90 నిమిషాల్లో డీఎన్‌ఏ పరీక్ష


* ఎఫ్‌ఎస్‌ఎల్‌లో అమెరికా తయారీ ‘ర్యాపిడ్ హెచ్‌ఐటీ’ యంత్ర ప్రదర్శన

* పరిశీలించిన శాస్త్రవేత్తలు, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీస్ అధికారులు

* కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు



సాక్షి, హైదరాబాద్: కేవలం 90 నిమిషాల్లోనే డీఎన్‌ఏ పరీక్షను పూర్తి చేసే అత్యాధునిక ర్యాపిడ్ హ్యూమన్ ఐడెంటిఫికేషన్(ర్యాపిడ్ హెచ్‌ఐటీ) యంత్రాన్ని దాని తయారీదారులు రాష్ర్టంలో తొలిసారిగా ప్రదర్శించారు. హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్‌ఎస్‌ఎల్)లో గురువారం ఈ ప్రదర్శన జరిగింది. పలువురు శాస్త్రవేత్తలు, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీస్ ఉన్నతాధికారులు హెఐటీ మెషీన్ పనితీరును పరిశీలించారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ కెవిన్ బృందం దీన్ని అభివృద్ధి పరిచింది.



రాష్ట్రానికి వచ్చిన ప్రొఫెసర్ కెవిన్ స్వయంగా హెచ్‌ఐటీ యంత్రాన్ని ప్రదర్శించారు. లాలాజలం, వెంట్రుకలు, రక్త నమూనాల ఆధారంగా వాటిలోని డీఎన్‌ఏను విశ్లేషించి ఆ వ్యక్తి వివరాలను గంటన్నర వ్యవధిలోనే వెల్లడించడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఈ ప్రక్రియకు కనీసం నాలుగు రోజల సమయం పడుతోంది. డీఎన్‌ఏ నమూనాలను సేకరించడం దగ్గరి నుంచి నిపుణులు వాటిని విశ్లేషించి నివేదిక అందించే వరకు క్లిష్టమైన ప్రక్రియ ఉంటుందని ఫోరెన్సిక్ నిపుణులు వివరించారు.



ర్యాపిడ్ హెచ్‌ఐటీ యంత్రం మాత్రం అతి తక్కువ వ్యవధిలోనే సమగ్ర వివరాలు అందించడం విస్మయానికి గురిచేస్తోందన్నారు. దీనివల్ల నేర నిర్ధారణ, కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల జరిగిన వోల్వో బస్సు దగ్ధం ఘటనలో సజీవ దహనమైన దాదాపు 36 మంది ప్రయాణికుల మృతదేహాలను గుర్తించడానికి చాలా సమయం పట్టిన సంగతి తెలిసిందే.



అలాంటి సందర్భాల్లో ఈ యంత్రం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని, ఒక్క రోజులోనే డీఎన్‌ఏ విశ్లేషణ పూర్తవుతుందని ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణులు వివరించారు. అమెరికన్ సంస్థ ఇన్‌టెజెన్ ఎక్స్ తయారు చేసిన ఈ పరికరం విలువ రూ. 3.50 కోట్లు. దీని కొనుగోలుకు రాష్ర్ట ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top