అధిపతులంతా తెలంగాణకే..


సాక్షి, ఖమ్మం: ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇరు రాష్ట్రాలకు చేసిన ఐఏఎస్, ఐపీఎస్‌ల అధికారుల విభజనలో జిల్లాలోని అధికారులందరూ తెలంగాణ కేడర్‌లోకే వచ్చారు. జిల్లాలోని ముగ్గురు ఐఏఎస్‌లు, ఇద్దరు ఐపీఎస్‌లకు తెలంగాణ కేడర్ దక్కింది. రోస్టర్ పద్ధతిన విభజించిన ఈప్రక్రియలో జిల్లాకు చెందిన  అధికారులు తెలంగాణ కేడర్‌తో ఇక జిల్లాలోనే విధులు నిర్వహించనున్నారు.



 రాష్ర్ట విభజన నేపథ్యంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ అధికారుల విభజనకు కసరత్తు ప్రారంభించినప్పటి నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. తాము ఏ కేడర్‌లోకి వెళ్తామోనని అందరూ ఆందోళనకు గురయ్యారు. నిబంధనలు ఎలా ఉంటాయి..? తాము ఎటు వైపు వెళ్లే అవకాశం ఉంది..? అని గత పదిహేను రోజులుగా ఈ అంశంపైనే అధికారుల్లో చర్చ సాగింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ తొలుత కొంత మంది అధికారులను లాటరీ పద్ధతిన, మరి కొందరిని రోస్టర్ పద్ధతిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విభజించింది. శుక్రవారం ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపకాలను ఈ కమిటీ పూర్తి చేసింది. అయితే జిల్లాలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా తెలంగాణ కేడర్‌లోనే ఉన్నారు.



 అటు వెళ్లి.. ఇటు వచ్చి..

 ఈనెల 1న డాక్టర్ కె.ఇలంబరితి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో పాలనను చక్కదిద్దే పనిలో ఉండగానే ఐఏఎస్‌ల విభజనతో ఆయన ఎటు వైపు వెళ్తారోనని చర్చ జరిగింది. ఒక వేళ ఆయనకు తెలంగాణ కేడర్ దక్కకపోతే కొత్త కలెక్టర్ ఎవరు వస్తారోనని జిల్లాలో చర్చ జరిగింది. అయితే అధికారుల పంపకాల్లో చివరకు ఆయన తెలంగాణ కేడర్ కిందకే వచ్చారని, కలెక్టర్‌గానే జిఆల్లలోనే కొనసాగనున్నారని తేలింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇలంబరితి ..2005 ఐఏఎస్ బ్యాచ్. తొలి నుంచి ఆయన తెలంగాణ కేడర్‌నే కోరుకున్నారు. అలాగే తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐటీడీఓ పీఓ డి.దివ్య కూడా.. ఆమె కోరుకున్నట్లే తెలంగాణ రాష్ట్ర కేడర్‌లోకే వచ్చారు. నల్లగొండకు చెందిన జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ రోస్టర్‌లో తెలంగాణ కేడర్‌లోనే ఉన్నారు.



 ఇద్దరు ఐపీఎస్‌లూ ఇక్కడే..

 ఎస్పీ ఎ.వి.రంగనాథ్‌ను ప్రత్యూష్ సిన్హా కమిటీ తెలంగాణ కేడర్ అధికారిగానే పరిగణనలోకి తీసుకుంది. ఆయన కూడా రోస్టర్‌లో తెలంగాణలోకే వచ్చారు. కరీంనగర్ జిల్లా వాసి, భద్రాచలం ఏఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి కూడా రోస్టర్‌లో తెలంగాణ కేడర్‌లోకే వచ్చారు. దీంతో జిల్లాలోని ముగ్గురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులు తెలంగాణ కేడర్‌లోకి రావడంతో జిల్లాలోనే విధుల్లో కొనసాగనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top