప్పుడు ఈ మెగా ప్రాజెక్టుకు ప్రతిబంధకంగా మారింది. 



ఐటీఐఆర్ ప్రాజెక్టుతో ‘మహా’ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని యోచిస్తోన్న ప్రభుత్వానికి మాస్టర్‌ప్లాన్ సవరణ ఇప్పుడు ఓ సవాల్‌గా మారింది.  నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్ లోపల సుమారు 202 చ.కి.మీ. మేర 5 జోన్లలో ఐటీఐఆర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో మాస్టర్ ప్లాన్‌లో మార్పులు అనివార్యమయ్యాయి.

   

ఫంక్షనల్ యూనిట్..: ఐటీఐఆర్ కు ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్ రూపొందించాలంటే సాంకేతికంగా ఇబ్బందులతో కూడుకున్న అంశం. ఇది జరగాలంటే ప్రత్యేకంగా ఓ ఫంక్షనల్ యూనిట్‌ను ఏర్పాటు చేసి దానికింద ఐటీఐఆర్‌ను పెట్టవచ్చని హెచ్ ఎండీఏ అధికారుల పరిశీలనలో తేలింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి హెచ్‌ఎండీఏ పరిధిలోనే ఉంచాలని నిర్ణయించారు. 



ఈ కమిటీకి హెచ్‌ఎండీఏ కమిషనర్ చైర్మన్‌గా, ఐటీ సెక్రటరీ కన్వీనర్‌గా, ఫైనాన్స్, ఎంఏ అండ్ యూడీ, టీఎస్‌ఐఐసీ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, పీసీబీ, జీహెచ్‌ఎంసీ, జలమండలి విభాగాల ఉన్నతాధికారులను సభ్యులుగా ప్రతిపాదిస్తూ హెచ్‌ఎండీఏ ఇటీవల ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పంపింది.

 

ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కొత్త కమిటీ ఏర్పాటవుతుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం ఈ కమిటీ రంగంలోకి దిగి ఐటీఐఆర్ కింద ప్రాజెక్టులు ఎక్కడెక్కడ వస్తాయి?  వాటి సరిహద్దులు, సర్వే నంబర్లు వంటివాటిని గుర్తించాల్సి ఉంటుంది. ఆమేరకు ప్రస్తుతం ఉన్న మాస్టర్‌ప్లాన్‌లో కొన్ని మార్పులు చేసి సవరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వేగవంతంగా జరగాలంటే  ఫంక్షనల్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావాలంటున్నారు.

 

మార్పులు అనివార్యం..: హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో ఐటీఐఆర్ కోసం ప్రత్యేకంగా భూ వినియోగాన్ని ప్రతిపాదించక పోవడం వల్లే ఇప్పుడు మార్పులు, సవరణలు అనివార్యమయ్యాయి. నివాస, వాణిజ్య, పబ్లిక్, సెమీ పబ్లిక్, మల్టీపుల్ జోన్లలో ఐటీఐఆర్‌కు అనుమతి ఉంది. నిజానికి ఇవి కాలుష్యరహితమైన సంస్థలు కాబట్టి అన్నింట్లో అనుమతిస్తామని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఐటీఐఆర్‌కు అనుగుణంగా  భూ వినియోగం ఉండాలి గనుక ప్రభుత్వ అనుమతితో ప్రణాళికలో మళ్లీ మార్పులు చేయాల్సి ఉంటుందంటున్నారు.

 

ఇప్పటికే కేంద్రం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టులు ఒక్క మహేశ్వరం మండలంలో తప్ప మిగతావన్నీ  ఔటర్ రింగ్‌రోడ్డు లోపలే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో అవసరమైన మార్పులు చేయడం పెద్ద  సమస్యేమీ కాదని, ప్రభుత్వ నుంచి అనుమతి వస్తే వెంటనే పని ప్రారంభించి మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసేందుకు పక్కాగా ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top