త్వరలో కల సాకారం

త్వరలో కల సాకారం - Sakshi


ఆవిర్భావ దినోత్సవం నాటికి  జిల్లా కేంద్రంగా వికారాబాద్

 

నెరవేరనున్న ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ   

శివసాగర్ చెరువును మినీ ట్యాంక్‌బండ్ చేస్తాం

రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు

దేవాలయాభివృద్ధికి కృషి చేస్తా రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి


 

వికారాబాద్: రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవం నాటికి వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడుతుందని, దీంతో ఈ ప్రాంత ప్రజల కల సాకారం కానుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నూతన రాజగోపుర ప్రారంభోత్సవం, ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపన కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి కోసం ఎంతగానో పాటుపడుతున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారం కాబోతుందన్నారు. సీఎస్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి శివసాగర్ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తామని స్పష్టంచేశారు. సాయంత్ర సమయంలో చిన్నారులు ఆడుకోవడానికి, బతుకమ్మలను నీటిలో వదలడానికి చెరువు చుట్టూ మెట్లను కూడా నిర్మిస్తామన్నారు. వికారాబాద్ పట్టణంలో తాగునీరు, రోడ్లు తదితర సదుపాయాల కల్పనకు నిధులు కేటాయిస్తామన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడితే ఈ ప్రాంత దశాదిశ మారుతుందని ఆయన స్పష్టం చేశారు. మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ. వెంకటేశ్వర దేవాలయ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తానన్నారు.



అంతకు ముందు ఆలయ అర్చకులు మంత్రులకు ఘనస్వాగతం పలికారు. స్వామివారికి మంత్రి హరిశ్వర్‌రావు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అనంతరం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 16న నిర్వహించే బతుకమ్మ వేడుకల పాటల సీడీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంజీవరావు, కాలే యాదయ్య, ఎంపీపీ సామల భాగ్యలక్ష్మి ఎల్లారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ముత్తార్ షరీప్, మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, వైస్ చైర్మన్ సురేష్, మున్సిపల్ కౌన్సిలర్ విజేందర్‌గౌడ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, టీఆర్‌ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుభప్రద్‌పటేల్, టీఆర్‌ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు భూమోళ్ల కృష్ణయ్య, నాయకులు ఎల్లారెడ్డి, రాంచంద్రారెడ్డి, బొత్స శ్రీకాంత్, కిషోర్, గోపి, పాండు, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top