దత్తత జాడేది?


సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో మొత్తం 6,500 చెరువులున్నాయి. వాటిలో పెద్ద చెరువులు (వంద ఎకరాల్లో విస్తరించినవి) 681. వీటికింద 1,56,334 ఎకరాలు సాగవుతోంది. ఇక చిన్న చెరువులు 5,819 ఉన్నాయి. వీటికింద 82,722 ఎకరాల పంట సాగవుతోంది. అయితే ఈ చెరువులను 30 ఏళ్లుగా పట్టించుకునే నాధుడు లేకపోవడంతో ఒండ్రు మట్టితో పూడిపోయాయి. వీటికి వరద వచ్చే కాలువలు కూడా మట్టితో నిండుకొని చెరువుల్లోకి నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోయింది. ఈ నేపథ్యంలో మెజార్టీ చెరువులలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉండడం లేదు. దీంతో వాటికింద సాగవ్వాల్సిన ఆయకట్టు నానాటికీ తగ్గుతోంది. ప్రస్తుత ప్రభుత్వం చెరువులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించింది.

 

 దత్తతకు మూడే..!

 మిషన్ కాకతీయ కింద చెరువుల పూడికకు సంబంధించి ఎవరైనా దాతలు ముందుకు వస్తే వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్కారు పిలుపు జిల్లాలో స్పందన కరువైంది. ఇప్పటివరకు మూడు చెరువులు దత్తత తీసుకునేందుకు మాత్రం దాతలు ముందుకు వచ్చారు. మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత గ్రామానికి చెందిన పెద్ద చెరువును మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్‌రెడ్డి దత్తత తీసుకున్నారు. పెద్దచెరువు పరిధిలో ఆయకట్టు 560 ఎకరాల వ్యవసాయ పొలం సాగులో ఉండేది. కొన్ని సంవత్సరాల నుండి చెరువులో పూడిక పెరగడం, వర్షాధారాలు లేని కారణంగా చెరువులో నీటిచుక్క లేకుండా బోసిపోయింది.

 

 దీంతో అమరచింత సమీపంలోని తండాలతోపాటు పాంరెడ్డిపల్లె, కొంకణవానిపల్లె గ్రామాలలో కూడా భూగర్భజల మట్టం పూర్తిగా పడిపోయింది. దీంతో మిషన్ కాకతీయ ద్వారా పూడికతీసి, బీమా ఎత్తిపోతల ద్వారా భూత్పూర్ రిజర్వాయర్ నుండి అమరచింత మీదుగా ఏర్పాటుచేసిన కాలువ ద్వారా సాగునీటిని ప్రకాష్‌రెడ్డి తపిస్తున్నారు. ఆయన ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసింది. అలాగే ఆమన్‌గల్ మండలంలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన వేముల చెరువు, వీరన్న చెరువును దత్తత తీసుకునేందుకు ఎన్‌ఆర్‌ఐ అర్జున్‌రావు ముందుకు వచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం రెండు చెరువుల అంచనాలను సిద్ధం చేసింది. వేముల చెరువుకు రూ.45లక్షలు, వీరన్న చెరువుకు 13 లక్షల రూపాయలతో అధికారులు ప్రతిపాదనలు చేసి పంపించారు.

 

 పరుగులు తీస్తున్న మిషన్

 మిషన్ కాకతీయ ద్వారా మొదటి విడతలో జిల్లాలో 1,266 చెరువులు ఎంపికయ్యాయి. దీంతో పూడికతో నిండిపోయిన చెరువులు, కుంటల్లోయుద్ధప్రాతిపదికన ఒండ్రుమట్టిని తీయడంతో పాటు వాటికి వచ్చే వరద కాలువలను బాగుపరిచేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో చెరువు స్థాయిని బట్టి రూ.10లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు వీటిని అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఈ మేరకు టెండర్లు నిర్వహిస్తున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top