పోరుబాట

పోరుబాట - Sakshi


- ‘ప్రాణహిత- చేవెళ్ల’ పనులను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

- శంకర్‌పల్లి నుంచి పనుల ప్రాంతానికి పాదయాత్ర

- భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజా సంఘాలు

- జవహర్‌నగర్‌లో నేడు పీసీసీ నేతల పర్యటన

సాక్షి, రంగారెడ్డి జిల్లా/ శంకర్‌పల్లి:
ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చొద్దంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పోరుబాట విజయవంతంగా ముగిసింది. పార్టీలో విబేధాలు పక్కనపెట్టిన నేతలు ఐక్యంగా కలిసివచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో శంకర్‌పల్లిలోని అతిథి గృహానికి మాజీ హోంమంత్రి సబితారెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు భిక్షపతి యాదవ్, కూన శ్రీశైలం గౌడ్, సుధీర్‌రెడ్డి, కోదండరాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, మాజీ డీసీసీ అధ్యక్షుడు వెంకటస్వామి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కార్తీక్‌రెడ్డి తదితరులు చేరుకున్నారు.



అక్కడ ప్రాజెక్టు పనులపై చర్చించిన తర్వాత.. అక్కడినుంచి పాదయాత్రగా ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతానికి బయలుదేరారు. చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం.. పక్కనే ఉన్న ఇంద్రారెడ్డి విగ్రహానికి నివాళులర్పించి పోరుబాటను ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోపాటు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు ప్రజాసంఘాలు సైతం మద్దతు పలుకుతూ స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నాయి.

 

ఉత్సాహంగా పార్టీ శ్రేణులు

ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరాభవం పొందిన కాంగ్రెస్ పార్టీ.. మెల్లగా ప్రజల్లోకి వచ్చి ప్రజావ్యతిరేఖ విధానాలను ఎండగట్టేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. పార్టీ శ్రేణుల్ని ఏకతాటిపైకి తీసుకురావడంతోపాటు ప్రజల్లో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గుర్తుచేసే దిశగా అగుడులు వేస్తోంది.

 ఇందులో భాగంగా శుక్రవారం చేపట్టిన ప్రాణహిత -చేవెళ్ల పోరుబాట పార్టీ వర్గాల్లో నూతనోత్తేజాన్ని నింపాయి. కార్యక్రమంలో చేవెళ్లతోపాటు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, వికారాబాద్, పరిగి, రాజేంద్రనగర్ మండలాల నుంచి నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. నాయకులంతా కలిసిమెలసి ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించడంతో కార్యకర్తల్లో ఉత్సహం కనిపించింది. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ జంగారెడ్డి, శంకర్‌పల్లి ఎంపీపీ నర్సింలు, జెడ్పీటీసీ సభ్యుడు కళావతి, శంకర్‌పల్లి, శంషాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవర్దన్‌రెడ్డి, వేణుగౌడ్, శంషాబాద్ సర్పంచ్ రాచమల్ల సిద్దేశ్వర్, నాయకులు నారాయణ, మాణిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

పంటలెండిపోతున్నాయి.. ప్రాణాలు పోతున్నాయి: టి.రామ్మెహన్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీంతో కొందరు ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారని పరిగి శాసనసభ్యులు టి.రామ్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం పరిగిలో ఒక వ్యవసాయ కుటుంబం బలవన్మరనానికి పాల్పడిందని, ఇలాంటి పరిస్థితులు అధిగమించేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు చేపట్టారన్నారు. కానీ కొత్తరాష్ట్రంలో అధికారం చేపట్టిన కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీకి మంచిపేరు రావొద్దనే ఉద్దేశంతో ప్రాజెక్టులో జిల్లాకు అవకాశం లేకుండా చేశారన్నారు.



వెంటనే నిర్ణయాన్ని మార్చుకోకుంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలంతా పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపడతారని మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హెచ్చరిం చారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, యువనేత పి.కార్తీక్‌రెడ్డి, నాయకులు ఎన్.శ్రీధర్, లక్ష్మారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

పీసీసీ ఉద్యమబాట

ప్రభుత్వ భూముల్లో అక్రమాలపై ఉక్కపాదం మోపిన సర్కారు దూకుడును అడ్డుకునేందుకు పీసీసీ ఉద్యమబాట పట్టింది. ఇటీవల ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి సమీపంలోని కొమురంభీంనగర్‌లో గుడిసెలు తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో వేలాది మంది నిర్వాసితులయ్యారు. తాజాగా శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో ఆక్రమణలను తొలగించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో సర్కారు ప్రయత్నాన్ని నిలువరించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చర్యలు చేపడుతోంది. శనివారం జవహర్‌నగర్‌లోని పేదలు ఏర్పాటు చేసుకున్న నివాసప్రాంతాల్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు పలువురు సీనియర్ నాయకులు పర్యటించనున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు భయపడొద్దని, అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్న సందేశాన్ని వారికి చేరవేసి వారిలో ధైర్యాన్ని నింపనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top